NCRB Report: తెలంగాణలో మహిళలకు ఆన్‌లైన్‌ వేధింపులు ఎక్కువే!

author img

By

Published : Sep 16, 2021, 9:01 AM IST

NCRB Report

మహిళలపై ఆన్‌లైన్‌ వేధింపులకు సంబంధించిన కేసులు తెలంగాణలో ఆందోళన కలిగించే స్థాయిలో నమోదవుతున్నాయి. 2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టంచేస్తోంది.

2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర నమోదు సంస్థ నివేదిక ప్రకారం.. మహిళలకు సైబర్‌ బెదిరింపుల కేసులు దేశవ్యాప్తంగా తెలంగాణలోనే అత్యధికం(19)గా నమోదయ్యాయి. అలాగే, ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపుల కేసులు మహారాష్ట్రలో గరిష్ఠంగా 388 నమోదు కాగా.. రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో ఇవి 100. ఆన్‌లైన్‌లోనే కాకుండా బయటా మహిళలపై వేధింపుల కేసులు అధికంగానే నమోదయ్యాయి. అతివల్ని వెంబడించి వేధింపులకు పాల్పడుతున్న కేసుల్లో(సెక్షన్‌ 354డి) తెలంగాణది రెండో స్థానం. ఈ సెక్షన్‌ కింద దేశవ్యాప్తంగా 8,229 కేసులు రికార్డయ్యాయి.

మొదటిస్థానంలో ఉన్న మహారాష్ట్రలో 2013 కేసులు నమోదు కాగా.. తెలంగాణలో వాటి సంఖ్య 1436. మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 956 కేసులున్నాయి. మహిళల ప్రతిష్ఠకు భంగం కలిగించిన కేసులు ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 2,342 నమోదు కాగా.. నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణలో వీటి సంఖ్య 565. ప్రజారవాణా వ్యవస్థలో మహిళలకు ఎదురవుతున్న లైంగిక వేధింపుల కేసులు దేశవ్యాప్తంగా 364 నమోదు కాగా.. ఒక్క మహారాష్ట్రలోనే 32 శాతానికిపైగా(117) ఉన్నాయి. తర్వాత మధ్యప్రదేశ్‌లో 59, ఉత్తరప్రదేశ్‌లో 56, కర్ణాటకలో 28, తెలంగాణలో 21 నమోదయ్యాయి. మానవ అక్రమ రవాణా కేసుల్లో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. బాలల పోర్నోగ్రఫీ కేసులూ తెలంగాణలోనే అధికంగా 161 నమోదు కావడం గమనార్హం.

ఏ నేరాల్లో తొలిస్థానంలో ఉన్నామంటే..

  • భౌతికదాడులు చేసి స్వల్పంగా గాయపరిచిన ఘటనలు తెలంగాణలోనే అత్యధికం. దేశంలో ఏకంగా 24.77 శాతం ఘటనలు ఇక్కడే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు 10837 నమోదు కాగా.. తెలంగాణలో ఈ సంఖ్య 2685. తర్వాతి స్థానంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 1799, మధ్యప్రదేశ్‌లో 1392, ఆంధ్రప్రదేశ్‌లో 1150 కేసులున్నాయి.
  • ఇతరుల స్థలాల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడం (క్రిమినల్‌ ట్రెస్‌పాస్‌) సంబంధిత నేరాలు తెలంగాణలోనే ఎక్కువగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 38897 కేసులకుగాను రాష్ట్రంలోనే అత్యధికంగా 6617 కేసులున్నాయి.
  • అంతర్జాలంలో తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసిన కేసుల్లో తెలంగాణలోనే అత్యధికంగా 273 ఉన్నాయి.
  • మానసిక ఆరోగ్య చట్టం, 1987 కింద దేశవ్యాప్తంగా 290 కేసులకుగాను తెలంగాణలోనే ఏకంగా 223 నమోదయ్యాయి.
  • ఆహార కల్తీ కేసుల నమోదులో ఉభయ తెలుగు రాష్ట్రాలే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 3155, తెలంగాణలో 1498 కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం 5165 కేసుల్లో రెండు రాష్ట్రాల్లోనే 90 శాతానికిపైగా కేసులుండటం గమనార్హం.

