ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రులు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు

author img

By

Published : Sep 26, 2022, 1:11 PM IST

Navratri celebrations

Navratri celebrations in telangana: రాష్ట్రంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తున్నారు. నిర్మల్​ జిల్లాలో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు ఈరోజు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అటు ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో నవరాత్రి సంబురాలు అంబరాన్నంటాయి. అమ్మవారిని బాలాత్రిపుర సుందరీగా అలంకరించి అర్చకులు ప్రత్యేక పూజల నిర్వహించారు.

Navratri celebrations in telangana: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదియ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా నవరాత్రుల్లో మొదటి రోజైన ఈ రోజు సరస్వతి అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి కట్టెపొంగలి నైవేద్యంగా నివేదించారు. అంతకు ముందు వేకువ జామునే వైదిక బృందం మహాకాళి, మహాలక్ష్మి, శ్రీ సరస్వతి అమ్మవార్లకు విశేష అభిషేక పూజలు చేసి అర్చించారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు.. వాయిద్య బృందం సమక్షంలో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ చేశారు. ఆలయ అర్చకులు స్వస్తి పుణ్యాహవాచనం ఘట స్థాపన ప్రత్యేక పూజలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పన చేశారు.

ఓరుగల్లు శ్రీభద్రకాళి అమ్మవారి ఆలయంలో: ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీభద్రకాళి అమ్మవారి ఆలయంలోనూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. తొలిరోజు అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకాలను నిర్వహించారు. కలష స్థాపన చేసిన అనంతరం అమ్మవారిని బాలాత్రిపుర సుందరీగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి వృషభ వాహన సేవ నిర్వహించిన అర్చకులు.. సాయంత్రం జింక వాహనంపై అమ్మవారిని ఊరేగించనున్నారు.

భద్రకాళీ అమ్మవారి దర్శనానికి ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసిన ఆలయ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి వసతితో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికోసం అన్నదానం ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.