పంజా విసురుతోన్న విష జ్వరాలు.. కలవరపెడుతోన్న డెంగీ మహమ్మారి

author img

By

Published : Sep 15, 2022, 9:47 PM IST

డెంగీ కేసులు

Dengue Cases: మారిన వాతావరణం భారీ వర్షాలు.. విజృంభిస్తున్న దోమలు. వెరసి విషజ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. మరోసారి కరోనా కేసులు వెలుగు చూస్తున్న క్రమంలో జ్వరాలు, డెంగీ కేసులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పలుచోట్ల వైరల్‌ ఫీవర్ల విజృంభణతో ప్రభుత్వాస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. జ్వరాలు పంజా విసురుతున్న వేళ ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

పంజా విసురుతోన్న విష జ్వరాలు.. కలవరపెడుతోన్న డెంగీ మహమ్మారి

Dengue Cases: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా జ్వరాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు.. ఇటీవల భారీవర్షాలతో జనవాసాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో దోమలు పెరిగిపోయి ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. డెంగీ వ్యాప్తి చేసే దోమకు 24 నుంచి 30డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఉండగా.. ఇటీవల వాతావరణ మార్పులతో ఈ దోమ పెరిగే ఆస్కారం అధికంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

పారిశుద్ధ్య చర్యలు సైతం అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. 'డ్రై'డే పాటించాలనే ప్రచార హోరు తప్పితే ఆచరణలో మాత్రం ఎక్కడా అమలవటం లేదు. ఈ ఆర్నెళ్ల కాలంలో ఒక్క కరీంనగర్‌ జిల్లాలోనే 42వేల మందికి పైగా జ్వరాల బారిన పడినట్లు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు 4వేల మందికి పైగా రక్త నమూనాలు సేకరించారు. వీరిలో 175 మందికి డెంగీ నిర్ధారణ అయింది.

మానకొండూర్‌, గంగాధర, కొత్తపల్లి, తిమ్మాపూర్‌, కరీంనగర్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌, ఎలిగేడు మండలం ధూళికట్ట, మానకొండూరు మండలం వెల్ది.. ఈ మూడు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు డెంగీ కారణంగా చనిపోయారు. రోజురోజుకు పెరుగుతున్న జ్వరాలతో ఆస్పత్రులు సైతం కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల వద్ద నిత్యం వందల సంఖ్యలో జ్వరబాధితులు బారులు తీరుతున్నారు.

ఇప్పటికీ కరోనా కేసులు నమోదు అవుతుండగా.. దీనికి తోడు జలుబు, దగ్గు, జ్వరం, డెంగీ నిర్ధారణతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ప్రతి జ్వరాన్నీ డెంగీగా భావించాల్సిన అవసరంలేదని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గత నెలతో పోల్చితే సర్కార్‌ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. గత నెలలో రోజుకు 500నుంచి 600 మంది వరకు రాగా ప్రస్తుతం 800 మంది ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారు.

జ్వరాల వేళ ప్రజలు సైతం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యులు సూచిస్తున్నారు. నిత్యం వందలాది మంది జ్వరాల బారీన పడుతున్న వేళ.. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సర్వే జరిపి, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

చాలా వరకు జ్వరం,దగ్గుతో రోగులు బాధపడుతున్నారు. కొన్నిచోట్ల డెంగీ కేసులు వస్తున్నాయి. ఇంటి పక్కన ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. - డాక్టర్ నవీన, వైద్యురాలు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి

రోగులు డెంగీ వచ్చిందనగానే భయపడతారు. ఇక్కడ రోగులకు సంబంధించి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వారికి సంబంధిచిన అన్ని చికిత్సలు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు రోగులను పర్యవేక్షించి వైద్యం అందిస్తున్నాం. -డాక్టర్‌ జ్యోతి, ఆర్‌ఎంఓ కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి

ఇవీ చదవండి: ఇవీ చదవండి: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి..

టోల్​బూత్ వద్ద ఇద్దరు మహిళల గొడవ.. ఒకరిపై ఒకరు పడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.