Charlagudem: చర్లగూడెం నిర్వాసితుల గోస.. పరిహారం ఆపేశారంటూ ఆందోళన

author img

By

Published : Jul 2, 2022, 6:44 PM IST

Charlagudem

Charlagudem project: రిజర్వాయర్‌ కోసం అక్కడి ప్రజలు ఉన్న ఊరు పండే పొలాలను ఇచ్చారు. సాయం చేస్తుందన్న సర్కార్‌.. అరకొర పరిహారమివ్వడంతో ఆందోళనకు దిగారు. పరిహారం సరిగా ఇవ్వలేదంటూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. గ్రామస్థులను ఏకం చేశారని కొందరికి పరిహారమివ్వకుండా అధికారులు వేధిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇదంతా డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన చర్లగూడెం నిర్వాసితుల గోస.

Charlagudem project: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న అతిపెద్ద జలాశయం చర్లగూడెం. సుమారు 11.2 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ జలాశయంలో చర్లగూడెంతోపాటు నర్సిరెడ్డిగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లి తండా గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ నాలుగు గ్రామాల్లోని సుమారు 833 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నాయని రెవెన్యూ అధికారులు లెక్కతేల్చారు. ఇందులో ఒక్క చర్లగూడెం రిజర్వాయర్‌లో మొత్తం 233 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నారని అధికారులు గుర్తించారు.

ఇందులో 213 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ పరిహారం కింద చెక్కులు ఇచ్చారు. మరో 20 కుటుంబాలకు పరిహారం రావాల్సి ఉంది. మెరుగైన పరిహారం ఇవ్వాలంటూ మే 10 నుంచి జూన్‌ 24 వరకు సుమారు 45 రోజులు నిర్వాసితులు నిరసనలు చేశారు. వీరిలో కొందరికి పరిహారం అందకపోగా మరికొందరికి సరైన పరిహారం ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తే పరిహారం మంజూరైనా స్థానికంగా ఉండడం లేదని చెక్కులు ఆపినట్లు నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. అందరిలాగే తమకు పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించిన వల్లభదాసు కేశవులు కుటుంబానికి రావాల్సిన సుమారు 15 లక్షల పరిహారానికి సంబంధించిన చెక్కులను... అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆపారని వారు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులందరితో సంతకాలు చేయించాలని చెబితే చేయించానని... అయినప్పటికీ పరిహారం ఇవ్వడంలేదంటూ కేశవులు వాపోయారు.

చర్లగూడెం నిర్వాసితుల గోస.. పరిహారం ఆపేశారంటూ ఆందోళన

గ్రామంలో 234 మందికిగానూ 213 మందికి పరిహారం మంజూరైంది. 200 మందికి చెక్కులను పంపిణీ చేశామని వివిధ కారణాలతో 13 మంది చెక్కులు పెండింగ్‌లో పెట్టామని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేసి వారి సూచనతో మిగతా చెక్కులు పంపిణీ చేస్తామని అంటున్నారు. ఏళ్ల తరబడి పరిహారం కోసం నానా పాట్లు పడుతున్నామని అధికారులు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు ప్రాధేయపడుతున్నారు.
ఇవీ చదవండి:

Huzurabad Hospital:పేదలకు వరంగా ఏరియా ఆస్పత్రి.. అధునాతన సౌకర్యాలతో వైద్యసేవలు

అపార్ట్​మెంట్​లో పైథాన్​ కలకలం.. రెండో అంతస్తులోని బాల్కనీలోకి వెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.