FARMERS: అన్నదాతల అరిగోసలు: కాలిన ట్రాన్స్​ఫార్మర్లు.. కావడెత్తిన రైతన్నలు

author img

By

Published : Sep 18, 2021, 7:02 AM IST

Updated : Sep 18, 2021, 8:00 AM IST

FARMERS: అన్నదాతల అరిగోసలు: కాలిన ట్రాన్స్​ఫార్మర్లు.. కావడెత్తిన అన్నదాతలు

పంటలు పండించేందుకు రైతులు ఎంతగా శ్రమిస్తారో కళ్లకు కట్టే... ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని రెండు గ్రామాల్లోని రైతులు వరిపైరు కాపాడుకునేందుకు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఒక చోట 16 మంది అన్నదాతలు ట్రాన్స్‌ఫార్మర్‌ను కావడిగా మోశారు. మరో చోట ఎడ్లబండి మీద తరలించేందుకు తీవ్రంగా శ్రమించారు.

FARMERS: అన్నదాతల అరిగోసలు: కాలిన ట్రాన్స్​ఫార్మర్లు.. కావడెత్తిన రైతన్నలు

పంట చేతికి వచ్చేదాక పంటలను రైతులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వేసవిలో నీటి ఎద్దడి నివారించేందుకు ట్యాంకర్లను వాడిన ఘటనలు అనేకం ఉన్నాయి. నారు, మొలక దశల్లో బిందెలతో నీళ్లు తెచ్చినవాళ్లు అనేకం. కాడెడ్లు లేక .. కుటుంబ సభ్యులే నాగలి లాగిన పరిస్థితులు అందరికీ తెలిసిందే. చివరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే మరమ్మతులు చేసుకునే క్రమంగా ప్రాణాలు కోల్పోయిన రైతులు ఉన్నారు. ఇలాంటి ఘటనలే కాకుండా ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు చేయించాలంటే అన్నదాతలు పడే కష్టాలు చూస్తే చలించనివాళ్లు ఉండరు.

కన్నీళ్లు తెప్పిస్తున్న అన్నదాతల కష్టాలు

కామారెడ్డి జిల్లా లింగాపూర్, టేక్రియాల్‌ గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. వాటి మరమ్మతులు చేయించేందుకు అన్నదాతలు పడిన కష్టానికి సంబంధించిన దృశ్యాలు కన్నీళ్లు తెప్పించేలా ఉన్నాయి. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ను బాగు చేయించేందుకు ఎడ్లబండిపై తీసుకెళ్లే ప్రయత్నంలో రైతులు తీవ్రంగా శ్రమించారు. మరో ట్రాన్స్‌ఫార్మర్​ను బాగుచేయించేందుకు భుజాలపై తీసుకెళ్తున్న దృశ్యాలు హృదయాన్ని కదిలించేవిగా ఉన్నాయి. ఈ రెండు ఘటనలకు సంబంధించిన దృశ్యాలు... అన్నదాతల కష్టాల్ని కళ్లకు కడుతున్నాయి.

శ్రమించి చివరకు..

ఒక గ్రామంలోని రైతులు... ట్రాన్స్​ఫార్మర్‌ను ఎడ్ల బండిపై తీసుకెళ్తుండగా వరి పొలంలో దాన్ని లాగేందుకు మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. రైతులు బండి చక్రాలను ముందుకు తోస్తున్నా... ఎద్దు కిందపడిపోయింది. పచ్చని పైరు మీద నుంచి ఎడ్ల బండి ప్రయాణిస్తే పంట పాడవుతుందని తెలిసినా... అందులోంచి వెళ్లక తప్పలేదు. పైరును కాపాడుకునేందుకు ట్రాన్స్‌ఫార్మర్‌ పరిధిలో కరెంటు వినియోగించుకునే అన్నదాతలంతా శ్రమించి చివరకు ఎడ్లబండిని ఒడ్డుకు చేర్చారు.

ట్రాన్స్‌ఫార్మర్‌నే మోసుకెళ్లారు..

మరో గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించే దృశ్యాలు కన్నీళ్లు పెట్టించేవిగా ఉన్నాయి. రైతులు కావడిలా ట్రాన్స్‌ఫార్మర్‌ను కావడిలా కట్టుకుని తమ భుజాలపై మోసుకెళ్లారు. బురద పొలంలో ఒకవైపు 8 మంది రైతులు.. మరోవైపు 8 మంది రైతులు ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్‌నే మోసుకెళ్లారు. భుజాన బండెడు బరువుతో అడుగు తీసి అడుగు వేయడమే కష్టంకాగా.. అన్నదాతలు ఊపిరి బిగపట్టుకుని ట్రాన్స్‌ఫార్మర్‌ను ఒడ్డుకు చేర్చారు.

ప్రశ్నిస్తున్న నెటిజన్లు

కామారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని గ్రామాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. మారుమూల పల్లెల్లోని పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని వైరల్‌ చేస్తున్నారు. అన్నదాతల కష్టాలపై నేతలు మొసలికన్నీళ్లు కారుస్తారే తప్ప... ఇలాంటివి ఎవరికీ కనపడవా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా రైతుల పట్ల కనికరం చూపాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: Minister KTR : 'జూట్ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒప్పందం'

Last Updated :Sep 18, 2021, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.