కన్నతల్లి Vs పెంచిన తల్లి .. గెలుపెవరిది?

author img

By

Published : May 9, 2022, 2:12 PM IST

Mother Fight for Adopted Son

Mother Fight for Adopted Son : 'కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా.. కన్న అమ్మే కదా' అని ఓ సినీ కవి అన్నట్లు.. కన్నంత మాత్రాన తల్లి కాదు.. తన కడుపున పుట్టకపోయినా గుండెలో పెట్టుకుని చూసే ప్రతి ఆడది కన్నతల్లి కంటే గొప్పది. అలా ఓ రెండు నెలల పసిగుడ్డును దత్తత తీసుకుని.. తన ఆరోప్రాణంగా.. కంటికి రెప్పలా చూసుకుంటున్న ఓ తల్లికి.. అకస్మాత్తుగా ఓ రోజు ఆ బాబు కన్నతల్లి వచ్చి షాక్ ఇచ్చింది. 14 ఏళ్ల తర్వాత వారి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చి.. తన కొడుకుని తనకి ఇచ్చేయాలని అడిగింది. ఇన్నేళ్లుగా తన కంటిపాపలా చూసుకున్న ఆ కుమారుణ్ని తన దగ్గరి నుంచి పంపించడానికి ఆ తల్లికి మనసు రాలేదు. తన కడుపున ఓ బిడ్డ పుట్టినా.. దత్తత తీసుకున్న పిల్లాడిపై ఆ కన్నపేగుకు మమకారం తగ్గలేదు. తన కొడుకుని తనకు దూరం చేయాలని చూస్తూ.. అధికారులతో కలిసి వేధింపులకు గురి చేస్తున్న ఆ బాలుడి అసలు తల్లిపై ఈ పెంచిన తల్లి పోరాటం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన బిడ్డను తన నుంచి దూరం చేసుకోనని భీష్మించుకు కూర్చుంది. ఆ కన్నతల్లిపై పోరాటంలో ఈ పెంచిన తల్లి గెలిచేనా.. 14 ఏళ్లు కడుపులో పెట్టుకుని చూసుకున్న తన గారాలపట్టి తనకు దక్కేనా..

Mother Fight for Adopted Son : దత్తపుత్రుడిని రక్షించుకునేందుకు ఓ తల్లి న్యాయపోరాటం చేస్తోంది. పద్నాలుగు ఏళ్ల క్రితం బాబును ఓ మహిళ వద్ద ఆ దంపతులు దత్తత తీసుకున్నారు. కన్నకొడుకును మరిచిపోయిన ఆ కన్నతల్లి... ఇన్నేళ్ల తర్వాత తన బాబు తనకు కావాలని ఒత్తిడి చేస్తోంది. తన బిడ్డను తనకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని చైల్డ్ వెల్ఫేర్ అధికారులపై ఒత్తిడి పెంచడంతో... వారు పెంచిన తల్లిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఓవైపు తన బిడ్డను కన్న తల్లి.. మరోవైపు అధికారుల వేధింపులు భరించలేక.. తన కుమారుణ్ని దూరం చేసుకోలేక వారిపై పోరాటానికి దిగింది ఆ పెంచిన తల్లి. వారి నుంచి తన బిడ్డను దక్కించుకోవడానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది.

Mother Fight for Adopted Son in Sangareddy : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకి చెందిన రాజేశ్, రమణమ్మ దంపతులు. వారికి సంతానం లేకపోవడంతో 2009లో అదే ప్రాంతానికి చెందిన శారద అనే మహిళ వద్ద రెండు నెలల వయసున్న బాబు అఖిల్‌ను దత్తత తీసుకున్నారు. శారద అనే మహిళ కొండల్ నాయక్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. వారికి వివాహం కాకముందే బాబు పుట్టడంతో.. ఆ పసికందును వదిలించుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి రాజేశ్, రమణమ్మ దంపతులు ఆ పసిబిడ్డను తమకు ఇవ్వాలని.. దత్తత తీసుకుంటామని కోరారు. దీనికి అంగీకరించిన శారద.. గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో అఖిల్‌ను దత్తత ఇచ్చింది. కొంత కాలం తర్వాత శారద కొండల్ నాయక్‌ను వివాహం చేసుకుంది.

"నా కళ్ల ముందే నా కొడుకుని బలవంతంగా లాక్కెళ్లారు. ఒక్కడినే ఒక గదిలో ఉంచారు. కనీసం తనను చూద్దామంటే ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. నా బాబు చాలా ఏడుస్తున్నాడు. వాణ్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. అమ్మా.. నేను ఎక్కడికి వెళ్లను.. నీ దగ్గరే ఉంటా అని వాడు గుండెపగిలేలా ఏడుస్తున్నాడు. వాడి బాధ చూసైనా అధికారులకు కనికరం కలగడం లేదు. కనీసం వాడిని చూడటానికి అనుమతి కూడా ఇవ్వడం లేదు."

- రమణమ్మ, అఖిల్‌ను పెంచిన తల్లి

2015లో శారద, కొండల్ నాయక్‌లు.. రాజేశ్, రమణమ్మల జీవితంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అఖిల్‌ను తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. తన కడుపులో పెట్టుకుని పెంచుకున్న అఖిల్‌ను ససేమిరా ఇవ్వనని రమణమ్మ తేల్చిచెప్పడంతో.. ఈనెల 5న శారద పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 8న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అఖిల్‌ను తమ నుంచి అన్యాయంగా తీసుకెళ్లారని బాధితురాలు రమణమ్మ తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

మరోవైపు అఖిల్.. తనను పెంచిన అమ్మానాన్నల వద్దే ఉంటానని.. ఎప్పటికీ కన్నవాళ్లకి దగ్గరికి వెళ్లనని తేల్చిచెబుతున్నాడు. తాను వెళ్లకపోతే పెంచిన తల్లిదండ్రులను జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని వాపోయాడు. అధికారుల నుంచి.. తన కన్నవాళ్ల నుంచి తనకు, తనని పెంచిన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని కోరుతున్నాడు.

"నన్ను చైల్డ్ వెల్ఫేర్ వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. నన్ను బెదిరిస్తున్నారు. నన్ను కన్నవాళ్ల దగ్గరికి వెళ్లమని చెబుతూ.. ఏవేవో కొనిస్తున్నారు. అవేమి వద్దు.. నన్ను మా ఇంటికి పంపించడి అంటే తిడుతున్నారు. నాకు జ్వరం వచ్చి ఇంటికి వెళ్తానంటే.. మా అమ్మానాన్నల దగ్గరికి వెళ్తే వాళ్లని జైలుకు పంపిస్తామని భయపెడుతున్నారు. నాకు నన్ను పెంచిన వాళ్లే అమ్మానాన్న.. వాళ్లు తప్ప నాకెవరూ తెలియదు. ఎవరూ వద్దు. నేను వాళ్ల దగ్గరే ఉంటా."

- అఖిల్, బాధిత బాలుడు

ఈ సంఘటనపై స్పందించి జులై 7లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ అధికారిని హెచ్‌ఆర్సీ ఆదేశించింది. బాబు తనను కని పెంచిన తల్లి వద్దే ఉంటాడా... కనికరం లేకుండా 2 నెలల వయసులోనే తనను వదిలేసిన కన్నతల్లి చెంతకు చేరుతాడా వేచి చూడాలి.

కన్నతల్లి Vs పెంచిన తల్లి .. గెలుపెవరిది?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.