'నెల రోజుల్లోనే కేసీఆర్​ న్యూట్రిషియన్​ కిట్ పథకాన్ని ప్రారంభిస్తాం'

author img

By

Published : May 9, 2022, 3:16 PM IST

'నెల రోజుల్లోనే కేసీఆర్​ న్యూట్రిషియన్​ కిట్ పథకాన్ని ప్రారంభిస్తాం'

Harish Rao Comments: తెరాస హయాంలో సర్కారు దవాఖానాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులను 70శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ఇంత చేస్తుంటే భాజపా, కాంగ్రెస్‌ నేతలు యాత్రల పేరిట ఇష్టారీతిన విమర్శిస్తున్నారని మండిపడ్డారు. భూపాలపల్లి జిల్లాల్లో నెలరోజుల్లో కేసీఆర్​ న్యూట్రిషియన్‌ కిట్లు ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.

Harish Rao Comments: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు 70 శాతం వరకూ పెరగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు ఆకాంక్షించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రైవేట్​ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చెందుతున్నాయని.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బు వృధా చేసుకోవద్దని చెప్పారు. ప్రజలు ఏ ఇబ్బందులతో వచ్చినా వైద్యం అందించే విధంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలన్నారు. పెద్దాపరేషన్ వల్ల గర్భిణులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ఆశా కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఇవాళ భూపాలపల్లికి విచ్చేసిన మంత్రి రూ.102 కోట్ల మేర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

గణపురం మండలం చెల్పూర్ శివారులోని రూ.41.80 కోట్లతో నూతన జిల్లా ఆసుపత్రి భవన నిర్మాణానికి, రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించే 50 పడకల సమీకృత ఆయుష్‌ వైద్యశాలకు శంకుస్థాపన చేశారు. మంజునగర్​లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. 20 పడకల బేబీ కేర్‌ యూనిట్‌కు, డయాగ్నస్టిక్ హబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి వైద్య కళాశాల ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభమైయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి హరీశ్​ రావు తెలిపారు. కిడ్నీ బాధితుల కోసం వారం రోజుల్లోనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రక్తహీనత, ఇతరత్రా సమస్యలున్న వారి కోసం.. నెల రోజుల్లోనే కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్ పథకాన్ని భూపాలపల్లితో పాటుగా 8 జిల్లాల్లో తేనున్నట్లు చెప్పారు.

అభివృద్ధిలో నిరంతరం కష్టపడుతుంటే.. భాజపా, కాంగ్రెస్ నాయకులు కాలియాత్రలు, పాదయాత్రలు చేస్తూ.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీరందలేదని నడ్డా.. తలకాయ లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వీరి ఝూటా మాటలు విశ్వసించేందుకు ప్రజలు అమాయకులు కాదన్నారు. రైతు డిక్లరేషన్ తెస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని.. గతంలో కాంగ్రెస్ హయంలో అంతా రైతు ఆత్మహత్యలు, ఆకలికేకలు, కరెంటు కోతలు, ఎరువుల కోసం పడిగాపులు పడిన విషయాన్ని ప్రజలు మరిచిపోరని చెప్పారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ హయాంలోనే భూపాలపల్లి జిల్లాగా మారి ప్రగతిపథాన పయనిస్తోందని.. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని చెప్పారు.

భూపాలపల్లిలో రూ.102 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. తెలంగాణ రాకముందు భూపాలపల్లిలో ఒక్క పీహెచ్‌సీ ఉండేది. కేసీఆర్ వల్ల వైద్యకళాశాల వరకు భూపాలపల్లి అభివృద్ధి చెందింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు పెరిగాయి. ప్రైవేట్ అస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు మారాయి. అవసరం లేకున్నా గర్భిణులకు పెద్దాపరేషన్లు చేస్తున్నారు. పెద్దాపరేషన్ల వల్ల మహిళలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. సాధారణ ప్రసవాలపై ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలి. సాధారణ కాన్పు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాలి. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు వృధా చేసుకోవద్దు. 70 శాతం కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేలా చూడాలి. -హరీశ్​ రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

'నెల రోజుల్లోనే కేసీఆర్​ న్యూట్రిషియన్​ కిట్ పథకాన్ని ప్రారంభిస్తాం'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.