TIGER WANDERING: అక్కడ రెండు రోజుల్లోనే చెర.. ఇక్కడ ఏడు నెలలైనా పట్టుకోలేదు..

author img

By

Published : Jul 23, 2021, 7:59 AM IST

authorities-unable-to-catch-wander-tiger-in-asifabad-district

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ‘ఏ-2’ పెద్దపులి ఇప్పటికే ఇద్దరు మనుషుల్ని పొట్టన పెట్టుకుంది. దాదాపు 45 పశువుల్ని చంపినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 7 నెలలు గడుస్తున్నా ఈ పెద్దపులిని పట్టుకోవడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని యావత్మల్‌ జిల్లాలో ఇటీవల ఓ పెద్దపులి 17 ఏళ్ల యువకుడిని హతమార్చింది. 48 గంటల్లోపే అక్కడి అటవీ అధికారులు ఆ పులిని బంధించి ప్రజల్లో భయాందోళనల్ని తగ్గించారు. గత డిసెంబరులో కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇద్దర్ని ‘ఏ-2’ పెద్దపులి చంపింది. ఏడు నెలలైనా ఆ పులిని అధికారులు పట్టుకోలేకపోయారు. కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలోనే సంచరిస్తున్న ఆ పులి పెద్దసంఖ్యలో పశువుల్ని చంపుతోంది. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఏడాది వ్యవధిలో 119 పశువులు పెద్దపులుల దాడుల్లో హతమవగా.. అందులో దాదాపు 45 పశువుల్ని ‘ఏ-2’ చంపినట్లు అంచనా.

తరచూ ఈ పులి దాడులకు పాల్పడుతుండటంతో ఆయా ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జింకలు, నీల్గాయి వంటి వన్యప్రాణుల్ని వేటాటడం కంటే పశువుల్ని వేటాడి ఆకలి తీర్చుకోవడం సులభంగా ఉండటం పులుల ధోరణి మారడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, పశువులు, గేదెల్ని చంపేటప్పుడు వాటి నుంచి కొంత ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో మరింత సులభంగా ఆకలి తీర్చుకునేందుకు పులులు మనుషుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అటవీ ప్రాంతం ఎక్కువ, తక్కువలే కారణమా?

‘ఏ-2’ను పట్టుకునేందుకు జనవరిలో రెండు దఫాలుగా అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. ఆసిఫాబాద్‌ జిల్లాలో భౌగోళిక పరిస్థితులు పెద్దపులి తప్పించుకునేందుకు అనుకూలంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ‘మహారాష్ట్రలో అటవీప్రాంతం తక్కువ. పెద్దపులులు ఎక్కువ. ఒక్కో పులి ఆవాసప్రాంతం తక్కువ విస్తీర్ణమే. ఎక్కువ దూరం వెళ్లదు. ఇటీవల ఓ యువకుడిని చంపిన పులి పట్టివేతకు ఈ అంశాలు అనుకూలించాయి. అదే ఆసిఫాబాద్‌ జిల్లాలో అటవీప్రాంతం ఎక్కువ. ఒక్కో పులి సంచరించే పరిధి ఎక్కువ. అందువల్లే ఏ-2ను పట్టుకోవడం క్లిష్టంగా మారింది’ అని ఆసిఫాబాద్‌ జిల్లా అటవీ అధికారి శాంతారామ్‌ ‘ఈనాడు’తో చెప్పారు.

ఇదీ చూడండి: Viral Video: గ్రామంలోకి చిరుతలు.. వణికిపోతున్న ప్రజలు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.