local bodies mlc election: ముగిసిన నామినేషన్ల పరిశీలన ఘట్టం.. ఆ రెండు జిల్లాల్లో తప్ప మిగిలిన చోట్ల పోలింగ్!

author img

By

Published : Nov 24, 2021, 8:44 PM IST

mlc

స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. స్వతంత్రుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో.... నిజామాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో మూడు స్థానాలు ఎకగ్రీవంకానున్నాయి. ఇక మిగిలిన జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముంది. డిసెంబరు 10న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

రాష్ట్రంలో 9 ఉమ్మడి జిల్లాలో 12 స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక..... ఏకగ్రీవం కానుంది. స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్‌ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. శ్రీనివాస్‌కు తాము మద్దతివ్వలేదని ఎంపీటీసీ నవనీత, కార్పొరేటర్ రజియా సుల్తానా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇది దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస్‌ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కవిత ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. కవిత ఏకగ్రీవంగా ఎన్నికకానుండటంతో నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా నివాసంలో సంబురాలు చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎమ్మెల్యే గణేష్ గుప్తా మిఠాయి తినిపించారు.

రంగారెడ్డిలోనూ ఏకగ్రీవమే...

రంగారెడ్డి జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి చలిక చంద్రశేఖర్ నామినేషన్ తిరస్కరించారు. ప్రతిపాదిత వ్యక్తుల సంతకాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. పోటీలో తెరాస అభ్యర్థులు పట్నం మహేందర్‌రెడ్డి సుంకరి రాజు మాత్రమే మిగలడంతో... వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈనెల 26న ఎన్నికల అధికారులు ఈ మేరకు అధికారికంగా ప్రకటించనున్నారు.

మిగిలిన చోట్ల పోలింగ్​..

ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ నామపత్రాల పరిశీలన పూర్తైంది. 24 మంది వేసిన నామినేషన్లు సరిగ్గా ఉన్నాయని అధికారులు తెలిపారు. కరీంనగర్‌లో 27 మంది నామినేషన్లలో... ముగ్గురివి తిరస్కరణకు గురయ్యాయి. రెండు స్థానాల కోసం 24 మంది బరిలో ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో 10 మంది నామినేషన్లు దాఖలు చేయగా.... ఆరుగురి నామినేషన్లు తిరస్కరించారు. తెరాసకు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్‌రెడ్డిలతోపాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. నల్గొండ జిల్లాలో దాఖలైన 11 నామినేషన్లలో... 3 తిరస్కరణకు గురికాగా... 8 మంది బరిలో మిగిలారు. మెదక్‌ జిల్లాలో ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఐదుగురి నామపత్రాలను అధికారులు ఆమోదించారు. ఖమ్మం జిల్లాలో దాఖలైన 4 నామినేషన్లకూ అధికారులు ఆమోదముద్రవేశారు.

శుక్రవారం వరకు గడువు

గురువారం, శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో డిసెంబర్ 10న పోలింగ్‌ జరగనుంది.

ఇదీ చూడండి: స్వతంత్ర అభ్యర్థి నామినేషన్​ తిరస్కరణ... ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.