KTR tour in nalgonda: నేడు నల్గొండ జిల్లాకు కేటీఆర్.. సుంకిశాల ప్రాజెక్టుకు శంకుస్థాపన

author img

By

Published : May 14, 2022, 5:00 AM IST

Updated : May 14, 2022, 5:35 AM IST

KTR tour in nalgonda

మంత్రి కేటీఆర్ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్‌ మహానగరానికి కృష్ణా నుంచి 20 టీఎంసీలు తరలించేందుకు నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టును సహచర మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌ రెడ్డితో కలిసి జాతికి అంకితం చేయనున్నారు.

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ నల్గొండ జిల్లా కీలకమైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. హాలియా, నందికొండ, పురపాలక సంఘాల పరిధిలో 50 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నాగార్జునసాగర్‌లో 274 ఎకరాల్లో ఏర్పాటు చేసిన బుద్ధవనం ప్రాజెక్టును పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి జాతికి అంకితం చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా బుద్ధుడి పుట్టుక నుంచి మహాపరినిర్యాణం వరకు పూర్తి చరిత్ర ఒకే చోట తెలుసుకునేలా ప్రాజెక్టు నిర్మించారు. శ్రీలంక నుంచి తెచ్చిన 27 అడుగుల ప్రతిమ అందరినీ ఆకర్షిస్తోంది. దేశంలోని బుద్ధగయ, సారనాథ్, లుంబిని తదితర ప్రాంతాల్లో లేని విధంగా అన్ని ప్రతిమలను ఈ పార్కులో నెలకొల్పారు.

నేడు నల్గొండ జిల్లాకు కేటీఆర్.. సుంకిశాల ప్రాజెక్టుకు శంకుస్థాపన

హైదరాబాద్ మహానగరానికి కృష్ణానీటిని శాశ్వత ప్రాతిపదికన అందించేందుకు నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టుకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. నాగర్జునసాగర్‌ నుంచి 20 టీఎంసీలను తరలించేందుకు వీలుగా పెద్దవూర మండలం సుంకిశాలలో రూ.1,450 కోట్లతో కొత్త ప్రాజెక్టును జలమండలి నిర్మిస్తోంది. కృష్ణా తాగునీటి సరఫరా పథకంలోని మూడు దశలతో పాటు... భవిష్యత్ అవసరాలు తీర్చేలా సుంకిశాల నిర్మాణం కొనసాగుతోంది. ఇప్పటికే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలిస్తున్నప్పటికీ... ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. సాగర్‌ డెడ్‌ స్టోరేజి ఉన్నప్పడు సమస్యలు వస్తున్నాయి. సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్‌లో డెడ్‌ స్టోరేజీ నుంచి కూడానీటి తరలింపునకు అవకాశం ఉంటుంది. 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

ప్రాజెక్టుకు శంకుస్థాపనం చేసిన అనంతరం మంత్రి కేటీఆర్ హాలియాలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. నూతనంగా ఏర్పాటైన హాలియా, నందికొండ పురపాలక సంఘాల అభివృద్ధిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. సాగర్ ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీల పనులపైనా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

ఇవీ చూడండి: 'చిత్తశుద్ధి ఉంటే సమాధానాలు చెప్పాలి..'- అమిత్​షాకు కేటీఆర్​ బహిరంగ లేఖ

శాలరీ నిలిపివేసిన హెడ్​మాస్టర్​పై హైకోర్టు గరం.. నెలరోజులు సస్పెండ్

Last Updated :May 14, 2022, 5:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.