Jurala canals Damaged: సాగుజలం వృథా మయం.. శిథిలావస్థకు చేరిన జూరాల కాలువలు

author img

By

Published : Oct 10, 2021, 7:22 PM IST

jurala

జూరాల ప్రాజెక్టు జాతికి అంకితమై దశాబ్ద కాలం గడుస్తున్నా నీటి కాలువలు మరమ్మతుకు నోచుకోలేదు. కాలువల నుంచి వృథాగా పోతున్న సాగుజలం రైతులకు శాపంగా మారింది(jurala canals damaged). ఏళ్లనాటి జూరాల కాలువల ఆధునికీకరణ చేయకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, తూములు మరమ్మతులకు గురై పొలాలకు చేరాల్సిన నీరు వృథాగా పోతోంది.

జోగులాంబ గద్వాల జిల్లాలోని(jogulamba gadwal) జూరాల ప్రాజెక్టు కాలువలు ఆధునికీకరణ పనులు చేపట్టక పోవడం వల్ల ప్రాజెక్టు నుంచి నీరు వృథాగా పోతోంది(jurala canals damaged). నీటి నిర్వహణ అంతంత మాత్రంగానే ఉండటం వల్ల ప్రధాన కాలువతో పాటు డిస్ట్రిబ్యూటరీల కింద లైనింగ్ దెబ్బతింది. డిస్ట్రిబ్యూటరీల కింద ఏర్పాటు చేసిన తూములు శిథిలావస్థకు చేరాయి. పంట కాలువలకు నీరు పారడం లేదని... ఈ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవవడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రధాన కాలువతో పాటు డిస్ట్రిబ్యూటరీల కింద కూడా కాలువలకు ఇరువైపులా కంప చెట్లు పెరిగిపోయాయి. కాలువల్లోని పూడికను తీయించి చాలా కాలమైంది. కొన్ని చోట్ల మట్టి మేటలు వేసింది. రైతులు తమ సొంత ఖర్చులతో పూడికను తొలగించుకుంటున్నారు.

రోడ్డెక్కిన కాలువ
రోడ్డెక్కిన కాలువ

నాటి నుంచి నేటి వరకు

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును 1996లో జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధునికీకరణ పనులు చేపట్టలేదు. ఇన్నేళ్లుగా పర్యవేక్షణ లేకపోవడం వల్ల 46.3 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువతో పాటు, డిస్ట్రిబ్యూటరీలలో కూడా ఇరువైపుల కంప చెట్లు పెరిగిపోయాయి(jurala canals damaged). 25 ఏళ్లలో రూ.30లక్షలు వెచ్చించి మైనర్​ రిపేరు పనులు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా ఖరీఫ్​లో 35,657 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. దీని నిర్వహణ కోసం ఈఈ, ఇద్దరు డీఈలు, నలుగురు ఏఈలు, 10మంది వర్క్​ఇన్​స్పెక్టర్లు, 10 మ్యాన్ మజ్జూర్​లు పనిచేస్తున్నారు.

కాలువను కప్పేసిన తుప్పలు
కాలువను కప్పేసిన తుప్పలు

అధికారుల మాటలకు.. క్షేత్ర స్థాయికి సంబంధం లేదు

అధికారులు చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు పొంతన లేదు. అధికారుల లెక్కల ప్రకారం ప్రధాన కాలువకు 1.5కి.మి.మేర అక్కడక్కడా, డిస్ట్రిబ్యూటరీ కాలువకు 3 కి.మి. మేర లైనింగ్​ దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

శిథిలావస్థకు చేరిన వంతెనలు
శిథిలావస్థకు చేరిన వంతెనలు

నిధుల లేక

ప్రభుత్వం ఆరకొరగా నిధులు విడుదల చేస్తుండటం వల్ల పెద్దమొత్తంలో ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. నాలుగేళ్లలో రూ.30 లక్షల నిధులు విడుదల చేయగా... అవి కేవలం ప్రధాన కాలువపై ఉన్న డిస్ట్రిబ్యూటరీల మరమ్మతుకే సరిపోయిందని చెబుతున్నారు. కాలువల నిర్వహణ మరమ్మతులు చేయకపోవడం వల్ల సాగు జలం వృథా అవుతోంది.

పూడుకుపోయిన కాలువలు
పూడుకుపోయిన కాలువలు

పూడుకుపోయిన డిస్ట్రిబ్యూటరీ

ప్రధాన కాలువ కింద ఉన్న అయిదో డిస్ట్రిబ్యూటరీ కాలువ చదునుగా మారింది. దీనివల్ల పంటకాలువలకు నీరు పారడం లేదు. ఎక్కువ మొత్తంలో నీరు వస్తే కాలువ పైనుంచి నీరు పొంగిపొర్లి పంటపొలాలను ముుంచెత్తుతోంది. తమ ఇబ్బందులను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు(jurala canals damaged).

సొంత ఖర్చులతో చేయించుకుంటున్నాం

ఈ కాలువను నమ్ముకునే సాగు చేస్తున్నాం. ఇప్పటికే ఇది చాలాచోట్ల పూడుకుపోయింది. నీరు ఎక్కువ వదిలితే పంటపొలాలు మునిగిపోతున్నాయి. తక్కువ వస్తుంటే పొలాలకు నీరందడం లేదు. ఇప్పటి వరకు కాలువ పూడిక తీసింది లేదు. కంపచెట్లతో మూసుకుపోయింది. కాలవ చివరకు వెళ్లేకొలది పొలాలకు చుక్కనీరందడం లేదు. - చాంద్​పాషా, ఆయకట్టు రైతు.

గత కొన్నేళ్లుగా మా సొంత ఖర్చులతోనే కాలువలో పూడికలు తీయించుకుంటున్నాం. కంపచెట్లు కాలవను కప్పేశాయి. చాలాచోట్ల పూడుకుపోయింది. కొన్ని చోట్ల పొలాలను ముంచేస్తుంది.. కొన్ని చోట్ల నీరందడంలేని పరిస్థితి. అధికారులు వచ్చి చూసి పోతున్నారు గానీ పట్టించుకునే వారే లేరు. ఎక్కడికక్కడే మోరీలు పగిలిపోయాయి. -లక్ష్మీ రెడ్డి, ఆయకట్టు రైతు.

అధికారులేమంటున్నారు

ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ, మైనర్​ కాలువలకు సంబంధించి 1996 నుంచి ఇప్పటి వరకు అక్కడకక్కడా తాత్కాళిక మరమ్మతులు తప్ప భారీ మొత్తంలో ఎక్కడా పనులు చేయలేదు. కాలువ మరమ్మతులకు సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. ఈ ఏడాది వేసవిలో కనీస మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించాము. ప్రాధాన్యం ఉన్న పనులను చేపడతాం. ఉపాధి హామీలో భాగంగా కొన్ని పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాము. -కాజా జుబేర్ అహ్మద్, ఈఈ జూరాల ప్రాజెక్టు.

ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడం వల్ల కాలువ లైనింగ్ దెబ్బతిన్న మాట వాస్తవమేనని అధికారులు చెబుతున్నారు. పూడిక తొలగింపు, కంప చెట్లు తీసేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని ఆదేశాలు ఇచ్చిందని వెల్లడించారు. మరోవైపు కాలువల ఆధునీకరణ పనులు చేపట్టేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మరమ్మతుకు సంబంధంచి ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని.. నిధులు విడుదల కాగానే పలులు చేపడతామన్నారు.

ఇదీ చూడండి: GRMB MEETING: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం భేటీ.. ఆ అంశంపైనే కీలకచర్చ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.