Farmers agitations in Mahabubabad : 'రోడ్డెక్కిన రైతన్న... ఎక్కడికక్కడ ఆందోళనలు'
Published: May 22, 2023, 8:53 PM


Farmers agitations in Mahabubabad : 'రోడ్డెక్కిన రైతన్న... ఎక్కడికక్కడ ఆందోళనలు'
Published: May 22, 2023, 8:53 PM
Farmers agitations in Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల దగ్గర వ్యాపారులు ధాన్యం ధరలు తగ్గించారని.. కేంద్రాల వద్ద ధాన్యం నిలవలు పెరిగిపోతున్నా అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆందోళన చేశారు. వారు ఎంతో కష్టపడి పండించిన వరిని తగలబెట్టి మరీ నిరసన తెలిపారు. మరోచోట ఎమ్మెల్యేను అడ్డుకుని వారి గోడును చెప్పుకున్నారు. ఇప్పటికైనా వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Farmers agitations in Mahabubabad : ధాన్యం కొనుగోలు విషయంలో ఆలస్యం అవుతుందని.. వ్యాపారులు వరి ధరను తగ్గించారని.. లారీలు సరైన సమయంలో రాకపోవడంతో నిల్వలు పెరుగుపోతున్నాయని మహబూబాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ దగ్గర వ్యాపారులు అమాంతం ధాన్యం ధరను రూ.500 నుంచి రూ.1000 వరకు ధరను తగ్గించి బిడ్లను వేశారు. దీనివల్ల రైతులు పండించిన పంటకు పెట్టుబడి రాదని ఆవేదన చెందారు. అనంతరం ఆగ్రహించిన రైతులు మార్కెట్ ఎదుట నిరసన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ సతీష్ ఆందోళన వద్దకు చేరుకుని.. ధర్నాను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన అన్నదాతలు మార్కెట్ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ధాన్యాన్ని తగలబెట్టి.. నిరసన తెలిపిన రైతులు : నర్సింహులగూడెం స్టేజి వద్ద రైతులు ధాన్యాన్ని తగలబెట్టి.. రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులు అవుతున్నా.. నిర్వాహకులు కనీసం పట్టించుకోలేదని వాపోయారు. తాము కష్టపడి పండించిన పంటను తగలబెట్టవల్సిన పరిస్థితి ఏర్పడిందని, వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న నెల్లికుదురు ఎస్ఐ క్రాంతి కిరణ్ సమస్యను పై అధికారులకు తెలిపి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు రాస్తారోకోను విరమించుకున్నారు.
ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతులు : దంతాలపల్లి మండలం రామవరంలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ను రైతులు అడ్డుకున్నారు. గ్రామ శివారులోని చెరువు కట్ట వద్ద రహదారికి అడ్డుగా ధాన్యం పోసి కూర్చోని నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో భాగంగా ఎమ్మెల్యే రామవరానికి వెళ్తున్న క్రమంలో.. రైతులు అడ్డుకున్నారు. వారు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారు. గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంల్లో నిలిచిపోయాయని.. ధాన్యం బస్తాలు కేంద్రం దగ్గరే ఉంటున్నాయని.. లారీలు సకాలంలో రాకపోడంతో నిల్వలు పేరుకుపోయాయన్నారు.
కలెక్టర్‌కి ఫోన్ చేసిన ఎమ్మెల్యే : క్వింటాకు 10 కిలోల చొప్పున మిల్లు యజమానులు కోత కోస్తున్నారని అన్నదాతలు ఆరోపించారు. ధాన్యంతో ఇబ్బందులు పడుతున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాకే గ్రామానికి రావాలంటూ పట్టు పట్టారు. పోలీసులు రైతులను బలవంతంగా పక్కకు తొలగించి ఎమ్మెల్యేను సభా వేదిక వద్దకు తీసుకెళ్లారు. రైతుల సమస్యను ఎమ్మెల్యే ఫోన్లో కలెక్టర్‌కి తెలియజేశారు. కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యం నిల్వలను తరలించేందుకు లారీలను సమకూర్చాలని కలెక్టర్‌ను కోరారు.
ఇవీ చదవండి:
