Farmers protest : ప్రకృతి వనం ఏర్పాటుకు అధికారులు.. అడ్డుకున్న రైతులు

author img

By

Published : Aug 1, 2021, 10:46 AM IST

ప్రకృతి వనం ఏర్పాటుకు అధికారులు

ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న భూమిలో ప్రకృతి వనం ఏర్పాటు చేస్తామంటూ వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో చోటుచేసుకుంది. మరోవైపు.. తహసీల్దార్ తమకు ఆ భూమినే కేటాయిస్తూ అనుమతులు జారీ చేశారని అధికారులు చెబుతున్నారు.

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 615లో మెగా పార్క్, పల్లె ప్రకృతి వనం కోసం భూమిని గుర్తించి హద్దులు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని చదును చేయడానికి ఆదివారం ఉదయం.. జేసీబీ, ట్రాక్టర్లతో అధికారులు వెళ్లారు. ఆ భూమిలో తమకు పట్టాలున్నాయని.. ఏళ్ల తరబడి ఆ భూమిలో సాగుచేసుకుంటున్నామని రైతులు అన్నారు. తమకు కేటాయించిన భూములు లాక్కోవడం సరికాదంటూ.. ప్రకృతి వనం పనులను అడ్డుకున్నారు.

ఖమ్మంపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 615లో గల భూమిలో గత 30 సంవత్సరాలుగా 17 ఎస్సీ కుటుంబాలు, 12 మంది బీసీ బలహీనవర్గాలకు చెందిన కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ప్రకృతి వనం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండటంతో రైతులు అధికారులను అడ్డుకున్నారు. ఆ భూమిలో ఇప్పటికే పంట సాగు చేస్తున్నామని, వారంతా అక్కడే ఉండి ప్రకృతి వనం పనులు నిలిపి వేశారు.

" మా తాతల నాటి నుంచి ఈ భూమిలో వ్యవసాయం చేస్తున్నాం. ఈ భూమికి సంబంధించి మా వద్ద పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఉన్నాయి. దీనిపై బ్యాంక్ క్రాప్​లోన్ కూడా మంజూరు చేసింది. పల్లె ప్రకృతి వనం ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు కూడా వేశాం. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా అందాయి. అయినా.. అధికారులు కోర్టు ఉత్తర్వులు పట్టించుకోవడం లేదు. "

- మాట్ల రవి, బాధితుడు

ఎస్సీలు, బీసీలకు సంబంధించిన భూములు తీసుకోవడం కరెక్ట్ కాదని ఖమ్మంపల్లి సర్పంచ్ సముద్రాల రమేశ్ అన్నారు. గ్రామసభలో ప్రజలందరు వ్యతిరేకించినా.. కొంతమంది వార్డుసభ్యుల ఆమోదంతో భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పేదల భూములు లాక్కుంటే తన పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

"ముత్తారం తహసీల్దార్ తమకు ఖమ్మంపల్లి గ్రామంలో 615 సర్వేనెంబర్​లో పల్లె ప్రకృతి వనం, మెగా పార్క్ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఆ ప్రకారమే పల్లె ప్రకృతి వనం, మెగా పార్క్ ఏర్పాటు పనులు ప్రారంభించడానికి వెళ్లాం. కానీ.. అక్కడి రైతులు మమ్మల్ని అడ్డుకున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం."

- వేణు మాధవ్, మండల పంచాయతీ అధికారి

ప్రకృతి వనం ఏర్పాటుకు అధికారులు

ఇదీ చదవండి : Lal Darwaza Bonalu: వైభవంగా లాల్ దర్వాజ బోనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.