IIIT: రాష్ట్రంలో మరో ట్రిపుల్ఐటీ ప్రాంగణం.. కమిటీ సిఫారసు చేసిన ప్రాంతం ఎక్కడంటే!

author img

By

Published : Aug 22, 2021, 8:13 AM IST

Updated : Aug 22, 2021, 8:45 AM IST

gadwal IIIT campus updates, iiit campus in gadwal

బాసరలోని ట్రిపుల్‌ఐటీకి(IIIT) అనుబంధంగా గద్వాలలోనూ ఓ ప్రాంగణం ఏర్పాటు చేయవచ్చునని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులకు అన్ని రకాలుగా అనుకూలమని సిఫారసు చేసింది. అయితే పూర్తిస్థాయి ప్రాంగణం సిద్ధం కావడానికి దాదాపు రూ.300 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసింది.

బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(RGUKT)కి అనుబంధంగా మరో ప్రాంగణం ఏర్పాటుకు గద్వాల ప్రాంతం అన్ని విధాలా అనుకూలమని నలుగురు సభ్యుల నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇక్కడ ట్రిపుల్‌ఐటీ(IIIT) తరహాలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించింది. ట్రిపుల్‌ఐటీ మాదిరి కళాశాలను తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు(CM KCR) గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కొంతకాలం క్రితం విన్నవించారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో నలుగురు సభ్యులతో కమిటీని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నియమించింది.

ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ఆచార్య ఆర్‌.లింబాద్రి, వి.వెంకటరమణ, జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌, ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఆచార్యుడు కృష్ణయ్య సభ్యులుగా ఉన్నారు. వారు ఈ నెల 7న గద్వాలను సందర్శించారు. వెనుకబడిన ఆ ప్రాంత యువతకు సాంకేతిక కోర్సులపై అవగాహన పెంచి ప్రోత్సహించడానికి గద్వాలలో ఇంజినీరింగ్‌ కళాశాల అవసరమని అభిప్రాయపడినట్లు తెలిసింది. అది బాసర ట్రిపుల్‌ఐటీ మాదిరిగా ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందని సూచించినట్లు సమాచారం. మరోవైపు... వనపర్తికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వైద్య కళాశాల మంజూరు చేసిన నేపథ్యంలో దానికి ఇంజినీరింగ్‌ కళాశాల రానట్లేనని భావిస్తున్నారు.

ముఖ్యమైన సిఫారసులు ఇవీ..

  • గద్వాలలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలతోపాటు పాలమూరు వర్సిటీకి అనుబంధంగా పీజీ కళాశాల ఉంది. పీజీ కళాశాల సమీపంలో 75 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ ఇంజినీరింగ్‌ కళాశాల(IIIT) ఏర్పాటు చేయవచ్చు.
  • ట్రిపుల్‌ఐటీలో రెండేళ్లు ఇంటర్‌, మరో నాలుగేళ్లు బీటెక్‌.. మొత్తం ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు ఉంటాయి. ఆరేళ్లకు కలిపి 170-200 మంది బోధన, బోధనేతర సిబ్బంది అవసరం. మొదటి రెండేళ్లు ఇంటర్‌ తరగతులు నడుస్తాయి. రెండేళ్లపాటు కొద్దిసంఖ్యలోనే సిబ్బంది అవసరం.
  • ఇంజినీరింగ్‌లో 4-5 రకాల కోర్సులను ప్రవేశపెట్టాలి. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, మెకానికల్‌తోపాటు కృత్రిమ మేధ-మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకురావొచ్చు.
  • పూర్తిస్థాయి ప్రాంగణం సిద్ధం కావడానికి దాదాపు రూ.300 కోట్ల నిధులు అవసరమవుతాయి.

ఇదీ చదవండి: RTI: అమలు అంతంతమాత్రం.. వివరాలు అందించడంలో నిర్లక్ష్యం!

Last Updated :Aug 22, 2021, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.