Love marriage: ఎల్లలు దాటిన ప్రేమ.. కరోనా అడ్డుకున్నా ఒక్కటైంది.!

author img

By

Published : Jul 4, 2021, 2:02 PM IST

Updated : Jul 5, 2021, 9:39 AM IST

love marriage in sirpur t mandal

దేశాలు వేరైనా వారి మనసులొక్కటయ్యాయి. కలకాలం కలిసుండాలని.. ఇరు కుటుంబాల పెద్దలను పెళ్లికి ఒప్పించారు. ఇక ముహూర్తమే ఆలస్యమనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి విలన్​ రూపంలో వారి వివాహానికి అడ్డంకిగా మారింది. విదేశాలకు రాకపోకల విషయంలో ఆంక్షలు విధించినా.. అన్ని అవరోధాలను దాటుకొని మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది ఈ జంట.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాకపోకలను పలు దేశాలు నిలిపివేశాయి. అలాంటి సమయంలో కూడా తమ ప్రేమను నిలుపుకుని ఓ జంట ఒక్కటైంది. కొవిడ్​ ఆంక్షల వల్ల అమ్మాయి తల్లితండ్రులు భారత్ రాలేకపోవడంతో... అబ్బాయి బంధువులు అమ్మానాన్నలుగా మారి కన్యాదానం జరిపించారు. ఈ సంఘటన కుమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలంలో జరిగింది.

మండలానికి చెందిన అచ్యుత్ కుమార్... ఖతార్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే నేపాల్‌కు చెందిన రమీలతో ప్రేమలో పడ్డాడు. తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు. పెళ్లి.. అబ్బాయి స్వస్థలంలో జరిపించాలని అనుకున్నారు. కానీ.. ఈలోగా.. కరోనా రెండో దశ విజృంభించింది. దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

వారికి అనుమతివ్వలేదు

ఎట్టకేలకు వరుడు పలు ఆంక్షల నుడుమ స్వదేశానికి చేరుకున్నాడు. కానీ వధువు నేపాల్‌లోనే ఉండిపోయింది. ఎలాగైనా ఒక్కటవ్వాలనుకున్న ఆ జంట... పెళ్లి పత్రికతో పాటు పలు ఆధారాలు చూపెట్టారు. వధువుతో పాటు తన సోదరుడిని మాత్రమే అధికారులు భారత్‌లోకి అనుమతించారు. పెళ్లి కూతురు అమ్మానాన్నలకు అనుమతి లభించలేదు. దీంతో వరుడి మేనమామ, మేనత్తలు అమ్మాయికి అమ్మానాన్నలుగా మారి కన్యాదానం చేశారు. అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రేమను గెలిపించుకొని మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వడంతో ఆ జంట ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.

ఇదీ చదవండి: Vaccination: లక్ష్యానికి చేరువలో.. 6నెలల వ్యవధిలో కోటి 16 లక్షల టీకాలు

Last Updated :Jul 5, 2021, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.