Minister Errabelli : 'కలెక్టర్ సార్.. ఆ మహిళా కౌన్సిలర్లపై చర్యలు తీసుకోండి'

author img

By

Published : Oct 3, 2021, 1:05 PM IST

Updated : Oct 3, 2021, 2:06 PM IST

minister-errabelli-serious-on-women-counsellors-in-bathukamma-sarees-distribution

మహిళా ప్రజాప్రతినిధులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొర్రూరులోని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈక్రమంలో మహిళా కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను ఆదేశించారు. పక్కనే ఉన్న కలెక్టర్ శశాంక.. మంత్రి ఎర్రబెల్లి వార్డుల పేర్లు చెబుతుంటే నోట్ చేసుకుని.. ఓకే సర్ అని చెప్పేశారు. అసలెందుకు మంత్రికి అంత కోపం వచ్చిందంటే...

'కలెక్టర్ సార్.. ఆ మహిళా కౌన్సిలర్లపై చర్యలు తీసుకోండి'

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా బతుకమ్మ చీరల పంపిణీ చేపడుతోంది. ఆ బాధ్యతను మంత్రులే చూసుకుంటున్నారు. దీనిలో భాగంగానే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చీరల పంపిణీకి కొందరు మహిళా కౌన్సిలర్లు రాలేదు. వాళ్లకు బదులుగా భర్తలు వచ్చారు. దీనిపై ఎర్రబెల్లి అసహనానికి గురయ్యారు. రాని వాళ్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శశాంకను ఆదేశించారు.

"బతుకమ్మ పండుగ అంటేనే మహిళలది. అట్లాందికి మహిళలే రాకపోతే ఎట్లా. అయినా.. ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? ఇళ్లలో కూర్చోవడానికా? ఆ మాత్రానికి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేసినట్లు. ప్రజలకు మనపై ఎంతో నమ్మకం ఉంటుంది. దాన్ని మనం నిలబెట్టాలె. అర్థమైందా? ఏయే కౌన్సిలర్లు రాలేదో.. నోట్ చేసుకోండి కలెక్టర్ సార్. వాళ్లపై చర్యలు తీసుకోండి."

- ఎర్రబెల్లి దయాకర్​రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి

అప్పట్లో ఓ మహిళా అధికారిపై...

గతంలోనూ మంత్రి ఎర్రబెల్లి ఓ కార్యక్రమంలో మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో నిర్వహించిన ప్రగతి గ్రామసభకు మంత్రి ఎర్రబెల్లి వచ్చారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా మహిళా అధికారి అయిన ఎంపీడీవోపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కాస్త విచక్షణ కోల్పోయినట్లు కనిపించింది. మహిళా అధికారిని ఉద్దేశించి.. మీరు అక్కడ బాగానే ఊపుతున్నారు.. కానీ ఆమె ఇక్కడ ఊపలేకపోతోంది.. అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది అప్పట్లో వైరల్ అయ్యింది. రాష్ట్రమంత్రి అయి ఉండి ఓ మహిళా అధికారిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని.. అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేనేం అలా అనలేదు: మంత్రి

మహిళా ఎంపీడీవోపై తను అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు మీడియాలో రావడం బాధాకరమని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. బాధ్యత కలిగిన వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు సరికాదని వివరణ ఇచ్చుకున్నారు కొందరు కావాలనే తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు.

Last Updated :Oct 3, 2021, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.