ఆస్తి కోసం కన్నబిడ్డను కడతేర్చిన తండ్రి - హత్యలో అన్నదమ్ముల హస్తం

ఆస్తి కోసం కన్నబిడ్డను కడతేర్చిన తండ్రి - హత్యలో అన్నదమ్ముల హస్తం
Father Killed Daughter In Khammam District : పెళ్లయిన పదేళ్ల తర్వాత గర్భం దాల్చిన ఆ ఆడబిడ్డను చేరదీయాల్సిన పుట్టింటి వారే.. ఆస్తుల కోసం పొట్టనపెట్టుకున్నారు. కుటుంబపరమైన ఆస్తి గొడవల్లో ఏకంగా కొడవళ్లు, గొడ్డలితో వేటాడుతూ తండ్రి, సోదరులు కలిసి తమ ఇంటి బిడ్డను కిరాతకంగా హతమార్చారు. అత్యంత అమానవీయమైన ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలో చోటుచేసుకుంది.
Father Killed Daughter In Khammam District : బంధాలు, అనుబంధాలు అన్ని మాటలకే పరిమితమైపోతున్నాయి. మనిషిలోని మానవత్వం రోజురోజుకు మాయమైపోతుంది. ప్రేమానురాగాలు పంచాల్సిన కన్న తండ్రే సోదరులతో కలిసి కన్న బిడ్డను హత్య చేశాడు. పెళ్లయిన పదేళ్ల తర్వాత గర్భం దాల్చిన ఆ ఆడబిడ్డను చేరదీయాల్సిన పుట్టింటి వారే.. ఆస్తుల విషయంలో పొట్టన పెట్టుకున్నారు. కుటుంబపరమైన ఆస్తి గొడవల్లో ఏకంగా కొడవళ్లు, గొడ్డలితో వేటాడుతూ కిరాతకంగా చంపారు. అత్యంత అమానవీయమైన ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. తాటిపూడికి చెందిన పిట్టల రాములు, మంగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు నరేశ్, సురేశ్, వెంకటేశ్‌తోపాటు కుమార్తె ఉషశ్రీ ఉంది. చిన్నప్పటి నుంచి తాతయ్య(ఉషశ్రీ తల్లి మంగమ్మ తండ్రి) మన్యం వెంకయ్య... మనవరాలు ఉషశ్రీని పెంచి పెద్ద చేశారు. పదేళ్ల క్రితం పరిసబోయిన రామకృష్ణ(కొణిజర్ల మండలం గోపారం)తో ఆమెకు పెళ్లి చేశారు. ఆమె ఆలనాపాలనా చూసిన తాతయ్య వెంకయ్య పెళ్లి సమయంలో మనవరాలు ఉషశ్రీకి.. వ్యవసాయ పొలంతో పాటు గ్రామంలోని ఇల్లు, స్థలం ఇచ్చారు. వీరు కూడా తాటిపూడిలోనే ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితం వెంకయ్య మృతి చెందారు. వెంకయ్యకు మంగమ్మ ఒక్కరే కుమార్తె.
Father And Brothers Killed Woman In Khammam : మనవరాలికి వెంకయ్య ఎక్కువ ఆస్తి ఇచ్చారంటూ ఉషశ్రీ, రామకృష్ణలపై ఆమె పుట్టింటి వారు కక్ష పెంచుకున్నారు. ఉషశ్రీ దంపతులపై ఆమె తండ్రి, సోదరులు కోర్టుకు వెళ్లారు. ఆస్తి తమకే దక్కాలంటూ ఇరువర్గాలు కొన్నేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నాయి. దీనిపై గ్రామంలో పంచాయితీలు, ఘర్షణలు కూడా జరిగాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా ఉషశ్రీ, రామకృష్ణలకు చెందిన ఇంటి ఆవరణలో సుబాబుల్ చెట్లున్నాయి. వీటిని నరికే విషయంలో ఉషశ్రీ దంపతులకు, పుట్టింటి వారికి మధ్య శుక్రవారం రోజున గొడవ చోటుచేసుకుంది.
సుబాబుల్ ఉన్న భూమి మాదంటే మాదంటూ ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. గొడవ పెద్దది కావడంతో పిట్టల రాములు, నరేశ్, వెంకటేశ్‌లు తమ దగ్గరున్న కొడవళ్లు, గొడ్డలి, పారతో పాటు రాళ్లు విసురుతూ ఉషశ్రీ దంపతులపై దాడి చేశారు. భయంతో రామకృష్ణ, ఉషశ్రీ చెరోవైపు పరుగులు తీశారు. ముందుగా వారు అల్లుడు రామకృష్ణపై దాడి చేయడంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు.
ఉషశ్రీ ప్రాణ భయంతో పరుగులు తీస్తుండగానే వెంట పడిన తండ్రి, సోదరులు దాడి చేసి చంపేశారు. మృతురాలు అయిదు నెలల గర్భిణి అని స్థానికులు తెలిపారు. అల్లుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు ఈ ఘటనలో పిట్టల రాములు, వెంకటేశ్‌లకూ గాయాలయ్యాయి. ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
