అతని సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది

author img

By

Published : Dec 13, 2019, 7:17 AM IST

physically handicapped person is driving a car without using legs in nizamabad district

సాధించాలన్న పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యమైనా చిన్నబోవాల్సిందే. అందుకే ఆ యువకుడి లక్ష్యం ముందు వైకల్యం సైతం ఓడిపోయింది. నాలుగేళ్ల వయసులో పోలియో సోకినా ఏదో సాధించాలన్న కసి అతన్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టింది. అందరిలానే కారు నడపాలనుకున్న తన కలకు కాళ్లు సహకరించలేదు. అయినా పట్టు విడలేదు. కాళ్లు లేకపోయినా.. చేతులతో కారు నడిపి అబ్బురపరుస్తున్నాడు. సంకల్పిస్తే.. సాధించనిది ఏదీ ఉండదని నిరూపించాడు నిజామాబాద్​ జిల్లా బోధన్​కు చెందిన నగేశ్​.

అతని సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మందర్న గ్రామానికి చెందిన రావుబా సంభాజీ, శ్యామల దంపతులకు నగేష్ నాలుగో సంతానం. నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వైకల్య బాధను క్రమంగా మర్చిపోయి అందరిలా జీవించడం అలవాటు చేసుకున్నాడు. ఎంఎస్సీ చదివిన నగేశ్​ ఆరు నెలలు బెంగళూర్​లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్​గా పని చేశాడు.

అప్పుడే కారు డ్రైవింగ్​పై దృష్టి

2013లో బెంగళూరు నుంచి ఇంటికి తిరిగివచ్చిన నగేశ్..​ బోధన్ మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ హోదాలో తాత్కాలిక ఉద్యోగిగా చేరాడు. అప్పుడే.. కారు డ్రైవింగ్ పై దృష్టి సారించాడు. కానీ కాళ్లు లేకుండా ఎలా నడపాలో అతనికి అర్థం కాలేదు. కాళ్ల సాయం లేకుండా.. చేతులతోనే కారు నడిపే విధంగా కారులో మార్పులు చేయలేమా అనే ఆలోచన అతన్ని తొలచింది.

కాళ్లతో కాదు చేతులతో

సెకండ్ హాండ్​లో కారు తీసుకుని హైదరాబాద్​లోని ఓ మెకానిక్​కు తన ఆలోచన వివరించాడు. మూడ్రోజుల పాటు శ్రమించి నగేశ్​ ఆలోచనలు, మెకానిక్​ సూచనలతో.. చేతులతోనే నడిపే విధంగా కారులో మార్పులు చేశారు. సాధారణంగా.. క్లచ్, ఆక్సిలరేటర్, బ్రేక్ కాళ్ల కింద ఉంటాయి. వీటిని చేతితో నడిపే విధంగా నగేష్ మార్పులు చేయించాడు. దీని కోసం రూ.8వేలు అదనంగా ఖర్చు చేశాడు.

ఇలా నడుపుతున్నాడు

ఇప్పుడు.. ఎడమ చేతితో స్టీరింగ్, కుడి చేతితో క్లచ్, బ్రేక్, ఆక్సిలరేటర్​ను ఆపరేట్ చేస్తూ కారు నడుపుతున్నాడు. స్టీరింగ్​కు సైతం ఒక పరికరం అమర్చడం ద్వారా ఒక చేతితోనే పూర్తిగా మలిపేలా చూసుకున్నాడు.

  • కాళ్ల కింద ఉన్న క్లచ్, బ్రేక్, ఆక్సిలరేటర్ లకు ప్రత్యేక పరికరాలు అమర్చి కుడి చేతికి అందే విధంగా మార్చారు.
  • సైకిల్ హ్యాండ్ లా ఉండే దానికి క్లచ్, బ్రేక్ అమర్చారు.
  • కొంచెం నొక్కితే క్లచ్ పట్టేలా, సగానికి ఎక్కువ నొక్కితే బ్రేక్ పడేలా తయారు చేశారు.
  • కుడి చేతి బొటన వేలుకు అందేలా ఆక్సిలరేటర్​ను మార్చారు.
  • బ్రేక్, క్లచ్ ఒకే హ్యాండ్ కు, బొటన వేలికి ఆక్సిలరేటర్​కు అందేలా చూశారు.

కారులోనే కార్యాలయానికి

నగేశ్​ .. ప్రతి రోజూ కారులోనే కార్యాలయానికి విధుల నిమిత్తం వెళ్తున్నాడు. అధిక వేగంతో వెళ్లకుండా తనను తాను నియంత్రించుకుంటున్నాడు. అత్యధికంగా 70కి.మీ.ల వేగం దాటడం లేదు. అలాగే మరీ దూర ప్రాంతాలకూ కారు నడుపుతూ వెళ్లడం లేదు. చదువుకునే వయసులో మనసులోకి వచ్చిన కారు నడపాలన్న కోరికను ఉద్యోగం వచ్చిన తర్వాత తన ఆలోచనతో సాకారం చేసుకున్న నగేష్ ను చూసి తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు గర్వపడుతున్నారు.

నాశనం చేసుకోవద్దు

కాళ్లు లేవని బాధ పడుతూ కాలం వెళ్లదీయకుండా... కారు నడపాలన్న కోరికను తన ఆలోచనతో సాకారం చేసుకున్నాడు నగేశ్​. అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదంటున్న నగేశ్​... అతి వేగంతో చేజేతుల జీవితాన్ని అంధకారం చేసుకోవద్దని కోరుతున్నాడు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.