Ramappa temple : రామప్పకు వెళ్తే ఈ పర్యటక ప్రాంతాలూ చూసేయండి మరి!

author img

By

Published : Sep 5, 2021, 5:43 PM IST

Ramappa temple

రామప్ప.. అతిపురాతన ఆలయం. కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న ఈ అద్భుత నిర్మాణం శిల్పకళా సౌందర్యానికి నిలయం. ఆనాటి సాంకేతిక పరిజ్ఞానానికి నెలవు. యునెస్కో గుర్తింపుతో ఈ ఆలయానికి ప్రపంచ పర్యాటక పటంలో చోటు దక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆలయానికి వెళ్లి చూడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక నుంచి రామప్పకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరగనుంది. ఇక్కడకు వస్తే ఈ ఆలయాన్నే కాదు, చుట్టుపక్కల మరెన్నో పర్యాటక ప్రాంతాలనూ చుట్టేసి రావచ్చు. హైదరాబాద్‌ నుంచి రామప్పకు ఎలా వెళ్లాలి, అక్కడికి సమీపంలో ఉన్న దర్శనీయ స్థలాలపై ప్రత్యేక కథనం..

హైదరాబాద్‌ నుంచి రామప్ప ఆలయం 209 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరంగల్‌ మీదుగా ములుగు జిల్లా జంగాలపల్లి వరకు వెళ్లాక అక్కడి నుంచి ఎడమ వైపు 9 కిలోమీటర్లు వెళితే రామప్ప ఆలయాన్ని చేరుకోవచ్చు. యాత్రికులు బస చేసేందుకు హరిత హోటల్‌ కాటేజీలు, రెస్టారెంటు ఉన్నాయి. ఆలయాన్ని దర్శించుకొనే క్రమంలో గైడ్‌ చెప్పే విశేషాలను తప్పకుండా వినాలి. అప్పుడే అక్కడి శిల్పాల్లోని విశేషాలు, శిల్పుల గొప్పతనం అర్థమవుతాయి. సమీపంలోని సరస్సులో బోటింగ్‌ చేయవచ్చు. చుట్టూ పచ్చని అడవి, పంటపొలాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. కుటుంబంతో వెళ్లి హాయిగా ఈ ప్రాంతంలో బస చేసేందుకు సౌకర్యాలు ఉన్నాయి.

రైలు మార్గంలో ఇలా..

రైల్లో అయితే కాజీపేట లేదా వరంగల్‌లో దిగాలి. హన్మకొండ బస్టాండ్‌ నుంచి ఏటూరునాగారం వెళ్లే బస్సు ఎక్కి జంగాలపల్లి వద్ద దిగాలి. అక్కడి నుంచి ఆటోల్లో రామప్ప గుడికి చేరుకోవచ్చు. సొంత వాహనాలైతే సౌకర్యంగా ఉంటుంది. హన్మకొండ నుంచి సుమారు 70 కి.మీ. దూరంలో ఉంటుంది.

లక్నవరం

laknavaram
లక్నవరం సరస్సు

రామప్ప నుంచి 30 కి.మీ.

చూడాల్సిన ప్రదేశాలు: సరస్సు, తీగెల వంతెనలు, బోటింగ్, జింకలపార్కు

అతి పెద్ద సరస్సు: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో లక్నవరం సరస్సు ఉంది. దీనిపై మూడు తీగెల వంతెనలు ఉన్నాయి. దగ్గరలో జింకల పార్కు ఉంది. సీజనల్‌గా పిల్లలకు సాహస క్రీడలు నిర్వహిస్తారు. వారాంతాల్లో అడవుల్లో ట్రెక్కింగ్‌ ఉంటుంది..

వసతులు: రెస్టారెంట్, 12 కాటేజీలు ఉన్నాయి.

పాకాల సరస్సు

pakala
పాకాల సరస్సు

రామప్ప నుంచి 63 కి.మీ.

చూడాల్సిన ప్రదేశాలు: జీవవైవిధ్య పార్కు, బోటింగ్, పాకాల అభయారణ్యం తిలకించవచ్చు.

