Earthquake: నల్లమలలో భూకంపం... రిక్టర్ స్కేల్​పై 3.7గా నమోదు

author img

By

Published : Jul 27, 2021, 4:52 AM IST

Earthquake

నల్లమల అటవీప్రాంతం సోమవారం వణికిపోయింది. శ్రీశైలం జలాశయానికి పడమర వైపు 44 కి.మీ దూరంలో, నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు తూర్పున 18 కి.మీ దూరంలో, భూ ఉపరితలానికి 7 కిలోమీటర్ల లోతున కృష్ణానదిలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) వెల్లడించింది.

నల్లమల అటవీప్రాంతం (Nallamala Forest) సోమవారం వేకువజామున ఐదు గంటల సమయంలో వణికిపోయింది. శ్రీశైలం జలాశయానికి పడమర వైపు 44 కి.మీ దూరంలో, నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు తూర్పున 18 కి.మీ దూరంలో, భూ ఉపరితలానికి 7 కిలోమీటర్ల లోతున కృష్ణానదిలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(NGRI) వెల్లడించింది.

ఆ ప్రాంతంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని, భూకంప లేఖినిల్లో దీని తీవ్రత 3.7గా నమోదైనట్లు ఎన్‌జీఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త శ్రీనగేశ్‌ తెలిపారు. అచ్చంపేట పట్టణం, కొల్లాపూర్‌, లింగాల, అమ్రాబాద్‌, పదర, ఉప్పునుంతల, బల్మూరు మండలాలతోపాటు శ్రీశైలం సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్ని ఇళ్లల్లోని వంటపాత్రలు, గిన్నెలు, డబ్బాలు, బొమ్మలు కిందపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో 4 సెకన్లు, మరికొన్ని చోట్ల మూడు సెకన్లు ప్రభావం చూపిందని స్థానికులు తెలిపారు.

జలాశయం వద్ద పరిస్థితిపై అధికారుల ఆరా!

శ్రీశైలం జలాశయం వద్ద పరిస్థితులపై అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. డ్యాం భూగర్భ గ్యాలరీతోపాటు ఈగలపెంటలో భూ ప్రకంపనలు గుర్తించే రెండు సెన్సార్లు ఉన్నాయి. ప్రకంపనలను అవి వెంటనే గుర్తించి హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ఐకి సంకేతాలు పంపాయి. ఎన్‌జీఆర్‌ఐ అధికారులు ప్రకంపనల తీవ్రతను శ్రీశైలం డ్యాం అధికారులకు పంపించారు.

రాతిపొరల్లో ఒత్తిడే కారణమా?

భూకంపం వల్ల ఎలాంటి ప్రమాదం వాటిల్లకపోవడంతో శ్రీశైలం ఆనకట్టకు పెద్ద ముప్పు తప్పినట్లయింది. ఆనకట్ట నిర్మించినప్పటి నుంచి ఈ ప్రాంతంలో భూకంపాలు రావడం ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కారణాలపై అధ్యయనం చేస్తున్న అధికారులు ఆత్మకూర్‌ ఫాల్ట్‌ కారణమని అంచనా వేస్తున్నారు. అక్కడి భూమిలోని రాతిపొరల్లో ఏర్పడిన ఒత్తిడి భూకంపానికి దారితీసి ఉంటుందని శాస్త్రవేత్త శ్రీనగేశ్‌ అన్నారు.

ఒక్కసారే భూమి కంపించిందని, ఇది చిన్నదే అయినందున ఆందోళన అవసరం లేదన్నారు. ఆనకట్ట దక్షిణం వైపు ఒకటి రెండుసార్లు ప్రకంపనలు గతంలో వచ్చినా.. అవి చాలా చిన్నవని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ పెరుగుతోంది. ప్రవాహాల కారణంగా భూగర్భంలోని పగుళ్లలో సర్దుబాటుతో భూమి కంపిస్తుంది. దీన్నే టెక్టానిక్‌ ఎఫెక్ట్‌ అని అంటారని, ఇలాంటి సందర్భాల్లో ఎక్కువసార్లు భూమి కంపిస్తుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పులిచింతలలో గతేడాది జనవరి నుంచి నవంబరు వరకు ఇలాంటి ప్రకంపనలను ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ భూమి పొరల్లోని పగుళ్లలో నీటి సర్దుబాటే కారణమని నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం శ్రీశైలం దగ్గరలో రాతిపొరల్లో ఒత్తిడి కారణమని అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: Earthquake near srisailam: 'నల్లమల అడవుల్లో భూకంపం.. రాతిపొరల్లో ఒత్తిడితోనే.!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.