నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్​ పవర్ ప్రాజెక్ట్​.. జాతికి అంకితమిచ్చిన మోదీ

author img

By

Published : Jul 30, 2022, 3:56 PM IST

Modi inaugaurated Solar Project:

Modi inaugaurated Solar Project: విద్యుద్దీకరణతో ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని సౌరవిద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ రామగుండంతో పాటు పలు రాష్ట్రాల్లోని సౌర విద్యుత్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో ‘ఉజ్వల భారత్‌- ఉజ్వల భవిష్యత్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు

Modi inaugaurated Solar Project: విద్యుద్దీకరణ తర్వాత జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయని ప్రధాని మోదీ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో(ramagundam) నీటిపై తేలియాడే 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని వర్చువల్‌ పద్ధతిలో జాతికి అంకితం చేశారు. అలాగే కేరళలో 92 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును అంకింత చేసిన ప్రధాని, రాజస్థాన్‌లో 735 మెగావాట్ల ప్రాజెక్ట్​, గుజరాత్‌లోని హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో ‘ఉజ్వల భారత్‌- ఉజ్వల భవిష్యత్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ వినియోగదారులను ఉద్దేశించి ఆయన వర్చువల్‌ వేదికగా ప్రసంగించారు. రామగుండం ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టును నరేంద్రమోదీ ప్రారంభించారు.

రూ.423 కోట్లతో..: ఎన్టీపీసీ యాజమాన్యం జలాశయంపై రూ.423 కోట్లతో 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సౌర విద్యుత్తు కేంద్రాన్ని(solar power project) నిర్మించింది. రెండేళ్లపాటు నిర్మాణ పనులు సాగాయి. దాదాపు 500 ఎకరాల జలాశయం నీటిపై సౌర విద్యుత్తు కేంద్రం నిర్మాణం చేపట్టారు. 40 బ్లాకుల్లో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాక్‌లో 2.5 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్తు ఉత్పత్తి చేపడ్తున్నారు. హెచ్‌డీపీఈ(హై డెన్సిటీ పాలీఇథలిన్‌)తో తయారు చేసిన ఫ్లోటర్లపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. జులై 1న 100 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తిని వాణిజ్యరంగంలోకి తీసుకువచ్చారు. సాధారణ ఎండలో రోజుకు 5 లక్షల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 2 లక్షల యూనిట్లను గోవా రాష్ట్రానికి అందిస్తుండగా, మిగతా 3 లక్షల యూనిట్లను విపణికి సరఫరా చేస్తున్నారు.

విద్యుదీకరణ అనంతరం దేశ ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులపై హిమాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, విశాఖపట్నం, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌ వాసులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సోలార్ విద్యుత్​తో పాటు హైడ్రోజన్ గ్యాస్ వల్ల కలిగే ప్రయోజనాలు దేశ ప్రజలకు చేరబోతున్నాయని మోదీ తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం దేశంలో కరెంటు కోతలు, సరఫరాలో ఇబ్బందులు ఉండేవని తెలిపారు. దేశంలో ఉత్పత్తి, పంపిణీ, వినియోగ స్థితిని మెరుగు పరచడానికి ఎన్నో ప్రణాళికలు అమలు చేస్తున్నామని వెల్లడించారు.

నాణ్యమైన విద్యుత్ ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రణాళిక రూపొందించడమే కాకుండా సంస్కరణలో భాగంగా స్మార్ట్ మీటర్లు ప్రవేశ పెట్టామని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టులు మన దేశంలో ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ, కేరళలో జాతికి అంకితం చేసిన రెండు ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు దేశంలోనే అతి పెద్దవని తెలిపారు. ఫ్లోటింగ్ సోలార్​తో సూర్యరశ్మి, విద్యుత్​తో పాటు నీరు ఆవిరి కాకుండా సంరక్షిస్తాయన్నారు.

కొన్ని రాష్ట్రాలు విద్యుత్ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని మోదీ విమర్శించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా.. తమ ఐదేళ్ల పాలన గడిస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఇది దేశానికి చాలా ప్రమాదకరమన్నారు. చాలా రాష్ట్రాల్లో పాత విద్యుత్ లైన్ల ద్వారా సరఫరా చేస్తూ నష్టాల బారిన పడుతున్నాయని వెల్లడించారు. విద్యుత్ పంపిణీ సంస్థల్లో నష్టాల్లో కూరుకుపోతున్నా ఇంకా సబ్సిడీలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి చర్యలు భవిష్యత్తును మరింత అంధకారంలోకి నెడతాయని వివరించారు.

విద్యుత్ రంగాన్ని రాజకీయాలతో ముడిపెట్టకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ సూచించారు. గత ఎనిమిదేళ్లలో సంస్కరణలు చేపట్టకపోతే దేశపరిస్థితి మరింత దారుణంగా ఉండేదన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యుత్ రంగాన్ని బలపర్చేందుకు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఈ రోజు చేసిన కార్యక్రమాలు రాబోయే 25 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసామని మోదీ వెల్లడించారు.

ఇవీ చదవండి: దేశానికి ఆదర్శం.. రామగుండం సౌర విద్యుత్తు కేంద్రం!

బాలుడి ప్రయోగం.. యూట్యూబ్ చూసి మద్యం తయారీ.. స్నేహితుడికి తాగించగానే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.