స్వచ్ఛ సర్వేక్షణ్​ అవార్డులు 2023లో రాజన్న సిరిసిల్లనే అగ్రస్థానం..

author img

By

Published : Dec 3, 2022, 8:53 PM IST

Clean Survey Awards 2023

Clean Survey Awards 2023: కేంద్ర ప్రభుత్వం 2023గాను ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్​ అవార్డులలో రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రస్థానాన్ని కైవసం చేసుకొంది. మొత్తం 4 స్టార్​ కేటగిరీలతో సిరిసిల్ల జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. ఈ ఆనంద సమయంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఈ విజయానికి కారకులైన అందరినీ అభినందించారు.

Clean Survey Awards 2023: చక్కటి ధృడ సంకల్పంతో అద్భుతం ఆవిష్కరించారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 అవార్డుల్లో 4 స్టార్ కేటగిరీలతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం రావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. గతాన్ని మార్చుకుని ఘనమైన వర్తమానం సొంతం చేసుకుంటున్న సిరిసిల్ల గడ్డ విజయపరంపరలో తాజా పురస్కారాలు కూడా చేరాయని చెప్పారు. ఈ గెలుపుకు కారణమైన సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, జిల్లా అధికారులు, సర్పంచి, వార్డుమెంబర్లు, క్షేత్రస్థాయిలో పని చేసే పంచాయతీ సెక్రటరీతో పాటు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయడంతోనే ఇవాళ దేశవ్యాప్తంగా సిరిసిల్ల పేరు ప్రముఖంగా వినిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో సిరిసిల్ల రాత మార్చే యజ్ఞంలో పనిచేస్తున్న వారందరికి ఈ పురస్కారం అంకితం అన్నారు. ఇదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు మరింత కృషి చేయాలని జిల్లా అధికారులను కోరారు. తాజా పురస్కారాలపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులను అభినందిస్తూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

మీ నిరంతర మార్గదర్శకం, సహకారం వాళ్లే సాధ్యమైందంటూ కలెక్టర్ ట్వీట్ చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్​(గ్రామీణ)లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023 నవంబరు నెలలో ఇచ్చిన పారా మీటర్లు ఆధారంగా సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరిలో మొదటి స్థానం దక్కింది. అన్ని గ్రామాలను ఓడీఎఫ్‌ ప్లస్ కేటగిరిలో ఆదర్శ గ్రామాలుగా ప్రకటించినందుకు దేశంలోనే రాజన్న సిరిసిల్ల మొదటి స్థానం దక్కించుకుంది. ఓడీఎఫ్‌ ప్లస్ నమూనాలు మార్గదర్శకాలకు అనుగుణంగా గృహ స్థాయిలో మరుగుదొడ్లు నిర్మించుకొని ఉపయోగించు కోవడం, అన్ని సంస్థల లోపల మరుగుదొడ్ల వినియోగం, గ్రామాల్లో తడి, పొడి చెత్త సక్రమ నిర్వహణ, కంపోస్ట్ షెడ్ల వినియోగం, అన్ని గ్రామాలలో మురుగు నీటి నిర్వహణ, అన్ని గ్రామాలను పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దడం, ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య సంబంధించి వాల్ పెయింటింగ్స్ ఏర్పరచడం జరిగింది. అవన్నీ పరిగణలోకి తీసుకుని కేంద్రం పురస్కారం ఇచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.