Farmers Dharna In Telangana : రోడ్డెక్కిన అన్నదాతలు.. ధాన్యం కొనుగోలు జాప్యమే కారణం

author img

By

Published : May 23, 2023, 8:19 PM IST

Updated : May 24, 2023, 6:46 AM IST

Farmers dharna

Farmers Dharna At Grain Buying Centres : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద.. అధికారుల తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. వ్యయప్రయాసలకోర్చి తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా.. జాప్యం చేయటంతో కష్టం నీటిపాలవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. అన్నదాతల ఆందోళనలకు వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి.

రోడెక్కిన రైతులు.. ధాన్యం కొనుగోలు జాప్యమే కారణం

Farmers Dharna At Grain Buying Centres : ఆరుగాలం కష్టించి పండించిన పంటను.. అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువెళ్లి రోజులు గడుస్తున్నా.. కొనుగోలు చేయడం లేదంటూ.. మెదక్ జిల్లా సోంపేట మండలం గంగాయపల్లి రైతులు నిరసనబాట పట్టారు. నరసాపూర్ తూప్రాన్ రహదారిపై ధాన్యం బస్తాలతో ధర్నా చేపట్టారు. వారికి బీజేపీ నాయకులు మద్దతు పలికారు. హత్నూరు మండలం చింతలచెరువు అన్నదాతాలు.. ధాన్యం కొనుగోలు చేయాలంటూ.. రాస్తారోకో చేపట్టారు. పోలీసులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో.. రైతులు ఆందోళనను విరమించారు.

జాతీయ రహదారులపై ధర్నాలు : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా జుక్కల్ లో రైతులు ఆందోళనకు దిగారు. జుక్కల్ చౌరస్తాలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించిన రైతన్నలు.. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆవేదన చెందారు. దాదాపు ఏడు రోజుల నుంచి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు జరగడం లేదని.. బస్తాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. అన్నదాతల ధర్నాతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించటంతో ఎట్టకేలకు ఆందోళన విరమించారు.

క్వింటాల్ వరి ధాన్యానికి.. ఐదు కిలోల కోత : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో బూరుగుపల్లి గ్రామ రైతులు ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసన చేపట్టారు. తేమ పేరుతో క్వింటాల్ వరి ధాన్యానికి.. ఐదు కిలోలు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిణి కార్తె వేళవుతున్నా ఇంకా ధాన్యం పూర్తి కాలేదని.. రైతుల ఆవేదనను కేసీఆర్ గుర్తించాలని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలోని తిప్పన్నపేట ఐకేపీ సెంటర్ వద్ద.. ధాన్యం కొనుగోలు తీరును నిరసిస్తూ రైతులు ఆందోళన చేశారు. జీవన్​రెడ్డి అన్నదాతలకు మద్దతుగా ధాన్యం కేంద్రం వద్ద గంటకు పైగా నిరసన తెలిపారు.

వరంగల్ రైతులు ప్రధాన రహదారులపై రాస్తారోకో : వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ నర్సంపేట-కొత్తగూడ ప్రధాన రహదారిపై రైతులు రాస్తోరోకో చేశారు. అక్కడి రైతులకు సీపీఎం, కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు.

"సగం కాలం ముగిసిపోయింది. ఇంకా ఎక్కడ ఉన్న వడ్లు అక్కడే ఉన్నాయి. ఒకసారి తూకం వేసిన ధాన్యాన్ని మళ్లీ ఏదో ఒక నేపంతో బయటకు పంపించేస్తున్నారు. దీనివల్ల రైతుకు తీవ్రనష్టం జరుగుతోంది. అందుకే రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నాం. కేసీఆర్​కు కాలాలపై అవగాహన ఉంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు." - జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ

ఇవీ చదవండి :

Last Updated :May 24, 2023, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.