పాలమూరు జిల్లాపై పోలీసుల నిఘా.. ప్రతి రోడ్డుపై సీసీ కెమెరాల ఏర్పాటు

author img

By

Published : Sep 1, 2022, 11:52 AM IST

పాలమూరు

CCTV Cameras On Every Road: పాలమూరు జిల్లాపై పోలీసుల నిఘా పెరుగుతోంది. ఇందులో భాగంగా కూడళ్లు, రహదారుల వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నేరాల నియంత్రణకు, దర్యాప్తులో సాక్షాధారాల సేకరణకు సీసీ కెమెరాలు కీలకం కానున్నాయని పోలీసులు చెబుతున్నారు.

పాలమూరు జిల్లాపై పోలీసుల నిఘా.. ప్రతి రోడ్డుపై సీసీ కెమెరాల ఏర్పాటు

CCTV Cameras On Every Road: మహబూబ్‌నగర్ జిల్లాను నిఘానీడలోకి తెచ్చేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతీయ రహదారుల నుంచి గ్రామీణ రోడ్ల వరకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై జిల్లా పోలీసులు దృష్టి సారించారు. 2021 నాటికే జిల్లాలో నేను సైతం కింద 861, సామాజిక భాగస్వామ్యం కింద 396 సీసీ కెమెరాలున్నాయి. ఈ సంవత్సరం వాటి సంఖ్యను మరింత పెంచనున్నారు.

నేను సైతం కింద 564, సామాజిక భాగస్వామ్యం కింద 364 సీసీ కెమెరాలను కొత్తగా ఏర్పాటు చేశారు. తాజాగా మహబూబ్​నగర్ పట్టణంలో ప్రతి దుకాణం ముందు సీసీ కెమెరాను ఏర్పాటు చేసి జిల్లా కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమానికి దుకాణదారుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. సామాజిక భాగస్వామ్యం కింద దాతల సహకారంతో ప్రధాన కూడళ్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

గతంలో కూడళ్లలో కేబుల్‌తో అనుసంధానం చేసిన సీసీ కెమెరాలుండేవి. ఈదురు గాలులు, వానలొచ్చినప్పుడల్లా అవి పనిచేయకుండా పోయేవి. వైర్లను కోతులు ఇతర జంతువులు తెంపేవి. ఈసారి ఇంటర్​నెట్ సౌకర్యంతో కూడిన వైర్‌లెస్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి నేరుగా జిల్లా కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి ఉంటాయి. గ్రామాల్లోకి వచ్చిపోయే దారుల్లో, కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా గ్రామస్థులను ప్రోత్సహిస్తున్నారు.

మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా 16ఠాణాల పరిధిలో 2185 కెమెరాలుంటే.. వాటిలో ఏడు పోలీస్​ స్టేషన్ల పరిధిలోని 277 కెమెరాలను హైదరాబాద్‌లోని డీజీపీ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక భూమిక పోషించనున్నాయి. దర్యాప్తులో భాగంగా సాక్షాధారాల సేకరణ, నిందితులను పట్టుకోవడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయని పోలీసు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులకు జరిమానాలు విధించేందుకు సైతం వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

మహబూబ్​నగర్ జిల్లాలో మొత్తం 16 పోలీస్​ స్టేషన్​లు ఉన్నాయి. అత్యధికంగా 552 సీసీ కెమెరాలు కేవలం జడ్చర్ల పోలీసు స్టేషన్ పరిధిలోనే ఉన్నాయి. ఆ తర్వాత మహబూబ్​నగర్ గ్రామీణ పోలీస్​ స్టేషన్ పరిధిలో 453, రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 420 సీసీ కెమెరాలున్నాయి. రానున్న రోజుల్లో గ్రామాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

"సీసీ కెమెరాలో ఉన్న ప్రాంతాల్లో నేరాలు తక్కువగా జరుగుతున్నాయి. నిందితులను పట్టుకోవడానికి తొందరగా వీలవుతుంది. ప్రజలు కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలి. నేర నియంత్రణకు తోడ్పాటు అందించాలి. - వెంకటేశ్వర్లు, మహబూబ్​నగర్ ఎస్పీ

ఇవీ చదవండి: రుణయాప్‌లకు ముకుతాడు వేసేందుకు పోలీసుల 'మనీ లెండర్స్' అస్త్రం

వరద బాధితుల పడవ బోల్తా.. 20 మందికి పైగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.