ఇక్కడి రాఖీలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.. ఏంటో తెలుసా?

author img

By

Published : Aug 9, 2022, 6:11 PM IST

rakhi

పెద్దపల్లి ఎస్‌ఆర్‌ఆర్‌ రాఖీలకు మంచి ఆదరణ వస్తోంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా రాఖీలు రూపొందిస్తున్నారు. నాణ్యత, మన్నికను దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తూ...దాదాపు ఐదు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అంతేకాదు దాదాపు రెండు వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.

Special story on Peddapalli SRR Rakhees: పెద్దపల్లిలోని ఎస్‌ఆర్ఆర్ రాఖీల తయారీ కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఇక్కడ 30 వేల రకాల రాఖీలు తయారు చేస్తున్నారు. రూపాయి నుంచి 300 వరకు ధర వరకు అందుబాటులో ఉంచుతున్నారు. 35ఏళ్లుగా రాఖీల వ్యాపారంలో కొనసాగిన కృష్ణమూర్తి.. ఆరేళ్ల క్రితం 30 మందితో తయారీ కేంద్రం ప్రారంభించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌..మార్గాల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. మొదట్లో పెద్దపల్లి పరిసర ప్రాంతాలకే పరిమితమైనప్పటికీ... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనిద్వారా 2 వేల మంది ఉపాధి పొందుతున్నారు. సీజన్‌లో రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నారు.

మేం మొదటగా ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాం. తర్వాత ఇంటి దగ్గర రాఖీలను తయారు చేసి తీసుకువస్తాం. ఎంతో మహిళలకు బయటకు వెళ్లకుండా ఉపాధి కల్పిస్తోంది. రోజుకు 350 రూపాయలు వస్తాయి. బయట పనికి పోకుండా ఈ పనే చేస్తున్నాం. సంవత్సరం పొడవునా ఉంటుంది. పిల్లలకు చేతి ఖర్చులకు వస్తోంది. ఏ రోజు డబ్బులు ఆరోజే ఇస్తారు. చాలా బాగుంది. - మహిళలు

raksha bandhan 2022: వ్యాపారులు గతంలో వరంగల్‌, హైదరాబాద్‌లోని బేగం బజార్‌ నుంచి రాఖీలు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం పెద్దపల్లికి తరలివెళ్తున్నారు. మిగతాచోట్లతో పోలిస్తే ధరలు చాలా తక్కువగా ఉన్నాయని....రాఖీలు మన్నికగా బాగున్నాయని తెలిపారు. కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని వ్యాపారులు పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి ఏటా క్రయవిక్రయాలు పెద్దపల్లి నుంచే జరుపుతామని వెల్లడించారు.

రాఖీలు చాలా బాగున్నాయి. ఇదివరకు ముంబయి, దిల్లీ నుంచి తెచ్చినా... అంతంతమాత్రమే ఉండేవి. కానీ ఇక్కడ చాలా తక్కువ రేటులో మంచి క్వాలిటీలో రాఖీలు ఉన్నాయి. మంచి మంచి ఐటెమ్స్ ఉన్నాయి. నేను లక్ష రాఖీలు కొన్నాను. అవి అమ్ముకుని మళ్లీ కొనడానికి వచ్చాను. నెక్ట్స్‌ టైం కూడా ఇక్కడికే వస్తాం. -రాఖీలు కొనే వ్యాపారులు

raksha bandhan special: బెంగాల్‌ తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయించే రాఖీలకు ధర అధికంగా ఉన్నా ఒక్కరోజులో ఊడిపోతున్నాయని తయారీదారులు పేర్కొన్నారు. అలా జరగకుండా ఉండటంతో పాటు మహిళలకు ఏడాదిపాటు పని కల్పించాలనే లక్ష్యంతో తయారీ కేంద్రాన్ని ప్రారంభించినట్టు ఇల్లందుల కృష్ణమూర్తి పేర్కొన్నారు. తక్కువ ధరకే నాణ్యమైన రాఖీలు ఇస్తుండటంతో ఇతర రాష్ర్టాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయని వెల్లడించారు. మన్నికతో పాటు ఏడాది పొడవున మహిళలకు ఉపాధి కల్పిస్తుండటంతో పెద్దపల్లికి రాఖీల తయారీలో సరికొత్త గుర్తింపు వచ్చింది.

ఎక్కడి తెప్పించి.. మనం ఇక్కడ అమ్మడం ఎందుకు.. మనమే ఇక్కడ సొంతంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాం. మొదటగా 100 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ మహిళలకు ఏం నచ్చుతాయో అవి తయారు చేయించడం చేయించాం. అందరికి నచ్చే రాఖీలు ఇక్కడ తయారు చేయడం జరిగింది. - ఇల్లందుల కృష్ణమూర్తి, రాఖీ తయారీ కేంద్ర నిర్వాహకుడు

ఇక్కడి రాఖీలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.. ఏంటో తెలుసా?

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.