RGUKT: ప్రతికూల పరిస్థితుల్లో ఆర్జీయూకేటీ ప్రతిభ.. ప్రముఖ కంపెనీల మొగ్గు!

author img

By

Published : Aug 28, 2021, 11:03 AM IST

RGUKT placements, basara iiit students jobs in placements

ప్రతికూల పరిస్థితుల్లో ఆర్జీయూకేటీ(RGUKT) విద్యార్థులు ప్రతిభ కనబర్చుతున్నారు. ఖరగ్‌పూర్ ఐఐటీ సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకొని బోధిస్తుండగా... ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులకు భారీ డిమాండ్ నెలకొంది. ఎనిమిదేళ్లలో 2,688 విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయని ప్లేస్‌మెంట్‌ అండ్‌ శిక్షణ ఇంఛార్జీ తెలిపారు.

నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT)లో వ్యవస్థాగతమైన అసౌకర్యాలున్నప్పటికీ విద్యార్థుల ప్రతిభకు కొదవలేదు. అవరోధాలను అధిగమించి అవకాశాలను అందిపుచ్చుకునే పోటీతత్వం కనిపిస్తోంది. ఇక్కడ చదివే విద్యార్థుల కోసం ప్రముఖ కంపెనీలు సైతం వరస కట్టే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామీణ విద్యార్థులకు సాంకేతికంగా ఉన్నత చదవులకు తోడ్పాటును అందించాలనే లక్ష్యంతో 2008లో బాసర కేంద్రంగా ట్రిపుల్‌ ఐటీ(IIIT) ఏర్పడింది.

చదువుల కోవెల

పీయూసీ-1లో ఉండే 1,400 సీట్ల ప్రవేశాల కోసం ఏటా దాదాపుగా 10వేలకుపైగా దరఖాస్తులు వస్తుంటే ప్రతిభగల విద్యార్థులకే సీటు లభిస్తోంది. సివిల్, మెకానికల్, కెమికల్, ఎంఎంఈ, ఈసీసీ, సీఎస్‌ఈ, ఈఈఈ విభాగాల్లో బోధన జరుగుతోంది. తొలి బ్యాచ్‌ 2014 మొదలుకొని ఈ ఏడాది వరకు 2,688 మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ లభించింది. ప్రతిభే ప్రామాణికంగా ఉద్యోగాలు వస్తుండటంతో ట్రిపుల్‌ఐటీలో చేరడానికి ఏడాదికేడాది విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఆధునిక సాంకేతికపరమైన ఇబ్బందులు, ఒప్పందప్రాతిపదికన పనిచేసే అధ్యాపకులు, నిధుల కొరతతో విశ్వవిద్యాలయం సతమతమవుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి పూర్తిచేసిన ప్రతిభగల విద్యార్థులకు చదువుల కోవెలగా నిలుస్తోంది.

పెద్ద కంపెనీలు ఆసక్తి

విశ్వవిద్యాలయం ఆరంభం నుంచే ఖరగ్‌పూర్‌ ఐఐటీ సెలబస్‌నే ఆర్జీయూకేటీలో ప్రామాణికంగా కొనసాగుతోంది. ఫలితంగా ప్రముఖ మల్టీనేషన్‌ కంపెనీలైన(MNC) ఇన్ఫోసిస్(INFOSYS), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TATA), టెక్‌ మహేంద్ర(TECH MAHINDRA), మేధా సర్వో(MEDHA SERVO), హెటెరో డ్రగ్స్(HETERO DRUGS), వసార్‌ ల్యాబ్స్, అటిబిరో స్టీల్స్, థాట్‌ వర్క్స్‌ లాంటి కంపెనీలు సైతం బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతుండటంతో ప్రతిభగల విద్యార్థులకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(IOT)లో ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు నైపుణ్యాలు సాధిస్తుండటంతో ఏడాదికేడాది ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపడానికి ప్రధాన కారణమవుతోంది. మధ్యలో రెండేళ్లు ప్లేస్‌మెంట్‌ అవకాశం వచ్చినప్పటికీ చేరడానికి చాలా మంది విద్యార్థులు ఆసక్తి చూపకుండా ఉన్నత విద్య అభ్యసనకు దృష్టిసారించేలా టిప్రుల్‌ ఐటీ ఖ్యాతికి అద్దం పడుతోంది.

విద్యార్థులకు డిమాండ్

ఈ ఏడాది ఏకంగా 88 కంపెనీలు బాసర ట్రిపుల్‌ ఐటీని సందర్శించగా 377 మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ లభించింది. విద్యాలయం నుంచి అడుగుబయటకు పెట్టకముందే ఆసక్తికలిగిన ప్రతిభగల విద్యార్తులకు ప్రతి ఏడాదికి సగటున రూ.6.5లక్షల నుంచి రూ. 8.3లక్షల వరకు కంపెనీలు వేతనం ఇవ్వడానికి మొగ్గుచూపడం విశేషం. ఉద్యోగాల్లో ప్రస్తుతం సివిల్‌ ఇంజినీరింగ్‌ (CE-40శాతం), కెమికల్‌ ఇంజినీరింగ్‌(CME-166.67శాతం), కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజిరింగ్‌(CSE-162.39శాతం), ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌(ECE-72.34శాతం) విభాగాల్లో ప్రతిభకనబర్చే విద్యార్థులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

RGUKT placements, basara iiit students jobs in placements
బాసర ట్రిపుల్ ఐటీ ప్లేస్‌మెంట్‌ అండ్‌ శిక్షణ ఇంఛార్జి

ప్లేస్‌మెంట్‌ సాధించిన విద్యార్థుల వివరాలు

సంవత్సరం ప్లేస్‌మెంట్‌ పొందిన విద్యార్థులుశాతం
2013-1436825.75
2014-15353 20.80
2015-16 312 41.45
2016-17 287 35.96
2017-18 268 41.10
2018-19359 53.90
2019-20 364 63.30
2020-2137774.85

'ఇక్కడి విద్యార్థుల్లో శోధించే గుణంతోపాటు క్రమశిక్షణ ఉండటంతో ప్రముఖ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులే అధికంగా ఉండంతో కష్టపడి పనిచేసే లక్షణం కాస్త ఎక్కువగా ఉంటుంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ పరిజ్ఞానాన్ని పంచేవారికి ఎక్కడైనా గుర్తింపు లభిస్తుంది. బాసర ట్రిపుల్‌ఐటీలో ఉన్న కోర్సులతోపాటు అంతర్గతంగా మల్టీనేషన్‌ కంపెనీల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను పెంపొందించే బోధన జరుగుతోంది. ఖరగ్‌పూర్‌ ఐఐటీ సిలబస్‌తోపాటు అంతర్జాతీయ ప్రామాణికాలు-అవసరాలపై శాఖాధిపతుల నేతృత్వంలో నిరంతరం కసరత్తు జరుగుతోంది. దానికి తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దే విధానం కొనసాగుతోంది.'

-రాకేశ్ రోహన్, బాసర ట్రిపుల్ ఐటీ ప్లేస్‌మెంట్‌ అండ్‌ శిక్షణ ఇంఛార్జీ


ఇదీ చదవండి: Justice Hima Kohli: మధుర జ్ఞాపకాలతో వెళుతున్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.