Nirmal AMITH SHAH Sabha: లక్ష మందితో రేపు నిర్మల్​లో అమిత్​ షా బహిరంగ సభ

author img

By

Published : Sep 16, 2021, 4:53 PM IST

Updated : Sep 16, 2021, 10:14 PM IST

AMITH SHAH:

ఈనెల 17న కేంద్రమంత్రి అమిత్ షా నిర్మల్ జిల్లాకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జరగనున్న బహిరంగ సభకు భాజపా శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలో కేంద్రమంత్రి అమిత్​ షా పర్యటించనున్నారు. పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు భాజపా నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని నటరాజ్ మిల్ సమీపంలో ఎల్లపెల్లి వెళ్లే మార్గంలో అమిత్ షా సభకు వేదికగా నిలవనుంది. సభా ప్రాంగణ పరిసరాల్లో వాహన పార్కింగ్, వీఐపీ గ్యాలరీ, సాధారణ ప్రజానీకం కూర్చునేందుకు చేసిన ఏర్పాట్లను భాజపా నాయకులు పర్యవేక్షిస్తున్నారు.

పట్టణంతో పాటు సభా ప్రాంగణాన్ని భాజపా శ్రేణులు కాషాయమయంగా మార్చనున్నారు. కేంద్రమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో భారీ కటౌట్లు, పార్టీ తోరణాలు, జెండాలతో అలంకరించారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేస్తున్నారు. సభా వేదిక ఏర్పాట్లను పార్లమెంటు సభ్యులు సోయం బాబూరావు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ అప్పల గణేశ్, చక్రవర్తి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనకు రానున్న సందర్భంగా వైమానిక దళం ముందస్తుగా ఏరియల్ సర్వే చేపట్టింది.

అమిత్ షా సభ ప్రాంగణంలో వైమానిక దళం ఏరియల్ సర్వే

ఒంటిగంటకు రానున్న అమిత్ షా

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్​లో భాజపా నిర్వహించే సభ ప్రాంగణానికి మధ్యాహ్నాం ఒంటిగంటకు కేంద్రమంత్రి అమిత్​ షా చేరుకోనున్నారు. అమిత్‌ షా మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి హెలికాప్టర్‌లో నేరుగా నిర్మల్‌కు చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా భాజపా జిల్లా నాయకత్వం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభిస్తారని పార్టీ నేతలు తెలిపారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్, రాంజీ గోండు, కుమురం భీం విగ్రహాల వద్ద నివాళులు అర్పించనున్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని భాజపా నాయకులు వెల్లడించారు. తెలంగాణ విమోచన దినోత్సవంపై తెరాస వైఖరి, భాజపా చేస్తున్న పోరాటంపై ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభ వేదిక నుంచే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అమిత్​ షా డిమాండ్‌ చేయనున్నారు. అమిత్‌ షా సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన కమలనాథులు లక్ష మందిని తరలించి తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానేనని సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలని భావిస్తున్నారు. మధ్యాహ్నాం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సభ జరగనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారీ సభ ఏర్పాటు చేయబోతున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు లక్షమంది సభకు హాజరు కానున్నారు. భారీ ఎత్తున జరగనున్న ఈ సమావేశానికి భాజపా రాష్ట్రంలోని అగ్రనాయకులు హాజరవుతున్నారు. భారీ ఎత్తున రానున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం.- గణేష్ చక్రవర్తి, భాజపా నేత

ఇదీ చూడండి: Bandi sanjay: 'తెరాస, భాజపా కలిసి ఉంటే మేమెందుకు పోటీచేస్తాం'

Last Updated :Sep 16, 2021, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.