సైబర్‌ నేరాల్లో ముందువరుసలో..

రాష్ట్రంలో సైబర్‌ నేరాలైతే అదుపు లేకుండా పోతున్నాయి. 2018లో 1205 కేసులు నమోదు కాగా 2019లో 2691కి చేరుకున్నాయి. 2020లో ఈ సంఖ్య ఏకంగా 5024. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 11,907 కేసులు నమోదు కాగా తెలంగాణాది నాలుగో స్థానం. అంశాలవారీగా తీసుకుంటే.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాల్లో 1405 కేసులతో తెలంగాణాది మొదటి స్థానం. ఓటీపీ మోసాల్లో 525 కేసులతో, సైబర్‌ బ్లాక్‌మెయిలింగ్‌లో 49 కేసులతో, క్రెడిట్‌/డెబిట్‌ కార్డు మోసాల్లో 611 కేసులతో, సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తల ప్రసారంలో 135 కేసులతోనూ తొలిస్థానం. ఆన్‌లైన్‌ ఛీటింగ్‌లో 710 కేసులతో రెండో స్థానం, 315 కేసులతో ఏటీఏం మోసాల కేసుల్లో నాలుగోస్థానంలో రాష్ట్రం నిలిచింది.

దళితులపై పెరిగిన దాడులు

  • రాష్ట్రంలో దళితులపై దాడుల ఘటనలూ క్రమేపీ పెరిగాయి. 2018లో 1507, 2019లో 1690 కేసులుండగా 2020లో 1959కి చేరుకున్నాయి.
  • దళిత మహిళలను వెంబడించి వేధింపులకు గురిచేసిన కేసులు మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 53 నమోదుకాగా.. అయిదో స్థానంలో ఉన్న తెలంగాణలో ఈ సంఖ్య 18. అలాగే దళిత మహిళల ప్రతిష్ఠను కించపరిచే కేసులు ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 78 నమోదయ్యాయి. మూడో స్థానంలో ఉన్న తెలంగాణలో ఈ కేసులు 13.
  • దళితులపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో అభియోగపత్రాల నమోదులో జాతీయ సగటు(80.6శాతం) కంటే తెలంగాణ సగటు(78.7) తక్కువగా ఉంది. అలాగే ఈ కేసుల్లో నిందితులకు శిక్షలు వేయించడంలో జాతీయ సగటు 42.4 శాతం కాగా.. తెలంగాణలో కేవలం 3.8 శాతమే.

శిక్షలశాతంలో తీసికట్టు..

  • వృద్ధులపై వేధింపులు/దాడులకు సంబంధించి నమోదైన కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేయడంలో దేశవ్యాప్త సగటు 31.2శాతం కాగా.. తెలంగాణది 21.5 శాతమే.
  • మానవ అక్రమ రవాణా వ్యవహారంలో మొత్తం 186 కేసుల్లో 752 మందిని అరెస్టు చేసి అభియోగపత్రాలు దాఖలు చేశారు. వాటిలో 103 కేసులను కొట్టేశారు. కేవలం రెండు కేసులలో మాత్రమే శిక్షలు పడ్డాయి.
    కొత్త నేరస్థులే అధికం
  • రాష్ట్రంలో నమోదైన ఐపీసీ నేరాల్లో మొత్తం 94,450 మంది అరెస్టు కాగా వీరిలో 85,966 మంది కొత్త నేరస్థులు కావడం గమనార్హం.
  • తెలంగాణలోని మొత్తం కేసుల్లో 1,07,432 మందిని అరెస్టు చేశారు. ఆయా కేసుల్లో అభియోగపత్రాలు దాఖలైన వారిలో 36,379 మందికి శిక్షలు పడగా 20,959 మందిపై అభియోగాలు కొట్టివేశారు.
....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.