Armed Struggle: సాయుధ పోరాటంలో పాలమూరు జిల్లాది ప్రత్యేక పాత్ర

author img

By

Published : Sep 17, 2021, 6:04 AM IST

Armed Struggle: సాయుధ పోరాటంలో పాలమూరు జిల్లాది ప్రత్యేక పాత్ర

తెలంగాణ సాయుధ పోరాటంలో పాలమూరుదో ప్రత్యేక పాత్ర. అత్యంత వెనుకబాటుకు గురైన ప్రాంతంగా పేరొందిన జిల్లాకు.. 1947కు పూర్వమే ఉద్యమాలు నిర్వహించిన ఘన చరిత్ర ఉంది. రజాకార్లను బంధించడం, పోలీస్​స్టేషన్​పైనే దాడికి దిగి పోలీసులను ఉరికించిన ఘటనలు చరిత్రలో కీలక స్థానాన్ని కల్పించాయి. అప్పట్లో సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని బంధించేందుకు.. నల్లమలలోని లింగాల, మన్ననూరులోనే ప్రత్యేక బందీఖానాలు సైతం ఏర్పాటు చేశారు.

నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు సాగిన విమోచన ఉద్యమంలో పాలమూరు జిల్లా కీలక భూమిక పోషించింది. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటంలో పాలమూరు జిల్లాలో జరిగిన అనేక ఘటనలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. రజాకార్లను ఎదిరించి నిలిచినందుకు వారు జరిపిన కాల్పుల్లో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన అప్పంపల్లి ఘటన అందులో ప్రధానమైంది.

Armed Struggle: సాయుధ పోరాటంలో పాలమూరు జిల్లాది ప్రత్యేక పాత్ర

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్​ సంస్థానం నిజాం పాలనలో ఉండేది. స్వాతంత్య్రానంతరం నిజాంకు వ్యతిరేకంగా మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలం అప్పంపల్లిలో అజ్ఞాత పోరాటం సాగింది. అదే గ్రామానికి చెందిన బెల్లం నాగన్న ఓ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి తరచూ సమావేశాలు నిర్వహించేవాడు. రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు ప్రయత్నించేవాడు. 1947 అక్టోబర్ 7న ఉద్యమకారులను పట్టుకునేందుకు రజాకార్లు అప్పంపల్లికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు తక్షణం గ్రామం విడిచి వెళ్లాలంటూ రజాకార్లతో వాగ్వాదానికి దిగారు. ఉద్యమ నాయకులను బంధించేందుకే వచ్చారని, వెంటనే వెనుదిరిగి వెళ్లాలని తిరుగుబాటు చేశారు. తోకముడిచిన రజాకార్లు ఓ భవనంలో తలదాచుకున్నారు. జనం దాడి చేసేందుకు ప్రయత్నించడంతో కిటికీలోంచి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఉద్ధృతంగా సాయుధ పోరాటం..

నిజాం విమోచన ఉద్యమంలో ఉమ్మడి మహబూబ్​నగర్​కు చెందిన ఎందరో కీలకంగా వ్యవహరించారు. నల్లమల అటవీ ప్రాంతం కేంద్రంగా అచ్చంపేట, నాగర్​కర్నూల్​, కొల్లాపూర్​లో సాయుధ ఉద్యమం నడిపారు. జిల్లాలో 1946-48 మధ్యకాలంలో సాయుధ పోరాటం ఉద్ధృతంగా నడిచింది. లక్ష్మణాచారి, రాంచంద్రారెడ్డి, గోపాల్రావు, సింగోటం కిష్టన్న, గడ్డంపల్లి లింగోజి, ఎన్.బి.శ్రీహరి, మంతటి ఎద్దుల పుల్లారెడ్డి కలిసి ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు. ఆ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా గెరిల్లా దళం ఏర్పడింది కేవలం మహబూబ్​నగర్ జిల్లాలోనే. దళంలో లక్ష్మణాచారి కీలకంగా వ్యవహరించారు. ఈయన నేతృత్వంలోనే 1947 చివరలో పోలీస్​స్టేషన్​పై దాడి జరిగింది.

తెలంగాణ గడ్డ నిన్ను మరువదు బిడ్డా..

సాయుధ పోరాటంలో అతి పెద్ద తిరుగుబాటు ఘటనగా పాలమూరు జిల్లాను చరిత్రకెక్కేలా చేసింది. నిజాం సేనలు లింగాల, మన్ననూరులో ప్రత్యేక జైళ్లు ఏర్పాటు చేసి.. సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని బంధించే ప్రయత్నం చేశాయి. వరంగల్ జిల్లాకు చెందిన నల్ల నర్సింలు, మోహన్​రెడ్డిని ఇక్కడే బంధించారు. కానీ వారిద్దరూ తప్పించుకుని తిరిగి ఉద్యమబాట పట్టారు. సంస్థానాధీశులు సైతం నిజాం నుంచి విముక్తి కోసం తమ వంతు పాత్ర పోషించారు. తెలంగాణ గడ్డ నిన్ను మరువదు బిడ్డా అనేంతగా చరిత్ర పుటల్లో పాలమూరు బిడ్డలు శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని కవి పల్లెర్ల రామ్మోహన రావు తెలిపారు. ఆపరేషన్​ పోలో ద్వారా నిజాం సంస్థానం భారత యూనియన్​లో విలీనమైనట్లు చరిత్ర ఆచార్యులు రాఘవేందర్​రెడ్డి తెలిపారు.

ధీనావస్థలో అమరుల కుటుంబాలు

సాయుధ పోరాటంలో ఎందరో పాలమూరు జిల్లా వాసులు లాఠీలు, తూటాలను ఎదురించి అమరులయ్యారు. ప్రస్తుతం అమరుల కుటుంబాలు ధీనావస్థలో ఉన్నాయని.. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అప్పంపల్లి గ్రామస్థులు డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: అటవీ అధికారిపై పెట్రోల్​ పోసిన పోడు వ్యవసాయదారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.