గురుకులాలను వెంటాడుతోన్న కరోనా.. తాజాగా 71 మందికి పాజిటివ్​

author img

By

Published : Mar 21, 2021, 2:18 PM IST

Updated : Mar 21, 2021, 7:01 PM IST

25-corona-cases-registered-at-tribal-gurukul-school-mudhol-nirmal-district

14:15 March 21

గురుకులాల్లో కరోనా కలకలం

రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో కొవిడ్​ బారినపడుతోన్న విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వైరస్​ వ్యాప్తితో అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.  

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలోని పాలమాకులలోని గురుకుల పాఠశాలలో కరోనా విజృంభిస్తోంది. ఇక్కడి జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో 45 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. పాఠశాలలోని 6 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 1000 మంది బాలికలు ఉండగా.. వారిలో దాదాపు 500 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో మూడు రోజుల కిందట 23 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా ఇవాళ మరో 45 మందికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. మరికొంత మంది ఫలితాలు రావాల్సి ఉందని గురుకుల విద్యాలయ ప్రధానోపాధ్యాయురాలు శివగీత తెలిపారు. పాఠశాలలో మిగిలిన విద్యార్థులకూ కొవిడ్ పరీక్షలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యాలయంలోనే ఐసోలేషన్‌

కరోనా నిర్ధారణ అయిన బాలికల కోసం గురుకులంలో ప్రత్యేక ఐసోలేషన్‌ గదులను ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వీరికి పోషకాహారంతో పాటు వైద్యం అందిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు శివగీత చెప్పారు. మరోవైపు విద్యార్థినులకు కరోనా నిర్ధారణ కావడంతో వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలను ఇళ్లకు పంపించాలని పాఠశాల వద్దకు వచ్చి కోరుతున్నారు.

ఇవాళ కలకలం.. 

తాజాగా నిర్మల్ జిల్లా ముథోల్​లోని గిరిజన బాలికల గురుకులంలో ఇవాళ మరోసారి కరోనా కలకలం రేగింది. నిన్న నిర్వహించిన పరీక్షల్లో 9 మంది విద్యార్థులు వైరస్​ బారినపడగా.. నేడు 121 మందికి పరీక్షలు చేయగా.. మరో 17 మంది బాలికలు, ఒక సిబ్బందికి వైరస్​ నిర్ధారణ అయింది. ఫలితంగా రెండు రోజుల్లోనే మొత్తం కేసుల సంఖ్య 27కు చేరింది.

పాతబస్తీలో 9 మంది విద్యార్థినులకు..

హైదరాబాద్ పాతబస్తీ రాజన్న బావి బీసీ వసతి గృహంలో 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వారిలో ఏడుగురు విద్యార్థినులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. వైరస్‌ సోకిన వారిని అక్కడే ఓ పెద్ద గదిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో వైద్యం అందిస్తున్నారు.

ఇదీ చూడండి: గురుకులాలపై కరోనా పడగ..100మందికి పైగా కొవిడ్

Last Updated :Mar 21, 2021, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.