ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన.. వేతనాలు పెంచాలని డిమాండ్

ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన.. వేతనాలు పెంచాలని డిమాండ్
Salary Issue of RTC Bus Drivers in Karimnagar: కరీంనగర్‌లో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల జీతాల వ్యవహారం రోజురోజుకు వివాదంగా మారుతోంది. సరైన వేతనాలు చెల్లించాలని డ్రైవర్లు సమ్మె చేస్తుండగా, బస్సు యజమానులు అందుబాటులో ఉన్న వేరే డ్రైవర్లను డ్యూటీకి పంపిస్తుండటంతో ఆందోళనలు మొదలయ్యాయి. బస్సు డ్రైవర్లకు శిక్షణతో పాటు అనుభవం, వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా పనులు అప్పగిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి.
Salary Issue of RTC Bus Drivers: కరీంనగర్‌లోని 2 ఆర్టీసీ డిపోల్లో మొత్తం 86 అద్దె బస్సులు ఉన్నాయి. అయితే కనీస వేతనాల కోసం డ్రైవర్లు సమ్మెకు దిగడం ఇబ్బందిగా మారింది. దీంతో బస్సు సర్వీసులు ఆగకుండా ఉండేందుకు కనిపించిన ట్రాక్టర్, లారీ డ్రైవర్ల ద్వారా బస్సులు నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2 డిపోల్లో 86 సర్వీసులు అందుబాటులో ఉండగా అందులో 28 సర్వీసులు ఇతర డ్రైవర్లతో నడిపిస్తున్నారు.
RTC Rental Bus Drivers in Karimnagar: బస్సు నడిపేవారికి శిక్షణ, అనుభవం పరిశీలించకుండా డ్యూటీ చేయించడం ఎంతవరకు సమంజసమని సమ్మె చేస్తున్న డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. బస్సు యజమానులు తమకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. అర్హత లేని వారికి బస్సులు అప్పగించి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తున్నారు. తమకు వెంటనే జీతాలు పెంచాలని లేదంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
అంకిత భావంతో విధులు నిర్విర్తిస్తున్న డ్రైవర్లకు నిబంధనల ప్రకారమే వేతనాలు ఇస్తున్నట్లు బస్సు యజమానులు చెబుతున్నారు. డ్రైవర్లు సమ్మెకు దిగితే వారి స్థానంలో అనుభవం లేని వారిని పంపుతున్నామనే విషయంలో నిజం లేదని పేర్కొన్నారు. ఒక్కో బస్సుకు ఉండే ఇద్దరు డ్రైవర్లు రాని సందర్భంలో మూడవ డ్రైవర్‌ను సిద్ధం చేసుకొని పెడతామని తెలిపారు. ఇప్పుడు విధులు నిర్వర్తిస్తున్న వారంతా ఆ మూడో డ్రైవర్లేనంటూ సమాధానమిస్తున్నారు.
ఆర్టీసీ అధికారులు మాత్రం నిబంధనలకు అనుగుణంగా ఉన్న వారిని మాత్రమే బస్సులు నడిపేందుకు అనుమతిస్తున్నట్లు వివరించారు. బస్సు సర్వీసులు ఆగకుండా ఉండేందుకు అనుభవం లేని వారికి బస్సులు అప్పగించొద్దని ప్రయాణికులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా తమ సమస్యను పరిష్కరించాలని సమ్మె చేస్తున్న డ్రైవర్లు కోరుతున్నారు.
ఇవీ చదవండి:
