INTER STUDENTS: ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా... తప్పని తిప్పలు

author img

By

Published : Sep 19, 2021, 2:09 PM IST

INTER STUDENTS

అర్థంకాని ఆన్​లైన్ తరగతులు విని, పరీక్షలు రాయకుండానే ఇంటర్ వరకూ చేరుకున్న విద్యార్ధులకు... ప్రస్తుతం ప్రత్యక్ష తరగతుల్లోనూ నిరాశే మిగులుతోంది. రెగ్యులర్, కాంట్రాక్ట్​ అధ్యాపకుల సబ్జెక్టుల బోధన సాగుతుంటే... అతిథి అధ్యాపకులు బోధించాల్సిన తరగతులు మాత్రం ఆగిపోయాయి. కీలకమైన కొన్ని సబ్జెకుల తరగతలు జరగడం లేదు. ఓ వైపు వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో గడువులోపు నిర్దేశిత సిలబస్ పూర్తి కావడం సవాలుగా మారింది. దీంతో విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగిందని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దేశంపై కొవిడ్ పంజా విసిరినప్పటి నుంచి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య గందరగోళంగా మారింది. అర్థంకాని ఆన్​లైన్ చదువులు చదివి, పరీక్షలు రాయకుండానే విద్యార్ధులు ఇంటర్ మొదటి, ద్వితీయ తరగతులకు చేరుకున్నారు. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొంది, చదువులు సరిగ్గా సాగక సబ్జెక్టుల్లో ఉన్నపట్టు కోల్పోయారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో ఇక నుంచైనా తరగతులు సక్రమంగా జరుగుతాయని భావించారు. కానీ ఇప్పుడు విద్యార్ధులకు నిరాశే ఎదురవుతోంది. కళాశాలలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా... ఇప్పటికీ సబ్జెక్టు బోధించాల్సిన అతిథి అధ్యాపకులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోలేదు. ఈ కారణంగా వివిధ సబ్జెక్టుల తరగతులు జరగడం లేదు. రెగ్యులర్, కాంట్రాక్టు అధ్యాపకులతోనే ఆ సబ్జెక్టులు కూడా చెప్పిస్తున్నారు. కొన్ని చోట్ల ఆ తరగతులు జరగడం లేదు.

నిబంధనలు పాటించడం కష్టమే

ఇంకా హాస్టళ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో దూర ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి, హస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్ధులు.. తరగతులకు హాజరు కావడం లేదు. దీంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో హాజరు 40 శాతానికి మించడం లేదు. 40 శాతం విద్యార్ధులు వచ్చినా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించడం కష్టంగా మారింది. ఇంకా 100 శాతం హాజరు ఉంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. కరోనా నిబంధనల అమలు కోసం ఇప్పటికే కొన్ని కళాశాలల్లో ఉదయం, మధ్యాహ్నం షిఫ్టుల వారీగా తరగతులు నిర్వహిస్తున్నారు. పైగా కొవిడ్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాల్లో ఇంటర్ విద్యార్ధులు లక్షకుపైగా కొత్తగా చేరారు. విద్యార్ధుల సంఖ్య పెరిగినా... అతిథి అధ్యాపకులను తీసుకోకపోవడంతో ఉన్న అధ్యాపకులకు తరగతుల నిర్వాహణ భారంగా మారింది.

వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 58 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో రెగ్యులర్ అధ్యాపకులు 157 మంది, కాంటాక్టు ప్రతిపాదికన 486 మంది విధులు నిర్వహిస్తున్నారు. 243 మంది అతిథి అధ్యాపకులను విధుల్లోకి తీసుకోవాల్సి ఉంది. పాత అధ్యాపకులను పునరుద్ధరిస్తారా.. కొత్తగా నియామకాలు చేపడతారా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే.. అప్పటి వరకూ విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయం ఆలస్యమైతే ఉన్న అధ్యాపకులనే సమీప కళాశాలలకు వారంలో మూడు రోజులు డిప్యూటేషన్​పై పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గతంలో జూనియర్ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పనిచేసిన వాళ్లు సైతం ఏళ్లుగా ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాదిన్నరగా ఎలాంటి వేతనాలు లేక దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. ఇటీవల వెల్దండ మండలంలో అతిథి అధ్యాపకుడు గణేశ్ చారి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సైతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అతిథి అధ్యాపకులపై ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని విద్యార్ధులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల నుంచి సైతం డిమాండ్లు వెల్లువెత్తున్నాయి.

ఇదీ చూడండి: హైవేలుగా రెండు మార్గాలు... కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.