'సిద్దిపేట- హన్మకొండ' ప్రధాన రహదారిపై పొంగిన వాగు.. స్తంభించిన రాకపోకలు

author img

By

Published : Aug 16, 2021, 2:03 PM IST

MOYA TUMMEDA VAAGU

ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోహెడ మండలంలోని బస్వాపూర్​ వద్ద మోయ తుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రహదారి వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో స్థానికులు అడ్డుగా ముళ్లకంచెలు వేశారు. దీంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌ వద్ద మోయ తుమ్మెద వాగు ఉద్ధృతంగా పారుతోంది. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 4 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట- హన్మకొండ ప్రధాన రహదారి వంతెన పైనుంచి వరద ప్రవహిస్తోంది. సోమవారం ఉదయం ప్రధాన రహదారి వంతెనపై వాగు ప్రవహిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్తులు అటువైపు వెళ్లే వాహనదారులను అప్రమత్తం చేశారు. అడ్డంగా ముళ్లకంచె వేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

కొందరు వాహనదారులు మాత్రం ప్రమాదకరంగానే వంతెన దాటుతున్నారు. హుస్నాబాద్ ఏఎస్పీ మహేందర్ మోయ తుమ్మెద వాగు ప్రవాహాన్ని పరిశీలించారు. సిద్దిపేట-హన్మకొండ మార్గంలో వెళ్లేవాళ్లు.. నాగ సముద్రాల, పోరెడ్డిపల్లి, బస్వాపూర్ మీదుగా ప్రయాణించాలని సూచించారు. వంతెనను దాటే ప్రయత్నం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. వాగు ఉద్ధృతిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నందున.. చేపలు పట్టడం, ఈత కొట్టేందుకు వెళ్లొద్దని స్థానికులకు ఏఎస్పీ సూచించారు.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు వచ్చినా... ఇక్కడ భారీ వర్షం కురిసినా వాగు పొంగుతోందని స్థానికులు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని ఈ వాగు కష్టాలు లేకుండా చూడాలని కోరుతున్నారు. రహదారిపై వాగు ప్రవహించడం వల్ల అత్యవసరమైన పనులకు కూడా వెళ్లలేకపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం స్పందించి కొత్త వంతెనను నిర్మించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: Dalitha Bandhu: 'కుంభవృష్టి పడినా శాలపల్లిలో దళితబంధు సభ జరుగుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.