SLBC PROJECT: నిలిచిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు..!

author img

By

Published : May 23, 2022, 4:48 AM IST

ఎస్‌ఎల్‌బీసీ

SLBC PROJECT: నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. సాంకేతిక లోపాలు, విద్యుత్తు ఛార్జీల బకాయిలు కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

SLBC PROJECT: శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్‌ ద్వారా నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌(టీబీఎం)లో ఏర్పడిన సాంకేతిక లోపాలు, విద్యుత్తు ఛార్జీల బకాయి తదితర అంశాల వల్ల గత నాలుగైదు నెలలుగా పనులు సాగడం లేదు.

ఇటీవలే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి పనులు మొదలుపెట్టే సమయానికి ఇక్కడ పనిచేస్తున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన దాదాపు 300మంది కార్మికులు సమ్మెకు దిగారు. గత 4నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఈ నెల 4 నుంచి ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి.

పెరుగుతున్న అంచనా వ్యయం
నల్గొండ జిల్లాలోని 3.50 లక్షల ఎకరాలకు సాగు నీరు, 500 గ్రామాలకు పైగా తాగునీరు ఇచ్చే ఉద్దేశంతో రూ.1,925 కోట్ల అంచనా వ్యయంతో 2007లో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. 15 ఏళ్లలో సుమారు రూ.2,500 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయగా..పెరిగిన ధరల ప్రకారం అంచనా వ్యయం సుమారు రూ.4 వేల కోట్లకు చేరినట్లు తెలిసింది.

గత మూడేళ్లు కలిపి బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.10 కోట్లే కేటాయించగా ఇవి నిర్వహణకే సరిపోయాయని గుత్తేదారు కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. పనులు సకాలంలో పూర్తి కావాలంటే సత్వరం నిధులు విడుదల చేయాలంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తొలుత రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) ప్రకారం 43 కి.మీ. టన్నెల్‌ తవ్వాల్సి ఉంది.

ఇది నల్లమల అటవీ ప్రాంతం నుంచి వస్తుండటంతో వన్యప్రాణులకు హానీ కలగకుండా పనులు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ సూచించింది. దీంతో ప్రస్తుత నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దోమలపెంట వద్ద ప్రారంభమై అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి వద్ద ముగిసేలా టన్నెల్‌కి రూపకల్పన చేశారు. ఇప్పటివరకు రెండు వైపుల నుంచి 33కి.మీ.సొరంగమార్గం తవ్వకాన్ని పూర్తి చేశారు. మధ్యలో మరో 10 కి.మీ. మేర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నెల రోజుల్లో పనులు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రాజెక్టు డీఈ చక్రపాణి తెలిపారు.

ఇదీ చదవండి: ఆర్టీసీ మరో బంపర్​ ఆఫర్​.. ఈసారి పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ..

ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే ఎవరెస్ట్ అధిరోహించి రికార్డ్​​.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.