Kanaka Raju: పద్మశ్రీ కనకరాజు దీనస్థితిపై స్పందించిన కలెక్టర్ రాహుల్ రాజ్

author img

By

Published : Jul 18, 2021, 7:31 PM IST

Padma Shri Kanakaraju

కొన ఊపిరితో ఉన్న ఆదివాసీల కళలకు ప్రాణం పోసిన గుస్సాడి నృత్య కళాకారుడు పద్మశ్రీ కనకరాజు.. ఆరోగ్య, ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. పద్మశ్రీ కనక రాజు ఆరోగ్యంపై ఈనాడు- ఈటీవీ భారత్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించాయి. దీనిపై స్పందించారు కుమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. వెంటనే ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయనను ఆదిలాబాద్ రిమ్స్​లో చేర్చి వైద్యం అందిస్తున్నారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజు అస్వస్థతకు గురయ్యారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన ఈయన ప్రస్తుతం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివాసీ సంప్రదాయ నృత్యం గుస్సాడీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన 63 ఏళ్ల కనక రాజుకు కేంద్రం ఇటీవల పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించిన సంగతి తెలిసిందే.

క్షయ వ్యాధితో బాధపడుతూ ఆపన్నహస్తం కోసం ఇంట్లో మంచం పట్టిన రాజు దీనస్థితిపై ఈనాడు- ఈటీవీ భారత్​లో ప్రత్యేక కథనం వచ్చింది. దీనిపై కలెక్టర్ రాహుల్ రాజ్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి కుడిమెత మనోహర్ కనక రాజును దగ్గరుండి రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షల్లో క్షయ వ్యాధి నిర్ధరణ కావడం వల్ల ఆయనను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం కనక రాజు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇందిరా గాంధీ హయాంలోనే...

మూలన పడిపోతున్న గుస్సాడి నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి.. కనకరాజు పద్మశ్రీ అవార్డును కైవసం చేసుకున్నారు. కనకరాజు గుస్సాడి నృత్య ప్రతిభ... అప్పటి ఐఏఎస్ మడావి తుకారాం దృష్టికి రాగా.. ఎలాగైనా వెలుగులోకి తీసుకురావాలని తలచారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అంతరించిపోతున్న ఆదివాసీ కళను ఆదరించాలన్న తుకారాం విజ్ఞప్తికి స్పందించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.. కనకరాజును దిల్లీకి పిలిపించుకున్నారు. కనకరాజుతో కలిసి ప్రధాని కూడా గుస్సాడి నృత్యంలో కాలు కదిపారు. అప్పటి నుంచి గుర్తింపు పొందిన గుస్సాడి కనకరాజు... ఇండియా గేట్ వద్ద ఓ సారి, బాపు ఘాట్ వద్ద రెండు సార్లు, స్వాతంత్య్ర దినోత్సవంలో మూడు సార్లు తన ప్రదర్శనలిచ్చి... పద్మశ్రీ అవార్డును కైవసం చేసుకున్నారు.

ఇదీ చూడండి: అంపశయ్యపై కనకరాజు: ఇందిరాగాంధీతో నృత్యం చేసిన 'పద్మశ్రీ'కి పలకరింపే కరవైంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.