Ramagundam Fertilizer: రెండు దశాబ్దాల తర్వాత ఎరువుల కర్మాగారానికి పూర్వ వైభవం

author img

By

Published : Aug 9, 2021, 9:03 AM IST

urea-production-at-ramagundam-fertilizer-plant

నేడు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారంలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్‌కుబా ఉత్పత్తిపై సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇక్కడ యూరియా తయారుచేయడంతో పూర్వ వైభవం సంతరించుకుంది.

యూరియా కొరత నివారణలో కీలకపాత్రను పోషిస్తున్న పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్‌కుబా సోమవారం పర్యటించనున్నారు. ఇందుకోసం రామగుండం నగరపాలక అధికారులు ఫెర్టిలైజర్‌ సిటీలోని అతిథి గృహాలతో పాటు ఎరువుల కర్మాగారంలో ఏర్పాట్లు చేస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంతో పాటు రామగుండం ఎన్టీపీసీ ఆవరణలో తెలంగాణ విద్యుత్తు ఉత్పాదక కేంద్రం నిర్మాణానికి 2017 నవంబరు 17న గజ్వేలో శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సోమవారం దిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారనే కథనాలు వెలువడినప్పటికీ ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రి పర్యటనకే కార్యక్రమం పరిమితమైంది.

ఫిబ్రవరి 28న రామగుండం ఎరువుల కర్మాగారంలో ప్రయోగాత్మకంగా యూరియా ఉత్పత్తి ప్రారంభించిన అధికారులు లోటుపాట్లను సవరించుకుంటూ జూన్‌ 8న వాణిజ్యపరంగా యూరియా ఉత్పత్తిని ప్రారంభించారు. అప్పటి నుంచి చిన్నాచితకా సమస్యలు ఎదురవుతున్నప్పటికీ వాటిని అధిగమించుకుంటూ ముందుకు సాగుతున్నారు. యంత్రాల్లో ఏర్పడుతున్న సాంకేతిక లోపాల కారణంగా ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యంలో ఉత్పత్తి చేయలేకపోతున్నారు. కొన్నిసార్లు అమ్మోనియా ఇతర ప్రాంతం నుంచి ప్రత్యేక వాహనాల్లో రహదారి మార్గంలో తెప్పిస్తున్నారు.

రెండు దశాబ్దాల తర్వాత పూర్వ వైభవం

రెండు దశాబ్దాల తర్వాత రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్పి ప్రారంభం కావడంతో ఈ ప్రాంతానికి పూర్వవైభవం వచ్చినట్లయింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని మిగతా పరిశ్రమలతో పోల్చుకుంటే ఇందులో ఉద్యోగుల సంఖ్య తక్కువే అయినప్పటికీ ఫెర్టిలైజర్‌సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో నూతనోత్సాహం నెలకొంది. 1970 అక్టోబరు 2న రామగుండంలో ఎఫ్‌.సి.ఐ. ఎరువుల కర్మాగారం నిర్మాణానికి అప్పటి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డాక్టర్‌ త్రిగుణ్‌సేన్‌, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేయగా 1980 నవంబరు 2న వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభమైంది. సుమారు రెండు దశాబ్దాల పాటు యూరియా ఉత్పత్తిలో అగ్రగామిగాఉన్న ఎఫ్‌.సి.ఐ. ఎరువుల కర్మాగారంలో నష్టాల పేరిట 1999 మార్చి 31న అర్ధరాత్రి ఉత్పత్తి నిలిపివేశారు.

ఇక అప్పటి నుంచి ప్రజాప్రతినిధులు, నాయకుల ప్రయత్నాలు, కార్మికుల ఆందోళనకు తోడుగా తీవ్రమవుతున్న ఎరువుల కొరత కారణంగా మూతపడ్డ ఎఫ్‌.సి.ఐ. ఎరువుల కర్మాగారం స్థానంలో రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌.) నిర్మాణం చేపట్టారు. దీంతో రామగుండం పారిశ్రామిక ప్రాంత మణిహారంలో మరో పరిశ్రమకు చోటు దక్కింది. యూరియా ఉత్పత్తి రంగంలో విశిష్ట అనుభవం గడించిన సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటయిన ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌. ఉత్పత్తయ్యే ఎరువులో 50 శాతం తెలంగాణ ప్రాంత రైతులకే సరఫరా చేస్తూ అన్నదాతలకు అండగా నిలవనుంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయిన యూరియాను మొదటి సారిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి బహూకరించిన అధికారులు ఆ తర్వాత తెలంగాణ ప్రాంతానికే సరఫరా చేశారు.

సిద్ధంగా ఉన్న యూరియా సంచులు

పర్యటన వివరాలు..

ఉదయం 9:30కి ఫెర్టిలైజర్‌ సిటీలోని వీఐపీ అతిథి గృహానికి రాక. ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌. అధికారుల ఘనస్వాగతం. 10 గంటలకు వీఐపీ అతిథి గృహం ఆవరణలో మొక్కలు నాటడం. 10:30కి రామగుండం ఎరువుల కర్మాగారంలో పరిశీలన. 11:45కు ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌.అధికారులతో సమీక్ష సమావేశం. 12:45లకు వీఐపీ అతిథి గృహంలో భోజనం. మధ్యాహ్నం 1:30కి తిరుగు ప్రయాణం.

ఉపాధి కల్పనపైనే ఆందోళనలు

రెండు దశాబ్దాల తర్వాత రామగుండం ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేయనున్నారని తెలియగానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఆశలు ఈ ప్రాంత నిరుద్యోగ యువతలో వెల్లివిరిసాయి. తీరా కర్మాగారం నిర్మాణం పనులు మొదలైనప్పటి నుంచి మొదలుకొని ఉత్పత్తి ప్రారంభించేంత వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకే అత్యధిక ఉపాధి లభించగా స్థానికులకు నామమాత్రమే. ప్రభావిత గ్రామాలకు చెందిన నిరుద్యోగులు, మూతపడ్డ ఎఫ్‌.సి.ఐ. ఎరువుల కర్మాగారంలో పనిచేసిన ఉద్యోగులు, అధికారులు, ఒప్పంద కార్మికుల పిల్లలకు ఉపాధి కల్పించాలంటూ స్థానిక ఎమ్మెల్యేతో పాటు వివిధ వర్గాలు ఎరువుల కర్మాగారం ముందు ఆందోళన చేసిప్పటికీ ఆశించిన ప్రయోజనం చేకూరలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి: Drunken Driving: 'ఒక్క ఫోన్ చేస్తే మీ బతుకులు బజారున పడతాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.