తుపాకీ చప్పుళ్లతో మారుమోగిన ఆ ప్రాంతమిప్పుడు 'చైతన్యం'తో నిండిపోయింది!

author img

By

Published : Jul 21, 2021, 2:03 PM IST

Updated : Jul 21, 2021, 2:10 PM IST

tribe women

ఒకప్పుడు తుపాకీ చప్పుళ్లతో ఉలికిపడిన ప్రాంతం. ఏరోజుకారోజు ఏమవుతుందో.. ఎలా బతకాలో అని భయంగుప్పిట్లోనే బతికిన ప్రజలు. బిడ్డల ఆకలి తీర్చలేక... కనీస ఆర్థిక భద్రత లేక.. చాలీచాలని ఆదాయంతో జీవనం సాగించిన బతుకులు. ఎన్నో వనరులున్నా ఎలా అమ్ముకోవాలో తెలియక వచ్చిన మొత్తాన్నే తీసుకుని విలువైన వస్తువులు అమ్ముకుని పొట్టపోసుకున్న గిరిజనం. ఈ అన్ని సమస్యలకు ఒక్క పరిష్కారం దొరికింది. మన్యంలో గిరిజన మహిళల చేతికి ఉపాధి అస్త్రం లభించింది. పోలీసుల సాయంతో అడవిలో దొరికే ఆకులను యంత్రం సాయంతో ఆకర్షనీయంగా తయారు చేస్తూ మార్కెట్​లో విక్రయించుకునే దారి కనిపించింది. సంఘంగా ఏర్పడిన గిరిజన మహిళలు ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటూనే నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రములోనే మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తుపాకీ చప్పుళ్లు.. బూట్ల శబ్దాలు వినిపించని రోజుండేదికాదు. కానీ నేడు ఒక్కొక్క మన్యం ప్రాంతం అభివృద్ధివైపు నడుస్తోంది. మహిళా చైతన్యంతో ఉపాధి మార్గాలు గిరిజన గూడేలను పలకరిస్తున్నాయి. మండలంలోని మంగీ ప్రాంతంలోని గుండాల గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు.. పోలీసుల సహకారంతో స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేస్తున్నారు. అడవుల్లో లభించే ముడి వనరులను వినియోగించుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు.

మంగి ప్రాంతం దట్టమైన అడవులతో అనేక సహజసిద్ధమైన ప్రకృతి వనరులకు పెట్టింది పేరు. ఇక్కడ అడవుల్లో విస్తరాకు తయారీకి అనుకూలమైన మోదుగ ఆకు, అడ్డాకు విస్తారంగా లభిస్తుంది. గతంలో ఈ ప్రాంత మహిళలు ఈ ఆకులను విస్తరులుగా తయారు చేసి వారం సంతల్లో అమ్ముకునేవారు. బయట మంచి గిరాకీ ఉన్నా సంతల్లో అతి తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితి నుంచి తామే బయటపడి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని 15 మంది మహిళలు "గిరిజన విస్తరాకుల సంఘం" పేరుతో బృందంగా ఏర్పడి విస్తరాకులను సమీప ప్రాంతాల్లో అమ్మేవారు.

ఇదీ చూడండి: దటీజ్ 'మౌనిక': ఆ వైద్యురాలు... అడవిలో అభిమన్యురాలు!

కానీ ఆకర్షణీయంగా ఉన్న పేపర్​ ప్లేట్లకు డిమాండ్​ ఉండడంతో వీరి వ్యాపారం అంతంతమాత్రంగానే ఉండేది. ఈ విషయాన్ని గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న తిర్యాణి పోలీసులు ఆ మహిళలకు అండగా నిలబడ్డారు. అమెరికాకు చెందిన చిరాగ్​ ఫౌండేషన్​ అధికారుల సాయంతో గిరిజన మహిళలకు ఆకులతో ప్లేట్లను తయారు చేసి ఇచ్చే యంత్రాలను అందించారు.

