ఏజెన్సీలో ప్రసవ వేదన.. రోడ్లు లేక గర్భిణుల కన్నీటి రోదన

author img

By

Published : Oct 10, 2021, 2:04 PM IST

pregnant

గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేక ఇద్దరు గర్భిణులు ఇబ్బంది పడిన ఘటన మహబూబాబాద్​ జిల్లాలోనే ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో జరిగింది (pregnant women problems in agency villages). గ్రామాల వరకు చేరుకునేందుకు రోడ్డు లేకపోవడం వల్ల మార్గ మధ్యలో నిలిచిపోయిన అంబులెన్సుల వద్దకు చేరుకోడానికి గర్భిణులు ఇబ్బంది పడ్డారు.

మహబూబాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ (mahabubabad district agency) మారుమూల గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక ఇద్దరు గర్భిణులు ఇబ్బందులు పడ్డారు(pregnant women problems in agency villages). కొత్తగూడ మండలం కర్ణగండి గ్రామానికి చెందిన సుజాతకు పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. రహదారి సరిగా ఉన్నంత వరకు 108 సిబ్బంది వెళ్లి ఆగారు. ఈ క్రమంలో గర్భిణి సుజాతను ఓ వాహనంలో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో నిలిచిపోయింది(vehicle breakdown).

మరమ్మతులకు వీలు కాకపోవడంతో మరో వాహనానికి తాడుతో కట్టి.. తీసుకెళ్లారు. అనంతరం 108 వాహనంలో (108 ambulance) ఎక్కించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో సంఘటనలో గంగారం మండలం కామారం గ్రామానికి చెందిన పుష్పలత పురిటినొప్పులతో బాధపడుతుండగా ట్రాక్టర్‌లో... కోమట్లగూడెం పీహెచ్​సీకి తరలించారు. ఏజెన్సీ గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు సౌకర్యం లేని గ్రామాల్లో గర్భిణుల ఇక్కట్లు

మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా గ్రామానికి అంబులెన్స్​ కూడా రాని పరిస్థితి. పురిటి నెప్పులతో బాధపడుతున్న నా భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దారిలో ఆగిపోయిన అంబులెన్స్​ వద్దకు ప్రైవేటు వాహనంలో తీసుకెళ్తుండగా అది మార్గ మధ్యలో నిలిచిపోయింది. వేరే వాహనానికి తాడు కట్టి మా వాహనాన్ని లాక్కును వెళ్లాము. గతంలో మా గ్రామంలో ఇద్దరు జ్వరం వచ్చి ఆస్పతికి తీసుకెళ్లే పరిస్థితి లేక మృతి చెందారు. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామస్థుడు.

ఈ అవస్థలు ఇంకెన్ని రోజులు పడాలో..

గ్రామానికి చెందిన మహిళకు పురిటి నెప్పులు వస్తుంటే... అంబులెన్సుకు సమాచారం అందించారు. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల మధ్యలో నిలిచిపోయింది. చాలా ఇబ్బందులు పడి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. గ్రామంలో ఏదైనా అత్యవసర కేసులు ఉన్న సమయంలో చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ఈ కష్టాలు ఇంకా ఎన్ని రోజులు పడాలో తెలియడం లేదు. ఆశ కార్యకర్త.

ఏజెన్సీ మారుమూల గ్రామాల్లోని ప్రజలు, గర్భిణులు ఇబ్బందలు పడిన ఘటనలు ఎన్నో చూశాము. వర్షాకాలంలో వీరి ఇబ్బందలు రెట్టింపవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఆదిలాబాద్​ వరకు ఏజెన్సీ గ్రామాల్లో ఈ సమస్యలు నిత్యకృత్యం. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న వీరి బాధ అరణ్య రోదనగానే మిగులుతుంది. సమయానికి వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: గర్భంతో ఉన్నవారు ఇవి అస్సలు చేయకూడదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.