MURALIDHAR RAO: కేసీఆర్​ది అవినీతి పాలన.. ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

author img

By

Published : Sep 15, 2021, 1:18 PM IST

muralidhar rao

యువతకు ఉపాధి ఇవ్వలేని తెరాస అవినీతి పాలనను రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ ప్రచారం చేస్తామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​ రావు పేర్కొన్నారు. హుజూరాబాద్​ ఎన్నికల్లో భాజపా గెలుస్తుందనే భయంతోనే బడ్జెట్​ మొత్తం ఆ నియోజకవర్గానికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తోందని ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేసేందుకే కేంద్రంపై తెరాస నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కరీంనగర్​లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

తెరాస తీరు వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించేలా ఉందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​రావు ఆరోపించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తున్న వాటానే అధికమంటూ మంత్రి కేటీఆర్​ చేసిన సవాల్‌ను ఆయన తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ఖర్చులు అనేకం ఉంటాయని వివరించారు. రక్షణ రంగంతో పాటు, రైల్వే, ఇస్రో తదితర కేంద్ర ప్రభుత్వ రంగాలు, విదేశాల్లో రాయబార కార్యాలయాలు, కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు నిధులు ఎక్కడ్నుంచి వస్తాయని మురళీధర్‌రావు ప్రశ్నించారు. కరీంనగర్​లో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన.. తెరాస పాలనపై విమర్శలు గుప్పించారు.

భాజపా జాతీయ నేత మురళీధర్​ రావు మీడియా సమావేశం

రాష్ట్రంలో తెరాసకు పోటీ ఇచ్చే సత్తా.. భాజపాకు తప్ప ఇతర ఏ పార్టీకి లేదని మురళీధర్​ రావు స్పష్టం చేశారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానేనని పేర్కొన్నారు. కేవలం నినాదాలతోనే ప్రజలను తెరాస ప్రభుత్వం మభ్యపెడుతోందని ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రతో సీఎం కేసీఆర్​ నియంతృత్వ పాలనను ఇంటింటికీ తీసుకెళ్తున్నామని చెప్పారు.

తెరాస తీరు వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించేలా ఉంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసేందుకే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారు. దేశ రక్షణతో పాటు ఇతర ఖర్చులు ఎక్కడ్నుంచి వస్తున్నాయి. వీటిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని మంత్రి కేటీఆర్​కు సవాల్​ విసురుతున్నా. వర్షాకాలం వరదల్లాగా.. హుజూరాబాద్​ ఉప ఎన్నిక కోసం ఆ నియోజకవర్గంలో విచ్చలవిడిగా తెరాస నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ప్రజల సొమ్మును ప్రజలకే పంచి వారిని మభ్యపెడుతున్నారు. కేసీఆర్​ అవినీతి పాలనను ఇంటింటికీ ప్రచారం చేస్తాం. -మురళీధర్​ రావు, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం లేదని మురళీధర్​ రావు అన్నారు. తెలంగాణలో ప్రధాని మోదీ పట్ల పెరుగుతున్న ఆదరణను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే పథకాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ఒత్తిడితోనే ఆయుష్మాన్​ భారత్​ను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Ganesh Immersion: హుస్సేన్​సాగర్‌లో నిమజ్జనంపై రేపు సుప్రీంలో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.