మాతృమూర్తీ నీకు సలాం.. మానసిక వైకల్యంతో ఉన్న కొడుక్కి పాతికేళ్లుగా సపర్యలు చేస్తూ..

author img

By

Published : May 8, 2022, 8:07 PM IST

Mother services to disabled son

Mother services to disabled son: విశ్వంలో వెలకట్టలేనిది పేగుబంధం. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా.. బిడ్డ ఎప్పటికీ తల్లికి భారం కాదు. వృద్ధాప్యం మీద పడినా.. 25 ఏళ్లుగా మానసిక వైకల్యంతో ఉన్న కుమారుడికి సపర్యలు చేస్తూ మాతృత్వానికి అర్థం చెబుతోంది ఈ మాతృమూర్తి. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటూ.. కొడుక్కి సేవలు చేస్తూ ఆత్మసంతృప్తి పొందుతోంది.

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం.. పింఛనుపైనే ఆధారం

Mother services to disabled son: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణానికి చెందిన ఐలమ్మకు 25 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పుట్టుకతోనే కుమారుడు మానసిక వికలాంగుడిగా, దివ్యాంగుడిగా జన్మించాడు. బిడ్డెలా ఉన్నా కన్న తల్లికి ముద్దే కదా.. అందుకే ఆ స్థితిలో పుట్టిన బిడ్డ ఉన్నా.. భారంగా భావించలేదు. బాధ్యత అనుకొని బరువంతా మీదేసుకుంది. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అయినప్పటికీ బెదరలేదు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూనే కుమారుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. సంపాదన, ఉన్న సొమ్మునంతా అతని వైద్యం కోసం ఖర్చు చేసింది. ఈ క్రమంలో 15 కిందట ఐలమ్మ భర్త చనిపోయాడు. దీంతో కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.

పూట గడిచేందుకు కష్టంగా ఉన్నా కూడా.. కుమారుడికి బాగవ్వాలని హైదరాబాద్, చెన్నై, తిరుపతి, విజయవాడ ఇలా పలు నగరాలకు తీసుకెళ్లి వైద్యం చేయించింది. కానీ అతని ఆరోగ్య పరిస్థితి మారలేదు. దీంతో ఇంటి దగ్గరే ఉంచుకుని చంటిబిడ్డకు చేసినట్లుగా సపర్యలు చేస్తోంది. భర్త బతికి ఉన్నప్పడు ఒకరు బిడ్డకు కాపలాగా ఉన్న.. మరొకరు పనికి వెళ్లేవారు. భర్త చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. కొడుకు మెలకువతో ఉన్నంత సేపు కాపలాగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సేవలు చేస్తూ ఇంటిపట్టునే ఉండిపోయింది. స్నానం, భోజనం అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటోంది. కనీసం కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితిలో కూడా కొడుకు లేడు.

"నాకు వెనకా ముందు ఎవరూ లేరు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మానసిక వైకల్యంతో ఉన్నాడు. నేను బతికి ఉన్నంత వరకు సేవలు చేస్తాను. నేను పోయిన తర్వాత నా బిడ్డకు సపర్యలు చేసేవారు ఎవరూ లేరు. దీనికితోడు కూలీ పనులు చేసుకోవడానికి కూడా వీలులేదు. వచ్చే పింఛను డబ్బులతో నా కొడుకు అవసరాలు తీరుస్తున్నాను. దాతలు గానీ ప్రభుత్వం కానీ స్పందించి మాకు సాయం చేయాలని వేడుకుంటున్నా." -ఐలమ్మ, తల్లి

వృద్ధాప్యంలోనూ కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది ఈ కన్నతల్లి. తన జీవితాన్ని కుమారుడికి అంకితం చేసింది. అన్నీ సరిగా ఉన్నా.. సాకలేక భారమై బిడ్డలను చెత్తకుప్పల్లో కొందరు తల్లులు పడేస్తున్న ఈ రోజుల్లో.. పుట్టిన బిడ్డ తనకు ఏ విధంగానూ ఆసరాగా నిలవడని తెలిసినా కళ్లలో పెట్టుకుని చూసుకుంటోంది. ఇంతటి గొప్ప మనసున్న ఈ మాతృమూర్తి.. ఎందరికో స్ఫూర్తి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.