యాసంగిలో తగ్గిపోతున్న పప్పుశనగ సాగు.. ఇలా అయితే భవిష్యత్తులో కష్టమే.!

author img

By

Published : Jan 21, 2023, 9:32 PM IST

Pulses cultivation

Pulses cultivation has decreased in ‍Telangana: యాసంగిలో జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో మాత్రమే కనిపించే పప్పుశనగ సాగు, గణనీయంగా పడిపోతోంది. ఒకప్పుడు 50వేల ఎకరాల్లో సాగైన ఆ పంట ప్రస్తుతం 14వేల ఎకరాలకు చేరుకుంది. వాతావరణం అనుకూలించకపోవటం, పెట్టుబడులు పెరిగి, దిగుబడి తగ్గటం, గిట్టుబాటు ధర లేకపోవటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు. వరికి బదులు పప్పుదినుసులు, నూనెగింజల పంటల్ని సాగు చేయాలని సూచిస్తున్న వ్యవసాయశాఖ.. ఆ దిశగా ప్రోత్సహించేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.

పప్పుశనగను పట్టించుకునే వారేరి

Pulses cultivation has decreased in ‍joint Mahabubnagar: వ్యవసాయశాఖ యాసంగిలో వరికి బదులు పప్పుదినుసుల్ని పండించాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నా.. పప్పుదినుసుల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతూ వస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్​ నగర్​ జిల్లాలో పప్పుశనగ విస్తీర్ణం సాగు ఏటా తగ్గుతోంది. జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలోనే పప్పుశనగ పండుతుంది. యాసంగిలో పప్పుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 30వేల ఎకరాలు కాగా.. ఈసారి 14వేల ఎకరాల్లోనే సాగైంది. గద్వాల జిల్లాలో 13వేలు, వనపర్తి జిల్లాలో 995 ఎకరాల్లో రైతులు పప్పుశనగ వేశారు. ఏటా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, దిగుబడి తగ్గడం, బహిరంగ మార్కెట్ లో గిట్టుబాటు ధర లేకపోవడం, మార్కెటింగ్ లేకపోవడం లాంటి కారణాల వల్ల పప్పుశనగ విస్తీర్ణం ఏటా గణనీయంగా పడిపోతోంది.

చలి వాతావరణంలోనే పప్పుశనగ బాగా పండుతుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని సారవంతమైన నల్ల రేగడి నేలలు అందుకు అనుకూలం. అందుకే యాసంగిలో అలంపూర్, ఉండవెల్లి, గట్టు, ధరూర్, మల్దకల్ మండలాల్లో గతంలో పప్పుశనగను విస్తృతంగా సాగు చేసేవాళ్లు. కానీ కొనేళ్లుగా ఆ పంటకు వాతావరణం అనుకూలించడం లేదు. పంటేసిన తర్వాత నెల రోజుల్లో ఒకటి రెండు వర్షాలు కురిస్తే పంటకు అనుకూలం. కానీ సకాలంలో వానలు కురవక దిగుబడి పడిపోతోంది. పూత దశలో వర్షం పడితే పంటకు నష్టం.

ఒకప్పుడు ఎకరాకు 10 నుంచి 15క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చేది. ఇటీవల వ్యవసాయశాఖ అధికారులు వేసిన అంచనాలో పంట దిగుబడి ఎకరాకు 3 క్వింటాళ్లకు పడిపోయింది. ఒకప్పుడు రాయితీపై విత్తనాలు అందేవి. ఇప్పుడు రైతులు విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఎరువులు, పురుగు మందులు సాగు ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఎకరానికి పెట్టుబడి ఖర్చు రూ.30,000 నుంచి రూ.50,000 వరకూ పెరిగినా.. గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. పదేళ్లుగా క్వింటాకు రూ.4000 నుంచి రూ.5000 వరకూ మాత్రమే ధర పలుకుతోంది. పెట్టుబడులు పెరిగి, దిగుబడి తగ్గి, గిట్టుబాటు ధర లేకపోవడంతో నడిగడ్డ రైతులు పప్పుశనగ వదిలి ఇతర పంటల వైపు మళ్లుతున్నారు.

మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడమూ.. పప్పుశనగ వైపు రైతులు మొగ్గు చూపకపోవడానికి మరో కారణం. గతంలో మార్క్ ఫెడ్ ద్వారా ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను కొనేవాళ్లు. ప్రస్తుతం కర్నూలు, గుంటూరుకు తీసుకువెళ్లి అమ్ముకోవాల్సి వస్తోంది. మార్కెట్‌లో తరుగు, కమిషన్లు, ఇతర చార్జీల పేరిట దోపిడే అధికం. పంట అమ్మితే పెట్టుబడులు కూడా చేతికి రాని పరిస్థితి. అందుకే పాలమూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పప్పుశెనగ సాగు ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది. యాసంగిలో పప్పు దినుసుల సాగును పెంచాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ సర్కారు... అందుకు అనుకూలమైన నేలలున్న ప్రాంతాల్లో ఆ పంటల్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

"గత 6నుంచి 7 సంవత్సరాల నుంచి మార్కెట్​ సదుపాయం పెంచకపోవడం. 2016-17 ప్రాంతంలో రూ.4500 రేటుకి అమ్మితే.. ఈ సంవత్సరం కూడా ఇదే రేటు బహిరంగ మార్కెట్​లో కొనసాగుతోంది. దీనివల్ల రైతుకు ఏమాత్రం ప్రయోజనం కలగడం లేదు. అందువల్ల రైతు పప్పుశనగపై మక్కువ చూపించడం లేదు. దీనికి తోడు చీడపీడ ఒకటి. అంతర పంటగా వేసుకోవడానికి వీలులేదు కాబట్టి.. అయినా సంవత్సరానికి ఒకటే పంట పండుతుంది. పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదు." - రైతు

"ఇప్పుడు మేము కౌలురైతులం. ఒక ఎకరాకు రూ.15000 కౌలు చెల్లించాలి. పెట్టుబడి రూ.25000 అవుతుంది. ఇతర ఖర్చులు రూ.5000 కలుపుకొని మొత్తంగా ఒక ఎకరంకు కౌలురైతుకు దాదాపు రూ.45000 ఖర్చు అవుతుంది. ఎకరాకు వచ్చే దిగుబడి 5 క్వింటాళ్లు. 5 క్వింటాళ్ల పప్పుశెనగలను ప్రభుత్వానికి అమ్మినా సరే రూ.25000 మించి రాలేదు. ఇంకా మాకు రూ.20000 నష్టమే వస్తుంది." - రైతు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.