TS High Court: 'శాశ్వత హోదా చేజార్చుకుంటే.. దేశమంతా నిందిస్తుంది'

author img

By

Published : Aug 27, 2021, 7:20 AM IST

TS High Court

రామప్ప సమగ్ర పరిరక్షణ, అభివృద్ధిని హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తోంది. ఆలయానికి యునెస్కో ఇచ్చిన గుర్తింపును శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించి శాశ్వత హోదా చేజార్చుకుంటే.. కోర్టే కాదు దేశమంతా నిందిస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రామప్ప దేవాలయం పరిసరాలను పరిరక్షించాలని.. పర్యావరణం దెబ్బతినకుండా నిర్మాణాలను నిషేధించాలని.. ప్రపంచ పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలని, ప్రపంచ కమిటీ సిఫార్సులను పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ప్రపంచ స్థాయి కట్టడంగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి యునెస్కో ఇచ్చిన గుర్తింపును శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి యునెస్కో విధించిన షరతులను విడతల వారీగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది డిసెంబరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది.

కాంక్రీట్ జంగిల్​లా చేయకండి..

ఇదే సమయంలో ప్రపంచ స్థాయిలో రామప్ప ఆలయం గుర్తింపు పొందినందున ఇక్కడ నిర్మాణాలు వెలిసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఇక్కడ నిర్మాణాలకు అనుమతించే ముందు పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చూడాలని కోర్టు సూచించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చురుకైన పాత్ర పోషించాలని పేర్కొంది. స్థానిక అధికారులు ఈ ప్రాంతాలను గుర్తించి నిర్మాణాలను ఎక్కడ అనుమతించాలి.. అవి రామప్ప దేవాలయానికి ఎంత దూరంలో ఉండాలి, అది అడుగులా.... కిలోమీటర్ల అన్నది నిర్దేశించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. నిర్మాణ రహిత ప్రాంతాన్ని నిర్దేశించాలని, లేని పక్షంలో ప్రస్తుతం గోల్కొండ , కుతుబ్ షాహి టూంబ్స్​ల వలె కాంక్రీట్ జంగిల్​లా తయారయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

గుర్తింపును నిలబెట్టుకుందాం..

ఇక్కడికి వచ్చే పర్యాటకులు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని, వారికి వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. యునెస్కో షరతులను పూర్తి చేయడానికిగాను చేపట్టిన చర్యలపై స్థాయిల వారీగా నివేదికలను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 29వ తేదీకి వాయిదావేసింది. రామప్ప ఆలయానికి ప్రపంచ స్థాయి కట్టడంగా దక్కిన గుర్తింపును నిలబెట్టుకోవాలంటే యునెస్కో పేర్కొన్న షరతులను పూర్తి చేయాల్సి ఉంటుందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వరరావు వాదనలు వినిపిస్తూ పత్రికలో 2021 డిసెంబరు అని వచ్చిందని, వాస్తవంగా అది వచ్చే ఏడాది డిసెంబరు వరకు గడువు ఉందని చెప్పారు.

యునెస్కో షరతుల్లో భాగంగా మొదట సరిహద్దులను గుర్తించామని తెలిపింది. ఇక్కడ 14.28 ఎకరాలను గుర్తించి ఎఎస్ఏ స్వాధీనం చేసుకుందని చెప్పారు. ఇంకా బఫర్ జోన్లను గుర్తించాల్సి ఉందని వారంలోగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమయ్యామని తెలిపారు. దీనికి సంబంధించి అన్ని చర్యలు చేపట్టామని, వచ్చే విచారణకు నివేదిక సమర్పిస్తామనగా... ధర్మాసనం అనుమతిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో దశలవారీగా యునెస్కో షరతులను పూర్తి చేయాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: SRINIVAS GOUD: 'దేశానికే తలమానికంగా రామప్పను తీర్చిదిద్దుతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.