Victims Helping: నిస్సహాయ స్థితిలో వారికి వారే.. వెన్ను దన్నుగా!

author img

By

Published : Aug 31, 2021, 7:33 AM IST

spinal cord injuries

తాము నిస్సహాయ స్థితిలో ఉన్నా... బాధితులను ఆదుకోవాలనే మంచితనం. మంచానికే పరిమతమై ఉన్నా... తమకు తోచి సాయం చేస్తూ.. అవసరమైన వారికి మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు కొందరు యువకులు. ఓ సినిమాలో హీరోకి ఇలాంటి సమస్య ఉంటే తనకు ఓ సహాయకుడు వచ్చి సేవలు చేస్తాడు. ఎందుకంటే హీరోకి డబ్బులున్నాయి కాబట్టి. కానీ వీరి చూసేందుకు వేరే వాళ్లని పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకున్నా... శరీరం సహకరించకపోయినా.. మంచానికే పరిమితమైనా.. అవసరమైన వారికి తోచినంత సాయం చేస్తూ నిజ జీవితంలో హీరోలు అనిపించుకుంటున్నారు.

రాష్ట్రంలో వెన్నెముక దెబ్బతిని మంచాన పడిన బాధితుల జీవితాలు దుర్భర పరిస్థితిలో ఉన్నాయి. అత్యధికులు సామాన్యులే కావడంతో స్థోమత లేక వైద్యానికి దూరమై భారంగా బతుకుతున్నారు. వెన్నెముక దెబ్బతిని మంచం పట్టినవారు ప్రధానంగా పుండ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడతారు. కాళ్లు, చేతుల్లో స్పర్శ, చైతన్యం ఉండవు. శాశ్వత వైకల్యం. వీరి వెంట తప్పనిసరిగా సంరక్షకులు ఉండాల్సిందే. నెలల తరబడి కదలలేని వారికి సరైన ఆహారం, ఫిజియోథెరపీ అందకపోతే రోగి మరింత శుష్కించిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి బాధితులు కలిసి స్పైనల్‌ కార్డ్‌ ఇన్‌జ్యురీస్‌ అసోసియేషన్‌ పేరుతో వాట్సప్‌ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. తమకు తామే ధైర్యం చెప్పుకొంటూ... పరస్పరం ఆర్థిక సాయం చేసుకుంటూ జీవితాలు గడుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 400 మంది బాధితులు ఇందులో సభ్యులు. ఈ వ్యాధితో బాధపడుతున్న షఫీ అహ్మద్‌ ఖాన్‌ (సంగారెడ్డి), శ్రీధర్‌ (వరంగల్‌), రాము (బీహెచ్‌ఈఎల్‌), శోభారెడ్డి (కామారెడ్డి), శంకర్‌ (సూర్యాపేట) 2018లో ఈ గ్రూపును ఏర్పాటు చేశారు. ఫిజియోథెరపీ, మందుల వాడకం, అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు.

శ్రీనుకు సపర్యలు చేస్తున్న అమ్మమ్మ

ఈ యువకుడి పేరు శ్రీను. ఊరు మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం అంతంపల్లి. ఆటో డ్రైవరుగా పని చేసేవారు. 2013లో ఆటో బోల్తా పడటంతో వెన్నెముక విరిగిపోయింది. చికిత్స కోసం భూమిని అమ్ముకున్నారు. ప్రస్తుతం కాళ్లు పూర్తిగా చచ్చుపడిపోయి మంచానికే పరిమితయ్యారు. తల్లిదండ్రులు కూలి చేసి పోషిస్తున్నారు. చిత్రంలోని ఆయన అమ్మమ్మ సపర్యలు చేస్తున్నారు.

నరేష్​కు సపర్యలు చేస్తున్న తల్లి

ఈయన పేరు నరేష్‌. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం మరికల్‌ గ్రామం. ఆటో ప్రమాదంలో ఈయన వెన్నెముక విరిగింది. చికిత్సకు రూ. 15 లక్షలు ఖర్చయ్యింది. పొలం, 15 పశువులు అమ్మాల్సి వచ్చింది. చిత్రంలో ఉన్న ఆయన తల్లి సపర్యలు చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

వెన్నెముక బాధితులను ఆదుకోవాలి

ప్రతి నెలా మందులకు రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. కొందరికి వికలాంగ పింఛను రూ.3 వేలు వస్తోంది. మమ్మల్ని ఆదుకోవాలని గతంలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. కేవలం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 40 మంది బాధితులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు.

- నరేష్‌, వాట్సప్‌ గ్రూపు సమన్వయకర్త, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా

తోటివారికి తోచినంత సాయం

ఈ బాధితులకు ఆర్థిక స్తోమత లేక సరైన చికిత్స, ఆహారం, ఔషధాలు అందడం లేదు. వాట్సప్‌ గ్రూపు ద్వారా ఒక్కొక్కరు రూ.100 నుంచి రూ.500 వరకు వేసుకుని, అవసరమైన వారికి ఆ సొమ్ము అందిస్తున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో 70 మందికి చక్రాల కుర్చీలు, 10 మందికి ఎయిర్‌ బెడ్‌లు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా తమలాంటి బాధితులు సుమారు నాలుగు వేల మంది ఉంటారని వరంగల్‌కు చెందిన ఎస్‌సీఐ వాట్సప్‌ గ్రూపు నిర్వాహకుడు, స్పైనల్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ట్రైనర్‌ శ్రీధర్‌ తెలిపారు.

ఇదీ చూడండి: వారానికి 3 గంటలే ఆన్​లైన్ గేమ్స్.. సర్కారు ఆంక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.