Bodan Commercial Taxes Department Scam : బోధన్ వాణిజ్యపన్నుల శాఖ కుంభకోణంలో.. మరో నలుగురు అరెస్ట్​

author img

By

Published : May 16, 2023, 6:05 PM IST

Updated : May 17, 2023, 6:22 AM IST

Bodan scam

18:00 May 16

బోధన్ వాణిజ్యపన్నుల శాఖ కుంభకోణంలో నలుగురు అరెస్టు

Bodhan Commercial Taxes Scam : బోధన వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో మరో నలుగురు అరెస్ట్ అయ్యారు. విజయ్ కుమార్, రాజయ్య, సాయిలు, స్వర్ణలతను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి కరీంనగర్ లోని అనిశా కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి రిమాండ్ కు ఆదేశించడంతో, నలుగురిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. సింహాద్రి లక్ష్మీశివరాజు, అతని కుమారుడు వెంకట సునీల్ నకిలీ చలాన్ల కుంభకోణానికి సూత్రధారులుగా వ్యవహరించారు.

వాణిజ్యపన్నుల శాఖలోని అధికారుల సహకారంతో నకిలీ చలాన్లు సృష్టించి, అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి విక్రయించారు. 2012 నుంచి నకిలీ చలాన్లు విక్రయిస్తూ వచ్చారు. దీనివల్ల ఖజానాకు 231కోట్ల నష్టం వాటిల్లింది. 2017లో బోధన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఈ కేసులో ఇది వరకే 17మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని సీఐడీ అధికారులు తెలిపారు.

ఫోరెన్సిక్​ రిపోర్ట్​ ఆలస్యం : అంతకు ముందు ఈ కేసులో దర్యాప్తుకు సాంకేతిక అంశాలు మరింత అడ్డుపడ్డాయి. రూ. 231 కోట్ల కుంభకోణానికి సంబంధించి.. ఎఫ్​ఎస్​ఎల్​ నుంచి ఫోరెన్సిక్​ ఆడిటింగ్​కు సంబంధించిన నివేదిక ఆలస్యమవుతుండటంతో దర్యాప్తునకు బ్రేకులు పడుతున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న ట్రేడర్ల చేతిరాతను తేల్చడంలో ఈ నివేదిక కీలకం. రెండేళ్ల కిందటే కేసుకు సంబంధించిన కీలకపత్రాల్ని తెలంగాణ సీఐడీ ఎఫ్​ఎస్​ఎల్​కు పంపించింది. ఫోరెన్సిక్​ ల్యాబ్​లో సరైన వసతులు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఆలస్యమైంది.

2017లోనే బయటపడిన కుంభకోణం : ఈ కుంభకోణానికి సంబంధించి 2017లోనే బోధన్​ పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక మొత్తంలో నగదు చేతులు మారిందని భావించి.. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఐడీని రంగంలోకి దించింది. దీంతో సీఐడీ పలు రకాల ఆధారాలను సేకరించింది. ఈక్రమంలోనే కుంభకోణంతో సంబంధముందని అనుమానిస్తున్న 9 మంది ట్రేడర్లకు సంబంధించిన.. కేవైసీ వివరాలను సేకరించారు. చేతిరాత, సంతకాలను ఆయా బ్యాంకుల నుంచి సీఐడీ తీసుకుంది. మరోవైపు నకిలీ చలానాలపై ఉన్న చేతిరాతల్ని పరిశీలించి.. కేవైసీ, నకిలీ చలానాలపై ఉన్న చేతిరాతలు సరిపోతున్నాయా..? అని తేల్చేందుకు ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ నిర్వహించింది. ఇందుకోసం తాము సేకరించిన పత్రాల్ని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించింది. దీనిలో ఇది వరకే 17 మందిని అరెస్ట్​ చేశారు. ఇప్పుడు మరో 4గురు వ్యక్తులను అరెస్ట్​ చేసి.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 17, 2023, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.