అమానుషం: పస్తులుండి ఆస్తులు కూడబెడ్తే.. అన్నీ లాక్కుని రోడ్డున పడేశారు..

author img

By

Published : Jun 22, 2022, 4:14 PM IST

old women staying at police station from 4 days in vaddepally

రూపాయి.. రూపాయి.. ఏం చేస్తావంటే... మానవ సంబంధాలను మంటగాలుపుతాను.. మనిషిలోని మానవత్వాన్ని మింగేస్తాను అందట. మారుతున్న కాలంలో జనాలకు అనుబంధాల కంటే.. ఆస్తిపాస్తులపైనే వ్యామోహం పెరుగుతుంది. అందుకే ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య చిచ్చురేగుతోంది. అమ్మానాన్నలను అనాథలను చేస్తుంది. అవసరమైతే వారిని అంతమొందించేలా చేస్తోంది. నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చిన అమానుష ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

పస్తులుండి ఆస్తులు కూడబెడ్తే.. అన్నీ లాక్కుని రోడ్డున పడేశారు..

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డెపల్లికి చెందిన సూదనబోయిన బుగ్గమ్మకు కుమారుడు, కుమార్తె. 30 ఏళ్ల క్రితం కుమార్తె వివాహం జరిపించిన తర్వాత... ఆమె భర్త నర్సింహ మృతిచెందాడు. అప్పటి నుంచి బుగ్గమ్మ ఒంటరి మహిళగా బతుకీడుస్తూనే... ఉన్న ఒక్కగానొక్క కొడుకు జంగయ్య కోసం కష్టపడి ఏడెకరాల భూమి, ఇంటి స్థలం సంపాదించింది. కొడుకును పెద్దచేసి పెళ్లిచేసిన ఆ తల్లి.. కుమారుడి పేరిట ఎకరన్నర భూమి రిజిస్ట్రేషన్‌ చేసింది. అతడికి ఇద్దరు కుమార్తెలు కాగా... మనురాళ్లకు పెళ్లిళ్లు చేసి, వారి పేరిట రెండెకరాల చొప్పున భూమి పట్టా చేసింది. 8 నెలల క్రితం... పశువులు కాసేందుకు వెళ్లిన కుమారుడు ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందాడు. అదే సమయంలో బుగ్గమ్మ ఎడమ కాలుకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో ఐదు నెలల క్రితం వైద్యులు ఆమె కాలు తొలగించారు.

ఇదిలా ఉండగా.. కొడుకు మరణానంతరం అతని పేరున ఉన్న ఎకరాన్నర భూమిని కోడలు లక్ష్మమ్మ... తన పేరిట మార్చుకోవాలని నిర్ణయించుకుంది. పట్టామార్పిడి కోసం సాక్షి సంతకం కావాలని బుగ్గమ్మను తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లి కొడుకు భూమిని పట్టాచేయించుకుంది. ఇదే సమయమనుకుని.. బుగ్గమమ్మ పేరిట ఉన్న మరో ఎకరన్నర భూమిని కూడా తన పేరుపైకి మార్చుకుంది. మాటవరసకైనా బుగ్గమ్మకు ఈ విషయం చెప్పకుండానే పట్టా చేయించుకుంది.

భూమి మొత్తం తన పేరు మీదికి మారిపోయిన తర్వాత.. వృద్ధురాలితో నాకేం పని అనుకుందో ఏమో.. బుగ్గమ్మను పట్టించుకోవటం మానేసింది. వయసు మీద పడిన ఆమెకు కనీసం తిండి కూడా పెట్టటం మానేసింది. ఇదే విషయమై.. ఈ నెల 17న నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో బుగ్గమ్మ ఫిర్యాదు చేసింది. తిండి పెట్టకుండా వేధిస్తున్నారని నాలుగు రోజులుగా పోలీస్‌స్టేషన్‌ చెట్ల కింద ఉంటూ.. పండ్లు తింటూ బుగ్గమ్మ కడుపు నింపుకుంటోంది. పస్తులుండి ఆస్తులు కూడబెట్టిన తనను నేడు అనాథను చేశారని వృద్ధురాలు కన్నీటి పర్యంతమవుతోంది. మాటవరసకైనా తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా.. తన భూమిని కోడలు పట్టా చేయించుకుందని బుగ్గమ్మ వాపోయింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.