జీవ వైవిధ్యానికి నిలయం: వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలంలో పాకాల సరస్సు ఉంది. కాకతీయుల రాజైన గణపతిదేవుడు 1213లో నిర్మించిన ఈ పెద్ద సరస్సు జీవ వైవిధ్యానికి నిలయం. సరస్సులో మొసళ్లు ఉంటాయి. పరిసరాల్లో సుమారు వంద రకాల పక్షి జాతులు, 40 వరకు సీతాకోకచిలుక జాతులు ఉంటాయి. పాకాల అభయారణ్యం 900 చదరపు కిలోమీటర్లలో పరిధిలో విస్తరించింది ఉంది. ఒకప్పుడు ఇక్కడ పెద్దపులులు సంచరించేవి.

కళల జల్లు ఓరు‘గల్లు’..

1000 pillars temple
వేయి స్తంభాల గుడి

చూడాల్సినవి: వేయి స్తంభాల గుడి, వరంగల్‌ కోట, భద్రకాళి ఆలయం, జూపార్కు, సైన్స్‌ మ్యూజియం.

వేయిస్తంభాల గుడి: క్రీ।।శ 1163లో కాకతీయరాజు రుద్రదేవుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ మూలవిరాట్టు రుద్రేశ్వరుడు. పెద్ద, చిన్న స్తంభాలు 1,000 వరకు ఉంటాయి కాబట్టి వేయిస్తంభాల గుడి అనే పేరొచ్చింది. సన్నటిదారం పట్టేంత సూక్ష్మ రంధ్రాలతో అద్భుతమైన శిల్ప సంపద కనువిందు చేస్తుంది. కృష్ణ శిలతో చెక్కిన ఏకశిలా నంది ప్రత్యేక ఆకర్షణ. కేంద్ర ప్రభుత్వం హృదయ్‌ పథకం కింద ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తోంది.

కళానిలయం శిలాతోరణం: వరంగల్‌ కోట అనేక చారిత్రక కట్టడాలకు నిలయం. కాకతీయులు 12వ శతాబ్దంలో ఈ కోటను రాజధానిగా చేసుకొని పాలించారు. చుట్టూ ఏడు కిలోమీటర్ల మట్టి కోట, తర్వాత నాలుగు కిలోమీటర్ల రాతి కోట ఉంటుంది. పదుల సంఖ్యలో ఆలయాలు అద్భుతంగా నిర్మించారు. ఎంతోమంది విదేశీయులు పరిశోధనలు చేయడానికి వస్తుంటారు. నాలుగు శిలాతోరణాల మధ్య ఒకప్పుడు సర్వతోభద్ర ఆలయం ఉండేదని చెబుతారు. కోటలో రాత్రివేళ సౌండ్‌ అండ్‌ లైట్ షో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడి కాకతీయ కళాతోరణాన్ని రాష్ట్ర చిహ్నంలో కూడా పెట్టారు.

వసతులు: విలాసవంతమైన హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి.

కోటగుళ్లు

kotagullu
కోటగుళ్లు

రామప్ప నుంచి 9 కి.మీ.

చూడాల్సిన ప్రదేశాలు: కాకతీయులు నిర్మించిన అతి పురాతన ఆలయం ఇది

నక్షత్రాకార ఆలయం: జయశంకర్‌ జిల్లా గణపురంలో కోటగుళ్లు ఉన్నాయి. కాకతీయుల కట్టడాల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. గణపతిదేవుడు క్రీ.శ. 1213లో నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో 22 గుళ్లు ఉంటాయి. గర్భగుడిలో గణపేశ్వరస్వామి (శివలింగం) ప్రతిష్ఠించారు. ఈ ఆలయం సైతం రామప్ప మాదిరే నక్షత్రం ఆకారంలోనే ఉంటుంది. 15, 16వ శతాబ్దాల్లో జరిగిన దండయాత్రల్లో తీవ్రంగా ధ్వంసమైంది. 12 ఏళ్ల క్రితం పునరుద్ధరణ చర్యల్లో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో అపురూపమైన శిల్పాలు బయటపడ్డాయి.

వసతులు: ఇక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రం ఉంది. లాడ్జీలు రెస్టారెంట్లు ఉంటాయి.

కాళేశ్వరం

kaleshwram
కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయం

రామప్ప నుంచి 81 కి.మీ.

చూడాల్సిన ప్రదేశాలు: ముక్తీశ్వర ఆలయం. త్రివేణి సంగమం, గోదావరి అందాలు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కన్నెపల్లి పంపుహౌజ్, మేడిగడ్డ బ్యారేజీ.త్రివేణి సంగమం: జయశంకర్‌ జిల్లా మహదేవపూర్‌ మండలంలో గోదావరి తీరాన కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి కొలువై ఉంటారు. ఇక్కడే గోదావరి, ప్రాణహిత, సరస్వతి (అంతర్వాహిని) నదులు కలిసే త్రివేణి సంగమం ఉంది. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం త్రిలింగ క్షేత్రాలు. భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉండటం ఇక్కడి విశేషం. సరస్వతి ఆలయం కూడా ప్రత్యేకమే.
వసతులు: ప్రభుత్వ, ప్రైవేటు హోటళ్లు, రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి.

బొగత

bogatha
బొగత జలపాతం

రామప్ప నుంచి 90 కి.మీ.

గలగల సాగే జలపాతం: ములుగు జిల్లా వాజేడు మండలంలో బొగత జలపాతం ఉంది. అంతెత్తున కొండలపై నుంచి జలాలు జాలువారుతుంటాయి. చుట్టూ ఆహ్లాదకరమైన కొండలు కనువిందు చేస్తుంటాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోడానికి ఏర్పాట్లు ఉన్నాయి.

వసతులు: ఇక్కడికి 5 కి.మీ. హరిత హోటల్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఏటూరునాగారంలో లాడ్జీలు అందుబాటులో ఉంటాయి.

పాండవుల గుట్ట

రామప్ప నుంచి 26 కి.మీ.

చూడాల్సిన ప్రదేశాలు: గుట్టలపై ఆదిమానవుల కుడ్య చిత్రాలు. శని, ఆదివారాల్లో రాక్‌ క్లైంబింగ్‌.

పాండవుల గుట్టలు: జయశంకర్‌ జిల్లా రేగొండ మండలంలో ఉన్న సున్నపురాళ్ల గుట్టలివి. వివిధ ఆకృతులతో సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. సహజ వర్ణాలతో ఆదిమానవులు వేసిన జింకలు, చేపలు, కుందేళ్లు, పాము, తేళ్లు తదితర కుడ్య చిత్రాలతోపాటు 12వ శతాబ్దం నాటి పంచపాండవులు, కుంతి, ద్రౌపది, గణపతి, ఆంజనేయుడు, బ్రహ్మ, తదితర చిత్రాలు కూడా ఉన్నాయి.

వసతులు: ఇక్కడి నుంచి 24 కిలోమీటర్ల దూరంలో భూపాలపల్లి ఉంది. లాడ్జీలు, రెస్టారెంట్లు ఉంటాయి.

మేడారం

sammakka
సమక్క సారక్క

రామప్ప నుంచి 51 కి.మీ.

చూడాల్సినవి: సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల దర్శనం. జంపన్నవాగు, గిరిజన మ్యూజియం..

సమ్మక్క సారలమ్మ జాతర: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం ఉంది. మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. రెండేళ్లకోసారి నాలుగురోజుల పాటు ఆదివాసీల సంప్రదాయంలో జరుగుతుంది. అమ్మలను కొలిచేందుకు తెలుగురాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర ప్రాంతాలనుంచి దాదాపుగా కోటిమందికి పైగా తరలివస్తారు. 1996 నుంచి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

వసతులు: హరిత హోటల్, రెస్టారెంటు ఉంది. సమీపంలోని తాడ్వాయి దగ్గర హట్స్​ ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.