Ayush Hospital ఐదేళ్ల కింద పూర్తైన నిర్మాణం.. ప్రారంభానికి నోచుకోని వైనం

author img

By

Published : Aug 17, 2022, 10:49 AM IST

Updated : Aug 17, 2022, 11:21 AM IST

Ayush Hospital

Ayush Hospital in Mahabubnagar మహబూబ్‌నగర్‌లో ఐదేళ్ల కిందట నిర్మాణం పూర్తి చేసుకున్న 20పడకల ఆయుష్ ఆస్పత్రి ప్రారంభానికి నోచుకోవడం లేదు. అవసరమైన గదులు, సామగ్రి సిద్ధంగా ఉన్నా.. సర్కారు దృష్టి సారించటం లేదు. ఆయుష్‌ భవనం అలంకారప్రాయంగా మిగిలింది. సిబ్బందిని నియమిస్తే ఇన్‌పేషంట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా ముందడుగు పడటంలేదు.

ఐదేళ్ల కింద పూర్తైన నిర్మాణం.. ప్రారంభానికి నోచుకోని వైనం

Ayush Hospital in Mahabubnagar : మహబూబ్‌నగర్‌లోని ఆయుష్ విభాగం కింద ప్రభుత్వ ఆయుర్వేద, హోమియోపతి, యునానీ వైద్యశాలలున్నాయి. ఈ 3 ఆస్పత్రులకు రోజూ సగటున 50 నుంచి 60మంది బయటి రోగులు వచ్చి వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లా మొత్తంలో ఆయుష్‌లో ఇప్పటివరకూ బయటి రోగుల సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇన్‌పేషెంట్ సేవలు ఎక్కడా అందుబాటులో లేవు.

Ayush Hospital News : ఆయుష్ కింద ఇన్‌పేషెంట్ సేవల్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు మహబూబ్‌నగర్ జిల్లాకు 20పడకల ఆసుపత్రిని మంజూరు చేశారు. ఒక్కో వార్డుకు 10 పడకల చొప్పున రెండు వార్డుల నిర్మాణం 2017 నాటికే పూర్తైంది. అవసరమైన పడకలు, సామగ్రి సైతం సమకూర్చినప్పటికీ....ప్రారంభానికి మాత్రం నోచుకోవటంలేదు. 2019లో కొవిడ్ విజృభించడంతో ఆ రెండు వార్డులను.... మందుల నిల్వ కోసం, కోవిడ్ సేవల కోసం వినియోగించుకోగా.... ఇటీవలే తిరిగి ఆయుష్ విభాగానికి అప్పగించారు. ప్రస్తుతం ఆ రెండు వార్డులు, 20 పడకల సామగ్రి వృధాగా పడి ఉంది.

ఇన్‌పేషెంట్లను తీసుకోవాలంటే 3 షిప్టుల్లో వైద్యులు, సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. అవసరమైన మందులు, వైద్య పరికరాల్ని ఇవ్వాలి. గదులు నిర్మించి, సామగ్రిని పంపిన ఉన్నతాధికారులు ఆ తర్వాత జరగాల్సిన ప్రక్రియపై దృష్టి సారించటంలేదు. హోమియో, యూనానీ డిస్పెన్సరీలకు వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నా ఆయుర్వేద డిస్పెన్సరీకి వైద్యాధికారి అందుబాటులో లేరు. మూడు షిప్టుల్లో ఆసుపత్రిని నడపాలండే అదనంగా వైద్యాధికారులను నియమించాల్సి ఉంది.

ఉమ్మడి జిల్లాలో 3చోట్ల మాత్రమే ప్రకృతి వైద్యానికి సంబంధించిన వైద్యులున్నారు. ఆసుపత్రిలో నాచురోపతికి సంబంధించిన వైద్యులను కూడా కేటాయించాల్సి ఉంది. రాష్ట్రంలో హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో 11 ఆయుష్ ఆసుపత్రులున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో మంజూరై సిద్ధంగా ఉన్న ఆసుపత్రిని రోగులకు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని ఆయుష్ విభాగం బాధ్యులు చెబుతున్నారు.

ఆయుష్ విభాగంలో ఖాళీల భర్తీకి ఇటీవలే ప్రభుత్వం జీవో విడుదల చేసినట్లు ఆయుష్ హైదరాబాద్ ప్రాంతీయ ఉపసంచాలకులు తెలిపారు. వీలైనంత త్వరగా వైద్యులు, సిబ్బందిని కేటాయించి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Last Updated :Aug 17, 2022, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.