పోలీసుల సాయంతో...

15 మంది మహిళలం గ్రూపుగా ఏర్పడి అడ్డాకులు తెచ్చి ఇస్తర్లు కుడతామని చెప్పాము. పోలీసులు మాకు మిషన్​ ఇప్పించారు. మేము కష్టపడి అడవిలో ఆకులు తెచ్చుకుని కుట్టి ప్లేట్లు చేస్తున్నాం. పోలీసుల ద్వారా సాయం అందించారు. మాకు ఉపాధి చూపించారు. గిరిజన విస్తరాకుల సంఘం మహిళ

గ్రామానికి చెందిన ఇద్దరి యువకులకు శిక్షణ ఇప్పించి గ్రామంలోనే ఆకులతో ప్లేట్ల తయారీ చేస్తూ మార్కెట్లో మంచి లాభాలకు విక్రయిస్తున్నారు. పర్యావరణ హితమైన ఈ ప్లేట్లకు మార్కెట్లో మంచి డిమాండ్​ ఉంది. రోజుకు సుమారు 2 వేల నుంచి 2500 విస్తర్లు తయారు చేస్తున్నారు.

మావంతు సాయం చేస్తాం.. ముందుకు రండి

దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గుండాల గ్రామంలో సరైన రోడ్డు మార్గం కూడా లేని ప్రాంతం. ఈ గ్రామంలో మొత్తం ఏడు గూడేలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మోదుగ ఆకులు, అడ్డాకులు విస్తారంగా ఉంటాయి. గతంలో ఇక్కడి మహిళలు ఈ ఆకులను వారం సంతల్లో చవకగా అమ్మేవారు. తమకొక విస్తరాకులు తయారు చేసే యంత్రం ఇస్తే తామే ప్లేట్లు తయారుచేసుకుని ఉపాధి పొందుతామని పోలీసుల దృష్టికి తెచ్చారు. ఈ విషయమై అమెరికాకు చెందిన చిరాగ్​ ఫౌండేషన్​ సభ్యులకు చెప్పగా వారు మిషన్​ అందించారు. 16 మంది గిరిజన మహిళలు సంఘంగా ఏర్పడి గ్రామంలోనే విస్తరాకులు తయారు చేసుకుంటున్నారు. మొత్తం 20 కుటుంబాల వారు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. మరికొందరికి కూడా ఉపాధి కల్పించే అవకాశం దొరికింది. వీరిని ఆదర్శంగా తీసుకుని పరిసర గ్రామాల గిరిజన మహిళలు, యువత కూడా స్వయం ఉపాధి కోసం ముందుకు వస్తే మావంతు సాయం అందిస్తాము. పి.రామరావు, తిర్యాణి ఎస్సై.

చివరిగా ఒక్కమాట..

దారి అనేది ఎదురు చూడడం వల్ల ఏర్పడదు. నడిస్తేనే గమ్యాన్ని చేరుకొవచ్చు. అలాగే ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే అందివచ్చిన అవకాశాలను ఒడుపుగా పట్టుకుని ముందుకెళ్లాలి. అందుబాటులో ఉన్న వనరులను అవసరమైన వారికి అందిస్తూ ఆర్థికంగా ఒక్కో మెట్టూ ఎక్కుతున్న ఈ గిరిజన మహిళలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పరిసర గ్రామాల మహిళలు ముందొకొస్తే అధికారులు సాయం అందిస్తామంటున్నారు. చిన్న చిన్న కుటీర పరిశ్రమలతో ఎంతో ఎత్తుకు ఎదిగిన మహిళలను ఎందరినో చూసుంటాం. వారి బాటలోనే వీరు సాగుతున్నారు. మరింత మంది ముందుకొస్తే కొంతైన ఆర్థిక భద్రత లభిస్తుంది.

ఇదీ చూడండి: koya tribe : మనకు తెలియని గిరిపుత్రుల జీవన విధానం

Last Updated :Jul 21, 2021, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.