KTR: బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా?

author img

By

Published : Sep 14, 2021, 4:58 PM IST

Updated : Sep 14, 2021, 5:44 PM IST

minister ktr, ktr inaugurations in gadwal

జోగులాంబ గద్వాల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. గద్వాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అలంపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో పలువురు మంత్రులతో కలిసి పాల్గొననున్నారు.

విపక్షాలపై కేటీఆర్ విమర్శల దాడి

ద్వాల్‌ బహిరంగసభలో మంత్రి కేటీఆర్‌ విపక్షాలపై విమర్శల దాడి చేశారు. రాష్ట్ర ప్రజలు వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి కడితే... ఆ సొమ్మును వెనుకబడిన రాష్ట్రాల్లో ఉపయోగిస్తోందని కేటీఆర్‌ అన్నారు. కేంద్రానికి రూపాయి పన్నులు కడితే... రాష్ట్రానికి ఆటానా ఇస్తోందని చెప్పారు. తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని... లేదంటే బండి సంజయ్‌ ఎంపీ పదవిని వదులుకునేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. 70 ఏళ్ల పాలనలో సాధించలేని కాంగ్రెస్... ఏడేళ్లుగా పాలించిన తెరాసను విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి... అలంపూర్‌ చౌరస్తాలో రూ.23 కోట్లతో నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి రూ.31 లక్షలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రహరీగోడకు భూమిపూజ చేశారు. నూతనంగా నిర్మించిన కస్తూర్భా విద్యాలయాన్ని ప్రారంభించారు.

రాష్ట్ర భాజపా అధ్యక్షుడు పాదయాత్ర చేస్తున్నరు. ఊరూరు తిరుగుతున్నరు. మాట్లాడుతున్నరు. మొత్తం పైసలు కేంద్రానివి.. కానీ షోకులు రాష్ట్రానివి అంటున్నరు. నేను అడుగుతావున్న ఆ పార్లమెంట్ సభ్యున్ని. ఆయన ఏం చదువుకున్నరో నాకు తెలవదు. ఈరోజు గద్వాల వేదికగా నేను సవాలు చేస్తున్నాను. ఒక మాట అడుగుతున్న. అయ్యా.. బండి సంజయ్ గారు. నేను చెప్పింది తప్పయితే నా రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వస్తా. మీరు చెప్పేది తప్పయితే మీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? ధైర్యం ఉంటే ఈ సవాలు స్వీకరించాలి. గత ఏడు సంవత్సరాలుగా మన తెలంగాణ ప్రజలందరూ కేంద్రానికి పన్నుల రూపంలో కట్టింది రూ.2.72 లక్షల కోట్ల రూపాయలు. కానీ కేంద్రం నుంచి మనకు రూ.1.42 లక్షల కోట్లు ఇచ్చింది. అంటే రూపాయి మనం మోదీకి కడితే... ఆయన మన తెలంగాణకు వాపసు ఇచ్చింది ఆఠానా.

-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

ప్రగతి బాట

ధరూర్‌ మండలంలోని రేవులపల్లి జూరాల ప్రాజెక్టు వద్ద రూ.15 కోట్ల వ్యయంతో పార్క్‌ నిర్మాణానికి, రూ.30 లక్షల వ్యయంతో గోనుపాడు వద్ద షాదీఖానా భవనం నిర్మాణానికి, రూ.1.5కోట్లతో సంఘాల రిజర్వాయర్ వద్ద పార్కు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ధరూర్ మండలంలోని చిన్నపాడు స్టేజి సమీపంలో విత్తన పత్తి రైతులతో మంత్రులు మాట్లాడి... పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి దేవి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రూ.కోటి 60 లక్షల వ్యయంతో జిల్లా గ్రంథాలయం, మరో రూ.కోటి యాభై లక్షల వ్యయంతో కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు.

70 ఏళ్లల్లో జరగని అభివృద్ధిని ఏడేళ్లలో చేసి చూపించాం. తండాలు గ్రామపంచాయతీలు కావాలని గిరిజనులు దశాబ్దాల పాటు ఎదురు చూశారు. గిరిజనుల దశాబ్దాల నాటి కలను తెరాస ప్రభుత్వం సాకారం చేసింది. పొరుగు రాష్ట్రాల్లో పాలన ఎలా ఉందో భాజపా కార్యకర్తలు పరిశీలించాలి. భాజపా కార్యకర్తలు వస్తానంటే కర్ణాటకకు తీసుకెళ్లి అక్కడి పరిస్థితి చూపిస్తాం. ఇళ్ల పంపిణీ వేగంలో పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు కోరినట్లు రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచుతాం.

-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

రూ.6.25కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇండోర్ ఆడిటోరియానికి, రూ.25 కోట్ల వ్యయంతో పురపాలికల్లో సీసీ రోడ్ల ఏర్పాటు, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, రూ.15 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ ఏర్పాటుకు, రూ.4 కోట్ల వ్యయంతో నూతన ఆర్టీసీ భవన నిర్మాణం, రూ.10 కోట్ల వ్యయంతో మహిళా పీజీ కళాశాల హాస్టల్ భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్‌వోబీ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు పాల్గొననున్నారు.

మొత్తం కేంద్రమే ఇస్తే ఇవే పథకాలు కర్ణాటకలో ఎందుకు లేవు?. తెలంగాణ పన్నులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారు. తెలంగాణను ప్రధాని మోదీ దగా చేస్తున్నారు. గద్వాలకు కూడ వైద్య కళాశాల మంజూరు చేస్తాం. దొడ్డు వరి ధాన్యం కొనేది లేదని కేంద్రం చెప్తోంది. కేంద్రంపై పోరాటం చేస్తూనే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి.

-కేటీఆర్‌, పురపాలక శాఖ మంత్రి

నిరసనలు

ఈ నేపథ్యంలో అలంపూర్‌ పట్టణానికి మంజూరైన 100 పడకల ఆస్పత్రిని... మార్కెట్‌ యార్డుకు తరలించారని పట్టణ ప్రజలు నిరసనలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే అబ్రహంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలంపూర్‌ పట్టణం బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో స్థానికులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గద్వాల పట్టణంలోని రాజా వీధిలో కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు బీజేవైఎం నాయకుల యత్నించగా.. పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: Telangana cabinet meeting : ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Last Updated :Sep 14, 2021, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.