యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. అటు వైపే చూడని అధికారులు

author img

By

Published : Aug 1, 2022, 8:06 PM IST

ఇసుక

SAND TRANSPORT: కామారెడ్డి జిల్లాలో ఇసుక రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పట్టపగలే అక్రమంగా ఇసుకరవాణా చేస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. అధికారుల కళ్లెదుటే ఆ దందా సాగుతున్నా కళ్లకు కట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వందలాది లారీలు పరిమితికి మించి బరువుతో రోడ్లపై పరుగులు తీస్తుండడంతో రహదారులు పాడవుతున్నాయి.

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. అటువైపే చూడని అధికారులు

SAND TRANSPORT: రోడ్లపై ఏకధాటిగా తిరుగుతున్న లారీలు.. దెబ్బతిన్న రహదారులు.. రోడ్డును ఆనుకొని పెద్ద పెద్ద ఇసుక కుప్పలు. ఇది కామారెడ్డి జిల్లా మద్నూర్, బిచ్కుంద మండలాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. కుర్లా, ఖత్‌గావ్ గ్రామ సమీపంలోని మంజీరా నుంచి నిత్యం వందలాది లారీల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఎండాకాలంలో ఇక్కడ ప్రభుత్వ అనుమతులతో భూగర్భజలశాఖ అధికారులు ఇసుకక్వారీలు నడిపించారు.

రెండునెలల క్రితం అవి నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. వేసవిలో మంజీరాలో ఉన్న ఇసుక మొత్తాన్ని అక్రమార్కులు రోడ్డు పక్కన ఖాళీ స్థలాల్లో కుప్పలుగా పోశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక దందా సాగిస్తున్నారు. పరిమితికి మించి బరువుతో నిత్యం వందలాది లారీలు.. మద్నూర్, బిచ్కుంద మండలం కుర్లా, ఖత్‌గావ్ నుంచి డోంగ్లీ, మోగా, మేనూర్ గ్రామాల మీదుగా హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తున్నారు.

భారీఎత్తున ఇసుక దందా సాగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పరిమితికి మించిన బరువుతో లారీలు నడుస్తుండడంతో రోడ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ దందా మండలానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి కుటుంబ సభ్యులు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాపై అధికారులు దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి: యాదాద్రి టూ హన్మకొండ.. ఈసారి ప్రత్యేకంగా బండి సంజయ్​ మూడో విడత యాత్ర..

దళిత మహిళపై లైంగిక వేధింపులు.. తుపాకీతో బెదిరించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.