పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలతో గులాబీ నేతల ఓట్ల వేట - మరోమారు అవకాశమిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటూ 'మాట'

పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలతో గులాబీ నేతల ఓట్ల వేట - మరోమారు అవకాశమిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటూ 'మాట'
BRS Leaders Election Campaign 2023 : అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రగతి, సంక్షేమ పాలన కొనసాగాలంటే మరోసారి తమకే పట్టం కట్టాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే అనేక అంశాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపామని.. మరోమారు అవకాశమిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెబుతున్నారు. పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలతో గులాబీ నేతలు ఓట్ల వేట సాగిస్తున్నారు.
BRS Leaders Election Campaign 2023 : హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నియోజకవర్గాల్లో గడప, గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లా వైఎస్సాఆర్ కాలనీలో ప్రచారం నిర్వహించిన ఇంద్రకరణ్ రెడ్డి ఆదివాసీల దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో చింతా ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ జలాశయ భూనిర్వాసితులు సీఎం కేసీఆర్(CM KCR)కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఆయన కుమారుడు సంజయ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కుల సంఘాలను కలుస్తూ, కార్నర్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
BRS Leaders Road Show in Mahabubabad : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ వ్యక్తి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. సన్నూరు గ్రామానికి చెందిన రవి.. దయన్న అనే పేరు వచ్చేలా తలపై కటింగ్ చేసి.. ప్రచారంలో పాల్గొంటున్నాడు. చిన్నవడ్డేపల్లి చెరువు బాధితులకు న్యాయం చేస్తానని చెప్పి.. కారు గుర్తుకే ఓటేయాలని ప్రతిజ్ఞ చేయించిన వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మహబూబాబాద్‌లోని పలు వార్డులలో రోడ్‌షో(BRS Leader Road Show) నిర్వహించిన శంకర్‌నాయక్ బంజారా మహిళలతో కలిసి నృత్యం చేశారు.
Sandra Venkata Veeraiah Election Campaign in Sattupalli : జోగులాంబ గద్వాల జిల్లా ఇటికాల మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నల్గొండ జిల్లా ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతను గెలిపించాలని టీఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కోరారు. ఖమ్మం జిల్లా వైరాలో బానోత్ మదన్‌లాల్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో లింగాలకమల రాజు గులాబీ జెండాకు మద్దతివ్వాలని కోరారు. సత్తుపల్లి అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య కల్లూరు శ్రీవీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ప్రజలను కారు గుర్తుకే ఓట్లు వేయాలని కోరారు. ప్రచారంలో డప్పు వాద్యాలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.
BRS Legal Department Complaint on Revanth Reddy : కార్యకర్తలను రెచ్చగొడుతూ దుర్భాషలు మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేదించాలని బీఆర్ఎస్ ఎన్నికల సంఘాన్ని కోరింది. పార్టీ ప్రతినిధులు ఈ మేరకు సీఈఓను కలిసి వినతి పత్రం అందించారు. పచ్చగా ఉన్న తెలంగాణను హింసాత్మకం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించిందని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ ఆరోపించారు.
