'కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ పాలమూరుపై లేదు..'

author img

By

Published : Sep 14, 2022, 7:44 PM IST

Updated : Sep 14, 2022, 10:31 PM IST

YS Sharmila

YS Sharmila 24 hours dharna: ముఖ్యమంత్రి కేసీఆర్​కు కాళేశ్వరంపై ఉన్న ప్రేమ.. పాలమూరు జిల్లాపై లేదన్నారు వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రీడిజైన్ పేరుతో అంచనాలు పెంచి కమీషన్లు తీసుకోవడం తప్ప మహబూబ్​ నగర్ జిల్లాకు కేసీఆర్ చేసింది ఏముందని ఆమె ప్రశ్నించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై 'పాలమూరు-నీళ్లపోరు' పేరిట 24 గంటల నిరాహార దీక్షను ఆమె ప్రారంభించారు.

YS Sharmila 24 hours dharna: పాలమూరు వలసలు ఆగాలని, జిల్లా పచ్చబడాలని భీమా, కోయల్ సాగర్, నెట్టెంపాడు, కేఎల్ఐ ప్రాజెక్టులు తెచ్చింది వైఎస్ అని, ఆయన తర్వాత ఒక్క ఎకరానికి అదనంగా నీళ్లివ్వలేకపోయారని వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. వెయ్యికోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టుల్ని ఎందుకు పూర్తిచేయలేకపోయారని ఎదురుదాడికి దిగారు. మహబూబ్ నగర్ తితిదే కళ్యాణ మండపం వద్ద 'పాలమూరు-నీళ్లపోరు' పేరిట 24 గంటల నిరాహార దీక్షను ఆమె ప్రారంభించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేని కేసీఆర్ నిర్లక్ష్యానికి నిరసనగా దీక్ష చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సాకులు చెప్పకుండా వెంటనే ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

నిరంజన్​రెడ్డికి సవాల్: వైఎస్ హయాంలో జూరాల నుంచి ప్రారంభించాలని భావించిన ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో 35వేల కోట్ల నుంచి 55వేల కోట్లకు అంచనాలు పెంచారని, అయినా 8ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని ఆమె ప్రశ్నించారు. కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ పాలమూరుపై లేదన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కడితే, మూడేళ్లలోనే మునిగి పోయిందన్నారు. పాలమూరుకు అనుమతులు లేవని ఇప్పడు చెబుతున్నారని, ఇప్పటి వరకూ ఖర్చు చేసిన 17వేల కోట్లు నీళ్లలోపోసినట్లేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని సగానికి పైగా సాగునీటి ప్రాజెక్టులు మేఘా కృష్ణారెడ్డికే అప్పగిస్తున్నారని, దీనిపై కాంగ్రెస్, భాజపాలు సైతం పెదవి విప్పడం లేదన్నారు. అందరూ అమ్ముడు పోవడం వల్లే ఎవరూ ప్రశ్నించడం లేదని ఆరోపించారు. పాలమూరుపై నిజమైన ప్రేమ ఉంటే నీళ్ల నిరంజన్ రెడ్డి తనతో పాటు దీక్షలో కూర్చోవాలని సవాలు విసిరారు. జనం కన్నీళ్లు తుడవలేని మంత్రి కన్నీళ్ల నిరంజన్ రెడ్డని అభివర్ణించారు.

పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తే ఏమవుతుంది కేసీఆర్​కు.. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న ప్రేమ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మీద లేదు. ఎందుకంటే కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు కదా. పెద్ద ప్రాజెక్టు అయితే పెద్ద కమీషన్లు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ముందరపెట్టుకొని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుని అటకెక్కించారు. ఎనిమిదేళ్లు అవుతున్నా పూర్తి కాలేదు. విపక్షాలు కూడా ఏమైనా ప్రశ్నిస్తున్నాయా..? - వైఎస్ షర్మిల, వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు

సమస్యలపై ప్రశ్నిస్తే ఫిర్యాదులా: తానేదో మాట్లాడుతున్నట్లు ఎమ్మెల్యేలు, మంత్రులు స్పీకర్​కు ఫిర్యాదు చేశారని, ప్రజల సమస్యలను బహిరంగంగా ప్రశ్నిస్తే తప్పా అని ఎదురుదాడికి దిగారు. మహిళల పట్ల, తమ పట్ల పిచ్చికూతలు కూస్తే గట్టిగానే సమాధానం చెప్తామని హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అసమర్థ పాలనపై తాను మాట్లాడుతుంటే.. కాంగ్రెస్, భాజపాలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

'కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ పాలమూరుపై లేదు..'

ఇవీ చూడండి:

Last Updated :Sep 14, 2022, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.