Sridhar Babu: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ప్రజలపై భారం: శ్రీధర్ బాబు

author img

By

Published : Jul 12, 2021, 4:46 PM IST

Congress Manthani MLA sridhar babu

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నాయని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​ బాబు విమర్శించారు. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇంధన ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు అప్పుల పాలవుతున్నారని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు అన్నారు. పెట్రోల్​, డీజిల్ ధరలు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఎడ్లబండ్లు, సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి హనుమాన్ టెంపుల్ నుంచి అంబేడ్కర్​ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ఇంధన, నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రూ.63 ఉన్న లీటర్ పెట్రోలు భాజపా ప్రభుత్వంలో వందరూపాయలు దాటిందని మండిపడ్డారు. ధరలు పెరగడం వల్ల ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి జీతం సరిపోక అప్పులపాలవుతున్నారని అన్నారు.

ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో..

రైతులకు రైతుబంధు ఇస్తున్నామని చెప్పుకుంటున్న తెరాస ప్రభుత్వం పెట్రోల్, డీజిల్​పై పన్నుల వసూళ్లు చేస్తోందని ఆరోపించారు. ఒక చేత్తో డబ్బులు ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారని ఆయన విమర్శించారు. ఇంధన ధరలతోపాటు ఎరువులు కూడా పెరిగి రైతులకు వ్యవసాయంపై పెట్టుబడి భారమవుతోందని తెలిపారు. ధరలు పెరగడం వల్ల రైతులకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. జిల్లాలో అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై క్వింటాల్ ధాన్యానికి 10 కిలోలకు పైగా తరుగు తీస్తున్నారని శ్రీధర్​ బాబు ఆరోపించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదన్నారు. రైతుబంధు,ఆసరా పెన్షన్లు అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి మంచి గిట్టుబాటు ధర పెంచి ధాన్యాన్ని కొనుగోలు చేసుకోవాలని డిమాండ్ చేశారు.

కేంద్రానికి వత్తాసు పలుకుతున్నారు

కేంద్ర ప్రభుత్వానికి, తెరాస ప్రభుత్వం మద్దతు పలుకుతోందని శ్రీధర్​ బాబు విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రజలు విసుగు చెందారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలపై ఆందోళనలు చేసిన భాజపా నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. నిత్యావసరాలు, పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించే వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు,రాస్తారోకోలు చేస్తామని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ఇవాళ లీటర్​ పెట్రోల్, డీజిల్​ ధరలు వంద రూపాయలు దాటాయి. ధరల పెంపుతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్​ హయాంలో ధరలు పెరిగితే ఆందోళనలు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు సమాధానం చెప్పాలి. మారుమూల ప్రాంతమైన భూపాలపల్లిలో జరుగుతున్న నిరసన దిల్లీ వరకు వినిపించాలి. కాంగ్రెస్ హయాంలో 2013లో రూ.63 ఉన్న పెట్రోల్ ధరలు నేడు వంద దాటిపోయింది. రైతు సోదరులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ స్థాయి ధరలకు అనుగుణంగా పన్నులు తగ్గించాలి. వంట నూనెలు, ఇంధన ధరల పెరుగుదలతో సామాన్య ప్రజానీకం అల్లాడుతున్నారు. మరోవైపు రైతన్నలు డీజిల్ కొనాలన్నా భయపడాల్సిన పరిస్థితికి తెచ్చారు. మీరిచ్చే రైతుబంధు పథకం డబ్బులు పెరిగిన పెట్టుబడులకు ఏమాత్రం సరిపోక రైతన్నలు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. ధరలు తగ్గాలంటే కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రావాలన్నారు.- దుద్దిళ్ల శ్రీధర్​ బాబు, మంథని ఎమ్మెల్యే

ఇవీ చూడండి:

CONGRESS PROTEST: సీఎం మీటింగ్​లు పెట్టొచ్చు... మేము ధర్నా చేయకూడదా?

కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలో అపశ్రుతి.. ఎడ్లబండిపై నుంచి జారిపడిన దామోదర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.